టీడీపీలోకి తుమ్మ‌ల‌.. మ‌న‌సు మార్చుకున్నారా?

Update: 2022-10-29 11:30 GMT
రాజ‌కీయాల్లో ఎప్పుడు ఏమైనా జ‌ర‌గొచ్చు. నిన్న‌టి వ‌ర‌కు మిత్రుడిగా ఉన్న నాయ‌కుడు.. నేడు శ‌త్రువు కావొచ్చు. నిన్న‌టి వ‌ర‌కు శ‌త్రువుగా ఉన్న పార్టీ నేడు మిత్రుడిగానూ మారొచ్చు. సో.. రాజ‌కీయాల్లో శాశ్వ‌త మిత్రులు-శాశ్వ‌త శ‌త్రువులు అంటూ ఎవ‌రూ ఉండ‌రు. అవ‌స‌రం-అవ‌కాశం.. అనే రెండు ప‌డ‌వ‌ల‌పైనే నాయ‌కులు ప్ర‌యాణాలు చేస్తారు. ఇదే ఇప్పుడు.. మ‌రోసారి.. తెలంగాణ‌లో తెర‌మీద‌కి వ‌చ్చింది. మాజీ మంత్రి, ఒక‌ప్పుడు సీఎం కేసీఆర్ వెంటే నడిచిన సీనియ‌ర్ నాయ‌కుడు తుమ్మ‌ల నాగేశ్వ‌ర‌రావు ఇప్పుడు మ‌ళ్లీ త‌న పాత‌గూటికి వెళ్లిపోనున్నార‌ని తెలుస్తోంది. 2014 వ‌ర‌కు టీడీపీలోనే ఉన్న తుమ్మ‌ల‌.. ఉమ్మ‌డి ఖమ్మం జిల్లాకు చెందిన సీనియ‌ర్ నేత‌.

2014 ఎన్నిక‌ల తర్వాత ఆయ‌న టీడీపీని వీడి టీఆర్ ఎస్‌ లోకి వ‌చ్చారు. ఈ క్ర‌మంలో వ‌చ్చిన ఉప పోరులో గెలిచి కేసీఆర్ కేబినెట్లో చోటు కూడా ద‌క్కించుకున్నారు. ఈ క్ర‌మంలో క‌మ్మ‌ల‌ను ఆక‌ర్షించేందుకు కేసీఆర్.. తుమ్మ‌ల‌ను వాడుకున్నార‌నే ప్ర‌చారం కూడా జ‌రిగింది. అయినా ఇటు తుమ్మ‌ల కానీ, అటు కేసీఆర్ కానీ, రియాక్ట్ కాలేదు. అంతేకాదు, కీల‌క‌మైన భ‌క్త‌రామ‌దాసు ప్రాజెక్టు ప‌నుల‌ను తుమ్మ‌ల‌కు అప్ప‌గించారు కేసీఆర్‌. ఇదిలావుంటే, 2018లో జ‌రిగిన ముంద‌స్తు ఎన్నిక‌ల్లో పాలేరు నుంచి టీఆర్ ఎస్ త‌ర‌ఫున పోటీ చేసిన తుమ్మ‌ల‌.. కాంగ్రెస్ అభ్య‌ర్తి ఉపేంద‌ర్ రెడ్డిపై ప‌రాజ‌యం పాల‌య్యారు. ఇక‌, ఆ త‌ర్వాత కేటీఆర్‌కు.. తుమ్మ‌ల‌కు మ‌ధ్య విభేదాలు ప్రారంభ‌మ‌య్యాయి.

