ఉండవల్లి చెప్పింది నిజమేనా ?

Update: 2022-06-14 08:38 GMT
సీనియర్ నేత, మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ చెప్పింది నిజమేనా ? ఇంతకీ ఆయన ఏమి చెప్పారు ? దేశం మొత్తం మీద బీజేపీ బాగా బలంగా ఉన్నది ఏపీలోనే అన్నారు. అదేమిటి ఏపీలో బీజేపీ బలంగా ఉండటం ఏమిటనే సందేహం వస్తోంది. ఠికాణాయేలేని బీజేపీ ఏపీలో బలంగా ఉండటం ఏమిటనేందుకు ఆయన తనదైన పద్ధతిలో సెటైరికల్ గా కారణం చెప్పారు.

ఇంతకీ ఆయన చెప్పిన కారణం ఏమిటంటే ఏపీలో జగన్మోహన్ రెడ్డి అయినా చంద్రబాబు నాయుడు అయినా నరేంద్రమోడిని వ్యతిరేకించటం లేదట. ఇద్దరిలో ఎవరు అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా మోడికే జీహుజూర్ అంటున్నారట.

ఏ ఒక్క విషయంలో కూడా మోడీని వ్యతిరేకించలేకపోవటంతో గెలిచిన ఎంపీలు, ఎంఎల్ఏలంతా బీజేపీ వాళ్ళే అన్నట్లుగా ఉండవల్లి సెటైర్లు వేశారు. ఉండవల్లి చెప్పారని కాదు కానీ వాస్తవంగా జరుగుతున్నదిదే.

వ్యక్తిగత అవసరాల కోసం జగన్, చంద్రబాబు కేంద్ర ప్రభుత్వాన్ని ఎదురించలేని స్ధితిలో ఉన్నారు. దాన్ని అలుసుగా తీసుకుని మోడి రాష్ట్ర ప్రయోజనాలను తుంగలో తొక్కేస్తున్నారు. అయినా జగన్, చంద్రబాబు కేంద్రాన్ని పల్లెత్తు మాట అనలేకపోతున్నారు.

దీన్ని దృష్టిలో ఉంచుకునే ఉండవల్లి ఇద్దరికి చురకలు వేశారు. రాష్ట్రపతి ఎన్నికల్లో మద్దతు కావాలంటే జగన్ కొన్ని షరతులు పెడితే ప్రత్యేక హోదా లాంటివి అన్నీ వస్తాయని ఉండవల్లి చెప్పింది కరెక్టే. కానీ షరతులు పెట్టేంత సీన్ జగన్ కు లేదని అందరికీ తెలుసు.

మోదీ ప్రధానమంత్రిగా ఉన్నంతకాలం లేదా కేంద్రంలో మోడి బలంగా ఉన్నంతకాలం ఏపీ ప్రయోజనాలు ఏవీ నెరవేరే అవకాశం లేదు. కాబట్టి జగన్ షరతులు పెట్టి కావాల్సినవి సాధించుకునే అవకాశం లేదు. 2024 ఎన్నికల్లో మోడి బలహీనపడితే లేదా ప్రధానిగా మోడి స్ధానంలో ఇంకెవరైనా వస్తే కానీ ఏపీకి ప్రత్యేక హోదా డిమాండులో కదలిక రాదు. ఎందుకంటే విభజన చట్టంలో సజావుగా ఏపీకి రావాల్సిన ప్రత్యేక హోదా హామీ రాజకీయ వివాదంగా మారిపోయింది. కాబట్టి కేంద్రంలో మార్పు వచ్చేంతవరకు ఎవరు ఏమి చేయగలిగేది లేదన్నది స్పష్టం.
Tags:    

Similar News