తెలంగాణ రాజకీయాలు మారుతున్నాయా? త్వరలోనే భారీ మార్పుల దిశగా అడుగులు పడుతున్నాయా? అంటే.. ప్రస్తుతం జరుగుతున్న రాజకీయ పరిణామాలను బట్టి ఔననే అంటున్నారు పరిశీలకులు. గత వారం నుంచి తెలంగాణలో జరుగుతున్న పరిణామాలను నిశితంగా గమనిస్తే.. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏదో పెద్ద ప్రణాళికను సిద్ధం చేసుకున్నట్టుగా కనిపిస్తోంది. వాస్తవానికి.. కేసీఆర్ ఏం చేసినా సంచలనమే. ఆయన మాట.. భాష.. శైలి.. రాజకీయాల్లో అనూహ్యంగా మారిపోతుంటాయి. ఆయన అనుకున్నది ఏదైనా సాధించే తత్వం ఉన్న నాయకుడిగా గుర్తింపు పొందారు.
అది తెలంగాణ ఉద్యమం అయినా.. మరేదైనా.. కేసీఆర్ స్టయిలే వేరు. గత వారం రోజులుగా కేసీఆర్ దృష్టి అంతా కూడా జాతీయ రాజకీయాలపై ఉంది. గురువారం కేసీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని..ఒక అనహ్యమైన పరిణామం తెరమీదికి వచ్చింది.
ఢిల్లీలో `కేసీఆర్ విజన్ ఆఫ్ ఇండియా` అనే నినాదంతో పెద్ద ఎత్తున ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. అంటే.. దీనిని బట్టి కేసీఆర్ జాతీయ రాజకీయాల్లో తీవ్రస్థాయిలో దృష్టి పెట్టారనే విషయం స్పష్టంగా తెలిసింది. ఆయనకు ఇప్పుడు రాష్ట్రంపై కంటే..కూడా జాతీయ రాజకీయాలపైనే ఎక్కువగా ఇంట్రస్టు ఉన్నట్టుగా కనిపిస్తోంది.
మరోవైపు.. జాతీయ రాజకీయాలు అంటే.. మాటలు కావు. అనేక సమస్యలు.. అనేక డిమాండ్లు.. ముఖ్యంగా ఉత్తరాది ప్రజల మనసు దోచుకోవాలి. ఈ క్రమంలోనే కొన్నాళ్ల కిందట.. కేసీఆర్‌కు జాతీయ రాజకీయాల వ్యూహకర్త.. ప్రశాంత్ కిశోర్.. కొన్ని సలహాలు ఇచ్చినట్టు తెలిసింది. దీనిలో భాగంగానే.. పీకే ఇచ్చిన సలహాలతోనే కేసీఆర్ తన వ్యూహాన్ని జాతీయ రాజకీయాలపైకి మళ్లించారని అంటున్నారు పరిశీలకులు. ఈ క్రమంలోనే గత వారంనుంచి ప్రధాని నరేంద్ర మోడీని, బీజేపీని కూడా కేసీఆర్ ఉతికిఆరేస్తున్నారని అంటున్నారు.
ఇటీవల అనేక జాతీయ అంశాలను కేసీఆర్ స్పృశించారు. మోడీ అవినీతి చిట్టా తన దగ్గర ఉందన్నారు. రఫేల్ యుద్ధ విమానాల గోప్యం ఎందుకని ప్రశ్నించారు.. అదేసమయంలో అసోం ముఖ్యమంత్రిపైనా విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ నాయకుడు రాహుల్ పై ఆయన చేసిన వివాదాస్పద వ్యాఖ్యల నేపథ్యంలో కేసీఆర్ కాంగ్రెస్ నేతలకంటే.. ముందుగా స్పందించారు. దీంతో కేసీఆర్‌కు అనూహ్యంగా బీజేపీ యేతర పార్టీలు ప్రభుత్వాలు ఉన్న రాష్ట్రాల నుంచి ఆయనకు మద్దతుతో పాటు ఫోన్లు కూడా వచ్చాయి. ఈ క్రమంలోనే కేసీఆర్ జాతీయ రాజకీయాలపై దృష్టి పెట్టారు.
ఈ క్రమంలో మరి కేసీఆర్ రాజకీయాలపై దృష్టి పెడితే.. రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అవుతారు? అనేది ప్రశ్న. అందుకే.. వచ్చే ఎన్నికల్లో తెలంగాణ ముఖ్యమంత్రిగా ఆయన కుమారుడు, మంత్రి కేటీఆర్‌ను.. ప్రొజెక్టు చేసే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇదే విషయంపై అధికార పార్టీలోనూ చర్చగా మారిపోయింది. ఇక, ఇప్పటికే.. కేటీఆర్ కూడా.. తన వ్యూహాన్ని మార్చుకున్నట్టు స్ప ష్టంగా కనిపిస్తోంది. ఆయన వ్యాఖ్యలు.. చేస్తున్న పనులు కూడా సీఎం స్థాయిలో ఉన్నాయనే టాక్ అధికార పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.