రామోజీ ‘పద్మం’పై హైకోర్టులో పిల్

Update: 2016-03-03 04:39 GMT
అప్పుడెప్పుడో వైఎస్ జమానాలో రామోజీకి ఉండవల్లికి మధ్య నడిచిన లడాయి తెలిసిందే. మార్గదర్శి ఎపిసోడ్ లో ఉండవల్లితో వైఎస్ ఆడిన గేమ్ కి మీడియా మొఘల్ రామోజీరావు ఎంతగా ఉక్కిరిబిక్కిరి అయ్యారో తెలిసిందే. ఎవరి చేతా ఎప్పుడూ వేలెత్తి చూపించుకునే అవకాశం ఇవ్వని రామోజీ.. మార్గదర్శి ఇష్యూలో నోటి వెంట మాట రాని పరిస్థితి. అయితే.. ఆ ఇష్యూను డీల్ చేసేందుకు తన శక్తియుక్తుల్ని మొత్తాన్ని సమీకరించి తానేంటో చెప్పే ప్రయత్నం రామోజీ చేస్తే.. ఆయనకు ప్రజల్లో ఉన్న ఇమేజ్ ఏమిటన్నది బయటపడింది.

ఏదైనా ఆర్థిక సంస్థ పరిస్థితి బాగోలేదన్న మాట లీలగా బయటకు వచ్చినా.. పెద్ద గందరగోళమే చోటు చేసుకుంటుంది. అలాంటిది.. మార్గదర్శి ఇష్యూలో మాత్రం అందుకు భిన్నమైన పరిస్థితి. నాటి వైఎస్ సర్కారు స్వయంగా రంగంలోకి దిగినా.. రామోజీ పట్ల కించిత్ సందేహాన్ని వ్యక్తం చేయకుండా ప్రజలు వ్యవహరించిన తీరుపై అప్పట్లో విస్మయం వ్యక్తం కావటమే కాదు.. రామోజీకి ప్రజల్లో ఇంత నమ్మకం ఉందా? అని ఆశ్చర్యపోయిన పరిస్థితి.

ఒక్కమాటలో చెప్పాలంటే... అప్పటివరకు రామోజీకి కూడా తనకంత క్రెడిబులిటీ ఉందని తెలియలేదట.​ నిబంధనలకు విరుద్ధంగా మార్గదర్శి కార్యకలాపాలు సాగుతున్నాయన్న ఆరోపణలతో వైఎస్ బ్యాచ్ గురి చూసి కొడితే.. రామోజీ దాన్ని సమర్థంగా ఎదుర్కొన్నారు. ఈ ఎపిసోడ్ లోనే ప్రియా పచ్చళ్లు మొదలు చాలానే అంశాల మీద రామోజీపై ఉండవల్లి అరుణ్ కుమార్ ఆరోపణలు చేశారు. ఎన్ని చేసినా.. రామోజీపై తాను చేసిన ఆరోపణల్ని చట్టబద్ధంగా (ఇప్పటివరకూ) ఫ్రూవ్ చేయలేకపోయారు.

అయితే మార్గదర్శి ఫైనాన్షియర్స్ సేకరించిన డిపాజిట్లు మాత్రం ఒకేసారి వేలకోట్లు జనానికి తిరిగి వెంటనే ఇచ్చేయాల్సి రావడంతో రామోజీరావు లిక్విడిటీ ఇబ్బందులు ఎదుర్కొన్నారు.​ ఇదిలా ఉంటే.. తనపై కత్తి కట్టిన ఉండవల్లిపై రామోజీ అండ్ కో కత్తి కట్టిందన్న ఆరోపణలు ఉన్నాయి. ఆయనకు సంబంధించిన వార్తలు ఏమీ ఆయన మీడియా సంస్థలో కనిపించకుండా చేశారన్న విమర్శలు మొదట్లో వినిపించినా.. ఆ తర్వాతి కాలంలో ఆయన వార్తలు రామోజీ మీడియా సంస్థలో వచ్చేవి. ఈ పరిణామాలతో ఇద్దరి మధ్య నడిచిన వార్ ముగిసినట్లేనని అందరూ అనుకున్నారు.

తాజాగా.. ఉండవల్లి అరుణ్ కుమార్ రామోజీరావు మీద ఒక పిల్ ను హైకోర్టులో దాఖలు చేశారు. రామోజీకి పద్మవిభూషణ్ పురస్కారాన్ని ప్రకటించటాన్ని ప్రశ్నిస్తూ.. ఉమ్మడి హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాఖ్యాన్ని దాఖలు చేయటం ఆసక్తికరంగా మారింది. ఈ పిల్ లో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ కార్యదర్శి.. ఏపీ.. తెలంగాణ ప్రభుత్వాల ముఖ్యకార్యదర్శలు.. వ్యక్తిగత హోదాలో రామోజీరావును ప్రతివాదులుగా చేర్చారు. ముగిసిందనుకున్న వార్.. తాజా పిల్ తో ఇరువురి మధ్య మళ్లీ షురూ అయిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Tags:    

Similar News