ఉద్దవ్ ఠాక్రే సీఎం పోస్టు ఊడిపోనుందా?

Update: 2020-04-23 12:30 GMT
మహారాష్ట్రలో కరోనా వైరస్ విలయతాండవం కొందరి పీఠాలనే కదిలించబోతోంది. అక్కడ వైరస్ ను అదుపు చేయలేక ప్రస్తుత సీఎం, శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే ఆపసోపాలు పడుతున్నారు. దీన్ని సదావకాశంగా బీజేపీ మలుచుకుంటోందా? ఆయన పోస్టుకే ఎసరు పెడుతోందా? మరాఠా గడ్డపై మరో రాజ్యాంగ పరమైన సంక్షోభం తలెత్తే సూచనలు కనిపిస్తున్నాయా? అంటే ఔననే అంటున్నారు కొందరు పరిశీలకులు.

మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే ముఖ్యమంత్రి పీఠం మున్నాళ్ల ముచ్చటేనా అన్న ప్రచారం అక్కడి రాజకీయ వర్గాల్లో సాగుతోంది. గత ఏడాది నవంబర్ 28న ఆయన సీఎంగా ప్రమాణం చేశారు. అయితే ఉద్దవ్ ఠాక్రే అటు ఎమ్మెల్యే కాదు.. ఇటు ఎమ్మెల్సీ కూడా కాదు.. శివసేన చీఫ్ హోదాలో ఏకంగా సీఎం పీఠం ఎక్కేశారు. ఆరు నెలలలోపు ఏదైనా చట్టసభ నుంచి ప్రాతినిధ్యం వహించాలి. అది రాజ్యాంగ నిబంధన. ఇప్పుడు ఇదే ఉద్దవ్ సీఎం పోస్టుకు ఎసరు పెడుతోంది.

ఉద్దవ్ ఠాక్రే సీఎంగా గద్దెనెక్కి ఈనెల 28తో ఆరునెలలు పూర్తి కాబోతున్నాయి. దీంతో ఆయనను గవర్నర్ కోటా నుంచి ఎమ్మెల్సీగా నామినేట్ చేయాలంటూ కేబినెట్ తీర్మానం చేసి పంపారు. కానీ ఈ బీజేపీ సానుభూత గవర్నర్ కోషియారీ.. ఎంతకూ ఉద్దవ్ ను ఎమ్మెల్సీగా నామినేట్ చేయడం లేదు. ఇప్పుడు గడువు లోపు బీజేపీ చక్రం తిప్పితే ఉద్దవ్ సీఎం పోస్టు ఊస్ట్ అవుతుంది. గవర్నర్ నామినేట్ చేయకపోతే పదవికి రాజీనామా చేయాల్సి ఉంటుంది. అదే జరిగితే మహారాష్ట్రకు కొత్త సీఎం రావడం ఖాయం.

గవర్నర్ ఉద్దవ్ ను నామినేట్ చేయకుండా నాన్చడం.. వెనుక బీజేపీ హస్తం ఉండడంతో ఇప్పుడు మహారాష్ట్ర రాజకీయం రసకందాయంలో పడింది. మార్చి 26న 9 ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉన్నా కరోనా కారణంగా వాయిదాపడ్డాయి. దీంతో ఉద్దవ్ రాజకీయ భవిష్యత్ గందరగోళంలో పడింది.

గవర్నర్ తనకు ఇష్టమైన వారిని.. వివిధ రంగాల నిపుణులను (రాజకీయ నేతలను కాదు) నామినేట్ చేసే అధికారం కలిగి ఉన్నారు. ఆయనను ప్రశ్నించడానికి కోర్టులకు - ప్రభుత్వాలకు అధికారం లేదు. దీంతో ఇప్పుడు గవర్నర్ నిర్ణయంపైనే ఉద్దవ్ మహారాష్ట్ర సీఎం పోస్టు ఆధారపడి ఉంది.
Tags:    

Similar News