నిజమండీ బాబూ...ఆ బిల్లులు సెలెక్ట్ కు వెళ్లలేదట!

Update: 2020-01-24 13:58 GMT
ఏపీకి మూడు రాజధానులను ఏర్పాటు దిశగా సాగుతున్న సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బుధవారం నాటి శాసనమండలి సమావేశాల్లో ఎదురు దెబ్బ తగిలిందని... వికేంద్రీకరణ బిల్లుతో పాటు సీఆర్డీఏ రద్దు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ మండలి చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని దాదాపుగా అన్ని మీడియా సంస్థలు ప్రత్యేక కథనాలు రాశాయి. ఒక్కసారి బిల్లు సెలెక్ట్ కమిటీకి వెళ్లిందంటే... ఆ వ్యవహారం తెమిలేసరికి ఎంత సమయం పడుతుందన్న విషయాన్ని కూడా చెప్పలేమని, ఈ దెబ్బతో జగన్ మూడు రాజధానుల మాట దాదాపుగా అటకెక్కినట్టేనన్న వార్తలూ వినిపించాయి. అయితే ఈ రెండు బిల్లులు సెలెక్ట్ కమిటీకే వెళ్లలేదని మండలి చైర్మన్ మహ్మద్ షరీఫ్ సంచలన ప్రకటన చేశారు.

బుధవారం రాత్రి బిల్లుల ప్రవేశం తర్వాత వాటిపై చైర్మన్ ఏ రీతిన వ్యవహరిస్తారన్న ఉత్కంఠ నేపథ్యంలో.. బిల్లులను పాస్ చేయించుకునేందుకు వైసీపీ, అడ్డుకునే దిశగా విపక్ష టీడీపీ చైర్మన్ పోడియాన్ని చుట్టుముట్టి రచ్చరచ్చ చేశాయి. ఈ సమయంలో రెండు బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపుతూ చైర్మన్ నిర్ణయం తీసుకున్నారని ఇటు వైసీపీతో పాటు అటు టీడీపీ కూడా చెప్పేసుకున్నాయి. దీంతో భంగపాటు ఎదురైందని వైసీపీ, తమ పంతం నెగ్గించుకున్నామని టీడీపీ చెప్పుకున్నాయి. ఈ రెండు పార్టీలకు అనుకూలంగా ఉన్న పత్రికలు కూడా బిల్లులు రెండూ సెలెక్ట్ కమిటీకే వెళ్లాయని రాశాయి.

అయితే ఈ మొత్తం తంతును శ్రద్ధతో ఫాలో అయిన ఓ ప్రముఖ మీడియా సంస్థ మాత్రం బిల్లులు రెండూ సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని, కేవలం వాటిపై నిర్ణయాన్ని చైర్మన్ వాయిదా వేశారని రాసింది. తాజాగా ఈ పత్రిక రాసిన మాటే నిజమంటూ చైర్మన్ షరీఫ్ కూడా సంచలన వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడిన సందర్భంగా షరీఫ్ ఈ మేరకు సంచలన వ్యాఖ్యలు చేశారు. బిల్లులను ఏం చేయాలన్న ప్రక్రియను వాయిదా మాత్రమే వేశామని, అలాంటప్పుడు బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఎలా పంపుతామంటూ ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. మొత్తంగా బిల్లులు రెండూ సెలెక్ట్ కమిటీకి వెళ్లలేదని తేలిపోయింది.


Tags:    

Similar News