మ‌రోవైపు తాను ఓడిపోయినా.. కేసీఆర్ గుర్తిస్తార‌ని తుమ్మ‌ల భావించారు ఎమ్మెల్సీ అయినా ఇస్తార‌ని అనుకున్నారు. కానీ.. అలా జ‌ర‌గ‌లేదు. ఈ నేప‌థ్యంలో అప్ప‌టి నుంచి ఆయ‌న త‌న సొంత వ్య‌వ‌సాయ ప‌నుల‌కే ప‌రిమిత‌మ‌య్యారు. ఇదిలావుంటే, ముంద‌స్తు ఎన్నిక‌లు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న నేప‌థ్యంలో ఇటీవ‌ల కాలంలో మ‌ళ్లీ య‌క్టివ్ అవుతున్నారు. కానీ, టీఆర్ ఎస్‌లో ఇక్క‌డే పెద్ద మార్పు జ‌రిగింది. తుమ్మ‌ల‌పై ఓడిపోయిన ఉపేంద‌ర్ రెడ్డిని కేటీఆర్ అక్కున చేర్చుకున్నారు.వ చ్చే ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న‌కే టికెట్ ఇస్తార‌నే ప్ర‌చారం జ‌రుగుతోంది. ఈ నేప‌థ్యంలో తుమ్మ‌ల విష‌యంపై చ‌ర్చ‌సాగుతున్నా.. పార్టీలో అధిష్టానం నుంచి మాత్రం ఎలాంటి సంకేతాలు రావ‌డం లేదు. దీంతో పార్టీ మార‌డ‌మే బెట‌ర్ అని తుమ్మ‌ల ఒక నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్టు కొన్నాళ్లుగా చ‌ర్చ సాగుతోంది.

టీడీపీకి చేరువ‌! తాజాగా ఖమ్మం జిల్లాలో టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకల్లో తుమ్మల నాగేశ్వరరావు పాల్గొన్నారు. సత్తుపల్లి కాకర్లపల్లి రోడ్డు నుంచి లింగపాలెం వరకు నిర్వహించిన బైక్ ర్యాలీకి టీడీపీ శ్రేణులు హాజరయ్యారు. రాజకీయాలకు అతీతంగా కుల, మతాలకు అతీతంగా దైవం అయిన ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల నిర్వహణకు ఆహ్వానించడం చాలా సంతోషంగా ఉందని తుమ్మ‌ల అన్నారు.

ఎన్టీఆర్ రాజకీయ జన్మనిస్తే ప్రజలు, అభిమానులు ఈరోజు త‌నను ఇలా ఉండేలా చేశారని తుమ్మల అన్నారు. ఇదిలా ఉంటే తుమ్మలను మళ్లీ పార్టీలోకి రావాల్సిందిగా కొందరు టీడీపీ క్యాడర్ ఒత్తిడి చేసినట్లు వార్తలు వస్తున్నాయి. తగిన సమయంలో తగిన నిర్ణయం తీసుకుంటానని తుమ్మల ఆఫ్ ద రికార్డ్ చెప్పారని అంటున్నారు. ఖమ్మం జిల్లా ఆంధ్రప్రదేశ్‌కు సరిహద్దుగా ఉంది, ఇక్కడ టీడీపీకి ఇప్పటికీ గణనీయమైన ప్రాబల్యం ఉంది.

2018లో టీడీపీ ఘోర పరాజయం పాలైన తరుణంలో జరిగిన ఎన్నికల్లో కూడా జిల్లాలో రెండు స్థానాల్లో ఆ పార్టీ విజయం సాధించింది. తుమ్మల పార్టీలో చేరి జిల్లాలో కష్టపడితే 2023లో పార్టీ మరోసారి ఖాతా  తెరుస్తుంద‌నే అభిప్రాయం వుంది. ఇటీవలి కాలంలో తెలంగాణ టీడీపీ యాక్టివ్‌గా మారి బలమైన బీసీ నేతను పార్టీలోకి చేర్చుకుంది. ఖమ్మం తదితర ప్రాంతాల్లో భారీ బహిరంగ సభలు నిర్వహించాలని పార్టీ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ ప‌రిణామాల క్ర‌మంలో తుమ్మ‌ల వ‌స్తానంటే.. చంద్ర‌బాబు రెడ్ కార్పెట్ ప‌ర‌వ‌డం ఖాయ‌మ‌ని చెబుతున్నారు.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News