ఏపీ ఓటర్ల లెక్క తేలింది.. మగాళ్ల కంటే ఆడోళ్లే ఎక్కువ

Update: 2020-02-15 15:30 GMT
ఏపీ ఓటర్ల లెక్క తేల్చారు. మొత్తం ఓటర్లు 3,99,37,394కు చేరినట్లు గా తేలింది. ఓటర్ల జాబితాకు సవరణలు చేపట్టిన జాబితాను తాజాగా విడుదల చేశారు. దీని ప్రకారం రాష్ట్రం లో కొత్తగా 1,02,618 మంది ఓటర్లు పెరిగారు. 2019 డిసెంబరు 23న ముసాయిదా ఓటర్ల జాబితాకు సమగ్ర సవరణ చేపట్టిన తర్వాత కొత్తగా ఓటర్ల జాబితా లో 1.63లక్షల మంది ఓటర్లు చేరారు. అదే సమయం లో 60వేల మంది వరకూ ఓటర్లను తొలగించారు. తాజాగా ఫైనల్ చేసిన ఓటర్ల జాబితా ప్రకారం ఏపీలో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లు ఎక్కువ గా ఉండటం గమనార్హం.

పురుష ఓటర్లు 1,97,27,370 మంది ఉంటే మహిళా ఓటర్లు 2,02,05,956గా లెక్క తేల్చారు. థర్డ్ జెండర్స్ 4,068 మందిగా తేలింది. ఎన్ ఆర్ ఐ ఓటర్లు 7,436గా ఉంటే.. సర్వీసు ఓటర్లు 65,388గా తేల్చారు. ఇక ఓటర్ల జాబితానుపరిశీలిస్తే.. రాష్ట్రంలో అత్యధిక ఓటర్లు తూర్పుగోదావరి జిల్లాలో ఉన్నట్లు తేలింది. తర్వాతి స్థానాల్లో గుంటూరు.. విశాఖ.. కృష్ణా జిల్లాలు నిలిచాయి.

రాష్ట్రం లో అతి తక్కువ ఓటర్లు ఉన్న జిల్లాల్లో విజయనగరం మొదటి స్థానం లో నిలిస్తే.. తర్వాతి స్థానాల్లో శ్రీకాకుళం.. కడప.. నెల్లూరులు నిలిచాయి. అనంతపురం మినహా మిగిలిన అన్ని జిల్లాల్లోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువ కావటం విశేషం. తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా మహిళా ఓటర్లు ఉంటే.. అతి తక్కువగా విజయనగరంలో ఉన్నట్లుగా తేలింది.

ముసాయిదా జాబితాకు.. తాజాగా జాబితాకు మధ్య వ్యత్యాసం ఎక్కువగా ఉన్న జిల్లాల్లో మొదటి మూడు స్థానాల్లో కర్నూలు.. చిత్తూరు.. అనంతపురం జిల్లాలు నిలిచాయి. ముసాయిదా కంటే తక్కువగా ఫైనల్ అయిన జిల్లా విషయానికి వస్తే విశాఖ నిలిచింది. అక్కడ ముసాయిదా కంటే 1,168 ఓట్లు తక్కువగా ఉండటం గమనార్హం. ఈ జిల్లాను మినహాయిస్తే.. ముసాయిదాలో తక్కువగా నమోదైన జిల్లాల విషయానికి వస్తే ప్రకాశం.. కృష్ణా.. తూర్పుగోదావరి జిల్లాలు నిలిచాయి.
Tags:    

Similar News