పొత్తు బేరం.. బీజేపీ కీలక నేతకు టీ టీడీపీ నేత డబ్బు

Update: 2023-01-04 09:53 GMT
దున్నపోతు ఈనిందంటే దూడను దొడ్లో కట్టేయమన్నట్లు.. తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు మధ్య ఇప్పటికే అనేక ఊహాగానాలు మొదలయ్యాయి. ఆ రెండు పార్టీలు కచ్చితంగా కలిసే పోటీచేస్తాయని, బీసీల్లో టీడీపీకి ఉన్న బలం, ఖమ్మం వంటి జిల్లాల్లో ఉన్న సామాజిక బలం అండ రీత్యా బీజేపీ పొత్తుకు వెంటపడుతోందని ఎవరికి వారు అంచనాలు వేస్తున్నాయి. మరోవైపు టీడీపీ అధినేత చంద్రబాబు తెలంగాణలో పార్టీని పునరుజ్జీవింపజేసి, ఇక్కడ బీజేపీ పొత్తు పెట్టుకునేలా చేసి ఏపీలోనూ బీజేపీని తమ దారిలోకి తెచ్చకునే యత్నాలు సాగిస్తున్నట్లు కథనాలు పుట్టుకొస్తున్నాయి.

అయితే, రాజకీయ పార్టీ అన్నాక ఇలాంటివి సహజం. ఈ తరహా ఎత్తులు-పొత్తులతో జిత్తులు వేయకుంటే ఆ పార్టీ మనుగడే కష్టం. మరోవైపు ఎన్నికల వ్యూహాలలో ఆరితేరిన చంద్రబాబు ఎలాంటి అవకాశాన్నీ వదులుకోరు. 2014లో ఇలాగే గెలుపునకు మార్గాలు లేని నేపథ్యం నుంచి విభజిత ఏపీలో బీజేపీ- జన సేనను కలుపుకొని వెళ్లి అద్భుత విజయం సాధించారు. అయితే, 2019 నాటికి ఆ రెండు పార్టీలు దూరమై ఓటమి పాలయ్యారు.

తెలంగాణలో సందడి షురూ

తెలంగాణలో ఎన్నికలకు ఏడాది కూడా లేదు. మహా అంటే 9 నెలల సమయమే ఉంది. బీజేపీ దూకుడు చూస్తుంటే ఇప్పుడే ఎన్నికలు వచ్చినా సిద్ధం అనేలా ఉంది. కాంగ్రెస్ తనదైన శైలిలో వర్గ వైషమ్యాలతో సతమతం అవుతుండగా, టీఆర్ఎస్ బీఆర్ఎస్ గా మారి ముందుకెళ్తోంది. వీటి మధ్యలో చిన్నా చితక పార్టీల సందడి సరేసరి. మొన్నటి మునుగోడు ఎన్నికల్లోనే ఆ సీన్ కనిపించింది. అయితే, ఇప్పుడు ప్రధానంగా చర్చ తెలంగాణలో టీడీపీ-బీజేపీ పొత్తు.

ఈ కోణంలోనే పార్టీని మెరుగ్గా నిలిపే ఉద్దేశంతో టీడీపీ అధినేత చంద్రబాబు.. తెలంగాణ టీడీపీ అధ్యక్షుడిని మార్చారని అనుకుంటున్నారు. కాగా, కాసాని రూపంలో ఆర్థికంగా బలమైన నేత దక్కిన నేపథ్యంలో టీటీడీపీ ఇక భారీ సభలపై చూపు నిలిపింది. ఖమ్మంలో ఇటీవల అలాంటి సమావేశమే చేపట్టి చంద్రబాబును పిలిచింది. దీనికి జనం కూడా భారీగా హాజరవడం మరింత సంచలనమైంది.

ఆ ఊపు చూసే సంప్రదింపులు షురూ

తెలంగాణలో టీడీపీకి కనీసం 15 నుంచి గరిష్ఠంగా 30 నియోజకవర్గాల్లో పట్టుంది. బీసీల్లో అనాదిగా ఆ పార్టీ గూడుకుట్టుకుంది. ఇక తెలంగాణ అంటేనే బీసీల వాయిస్ ఉంటుంది. ఆర్.క్రిష్ణయ్య వంటి వ్యక్తిని పార్టీ సీఎం అభ్యర్థిగా ప్రకటించిన చరిత్ర ఉంది. అలాంటిచోట టీడీపీ మళ్లీ ఉనికి చాటుకునే యత్నం చేయడం మిగతా పార్టీలకు కాస్త చురుకే. అసలే బీజేపీతో పొత్తు ప్రయత్నాలు అంటున్న నేపథ్యంలో హైదరాబాద్ లోని ఓ సంపన్న నియోజకవర్గ టీడీపీ నాయకుడు అప్రమత్తం అయ్యాడు. టీడీపీకి చెందిన అతడు బీజేపీ సీనియర్ నాయకుడిని కలిశాడు. తాను నిలబడబోయే సీటును పొత్తులో భాగంగా టీడీపీకి దక్కేలా చేయమని విన్నవించుకున్నాడు. పనిలో పనిగా ఆ కీలక నాయకుడికి కొంత మొత్తం కూడా సమర్పించినట్లు తెలిసింది.

అయితే, ఆ మొత్తం ఎంతనేది అంటే.. ఆ నియోజకవర్గం స్థాయిని బట్టి చూస్తే రూ.కోట్లలోనే ఉండొచ్చు. వాస్తవానికి 2014లో హైదరాబాద్ లో ఆ నియోజకవర్గంలో టీడీపీ అభ్యర్థే గెలిచారు. తదనంతరం అధికార టీఆర్ఎస్ లోకి వెళ్లారు. అక్కడ కీలక నేతగా మారారు. మరోవైపు ఆ నియోజకవర్గం సెటిలర్లు, ప్రముఖులు, సంపన్నులకు కేంద్రం. అంటే, టీడీపీకి ఎంతో కొంత పట్టుంటుంది. కాబట్టే ఆ టీడీపీ నాయకుడు బీజేపీ కీలక నేతకు సమర్పించుకున్నట్లు సమాచారం.     



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News