రాష్ట్రపతి అయినా స్పందిస్తారా!?

Update: 2015-07-07 17:32 GMT
విశ్రాంతి కోసం హైదరాబాద్‌ వచ్చిన రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి వివిధ పార్టీల నాయకులు విశ్రాంతి లేకుండా చేశారు. ఆయనకు ఫిర్యాదులతో మోత మోగించారు. వాస్తవానికి, కాంగ్రెస్‌ నాయకులు అయినా టీడీపీ నాయకులు అయినా ఇతర నాయకులు ఎవరైనా అంతా కలిసి మాట్లాడుకున్నట్లు విడివిడిగానే అయినా మూకుమ్మడిగా ఒకే ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ పదవుల్లో ఉన్న గవర్నర్‌, శాసనసభ స్పీకర్‌ రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తున్నారు. తమ విధులను మరచి ప్రవర్తిస్తున్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ కూడా ప్రజాస్వామ్య విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు అని!

వాస్తవానికి, ముఖ్యమంత్రి మీద ఫిర్యాదు చేసినా దానిపై రాష్ట్రపతి అంత తొందరగా నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉండదు. అంత సాహసాన్ని కూడా రాష్ట్రపతులు, కేంద్ర ప్రభుత్వాలు చేయవు. కానీ, గవర్నర్‌ను సాక్షాత్తూ రాష్ట్రపతే నియమిస్తారు. గవర్నర్‌ మీద పూర్తి అధికారాలు ఆయనకు ఉంటాయి. ఈసారి రాష్ట్రపతి ఇక్కడికి వచ్చినప్పుడు ఎన్నడూ ఎక్కడా ఎవరిపైనా లేనన్ని ఫిర్యాదులు నరసింహన్‌ మీద వచ్చాయి. అన్ని పార్టీల నాయకులూ ఆయన తీరును తప్పుబట్టారు. మరీ ముఖ్యంగా తలసాని శ్రీనివాస యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చే విషయంలో అంతా ఒకే మాట మాట్లాడారు. ఈ విషయంలో ఆయన రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరించినట్లు కళ్లకు కట్టారు కూడా. పార్టీ ఫిరాయింపుల మీద.. తలసానికి మంత్రి పదవి విషయంలో కాంగ్రెస్‌, టీడీపీ ఎమ్మెల్యేలు తొలుత శాసనసభ స్పీకర్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదు. శాసన మండలి చైర్మన్‌కు పిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదు. గవర్నర్‌ నరసింహన్‌కు ఫిర్యాదు చేశారు. ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడుచివరికి దేశంలోనే అత్యున్నత నిర్ణాయక శక్తి అయినా రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు. మరి, ఇప్పుడు కనీసం రాష్ట్రపతి అయినా పట్టించుకుంటారా? లేకపోతే తమ రోదన అరణ్య రోదన అవుతుందా? ఇప్పుడు రాష్ట్రపతి కూడా పట్టించుకోకపోతే.. గవర్నర్‌, స్పీకర్‌లు చర్యలు తీసుకునేలా ఎటువంటి చర్యలూ తీసుకోకపోతే ఇప్పుడే కాదు.. భవిష్యత్తులోనూ ప్రజాస్వామ్యానికి గోరీ కట్టాల్సిందేనని ఆయా పార్టీల నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు.

Tags:    

Similar News