ప‌ట్టిసీమ‌పై ఆయ‌న మ‌ళ్లీ ఫైర‌య్యారు

Update: 2017-01-07 05:15 GMT
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు త‌న స్వార్థం కోసం ఆత్మ‌భిమానానిన్ని చంపుకుంటున్నార‌ని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. పోలవరం కోసం ప్రత్యేక హోదాను త్యాగం చేయాల్సి వచ్చిందని చంద్ర‌బాబు పేర్కొనడం ఆయ‌న తీరుకు నిద‌ర్శ‌న‌మ‌ని వ్యాఖ్యానించారు. తాను రాజీ పడకపోతే పోలవరం వచ్చేది కాదని చెబుతున్న బాబు ఈ వ్యవహారంలో అసలు ఏమి జరిగిందో ప్రజలకు బహిర్గతం చేయాలని అరుణ్‌ కుమార్ డిమాండ్ చేశారు.

పోల‌వ‌రం ప్రాజెక్టుకు జాతీయ హోదా క‌ల్పించాల‌నే కాంగ్రెస్ హయాంలోని ఆర్డినెన్స్‌ను ఎన్‌ డిఎ ఎందుకు యథాతథంగా అమలుచేయలేదో, దాని వెనుక ఏమి జరిగిందో చంద్ర‌బాబు తేటతెల్లం చేయాలని ఉండ‌వ‌ల్లి డిమాండ్ చేశారు. తాను ప్రమాణం స్వీకారం చేయనని చెప్పడంవల్లే పోలవరానికి ఒప్పుకున్నారని చంద్రబాబు ఎందుకు చెప్పారో, అసలు ఏమి జరిగిందో ప్రజలకు వివ‌రించాల‌ని కోరారు. బాబు ప్రమాణం చేసేందుకు ముందు ఢిల్లీలో ఏమి జరిగిందో బయటపెట్టాలన్నారు. హోదా కోసం పోరాటం చేసి ఉంటే పోలవరానికి నిధులు వచ్చేవి కాదని చెప్తూ  తాను రాజీ పడ్డాను కాబట్టే పోలవరం వచ్చిందంటే అంతకంటే దౌర్భాగ్యం మరోటి లేదని విమర్శించారు. సొంత ప్రయోజనాల కోసం ఇంతగా దిగజారే మనస్తత్వం చంద్రబాబునాయుడుకు ఎందుకు వ‌చ్చింద‌ని ఉండవల్లి ప్ర‌శ్నించారు. చేవచచ్చి అంతగా దిగజారాల్సిన ఖర్మ ఆంధ్రాకు లేదని, ఆత్మాభిమానం దెబ్బతీసేలా మాట్లాడవద్దని చంద్ర‌బాబుకు ఘాటు సూచ‌న చేశారు.

పట్టిసీమ ముమ్మాటికీ దండగని తాము చెప్తున్నామని పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టా గట్టెక్కలేదని నిరూపిస్తామని ఉండ‌వ‌ల్లి సవాల్‌చేశారు. పట్టిసీమ వల్లే రాయలసీమకు నీళ్ళిస్తున్నామనడం వాస్తవ విరుద్ధమన్నారు. కృష్ణా డెల్టాలో ఈస్ట్రన్ డెల్టాకు 65 టీఎంసీలు, వెస్ట్రన్ డెల్టాకు 48 టిఎంసిలు వెరసి 113 టిఎంసిలు ఖరీఫ్‌కు వినియోగించారన్నారు. ఇందులో పులిచింతల నుంచి 105 టిఎంసిలు, కీసర నుంచి 15 టిఎంసిలు, పట్టిసీమ నుంచి 49 టిఎంసిలు వెరసి 169 టిఎంసిలు తీసుకున్నారన్నారు. పట్టిసీమ ద్వారా జలాలను తోడి కృష్ణాలో వేసిన 55 టిఎంసిలు సముద్రంలోకి విడిచిపెట్టారన్నారు. మొత్తం రూ.1670 కోట్లతో నిర్మించిన పట్టిసీమ ద్వారా రూ.16 కోట్లు విద్యుత్ ఖర్చుచేసి నీరు తోడి సముద్రంలో పోసినట్టయిందని, దీనిని బట్టి మొత్తం నిధులన్నీ గోదాట్లో పోసినట్టేనని ఆందోళన వ్యక్తం చేశారు. పురుషోత్తపట్నం శంకుస్థాపన పిఠాపురంలో చేసేలా వుంటే అమరావతిలోనే చేయవచ్చన్నారు. పోలవరంలో నిధుల గందరగోళం ఉందని ఉండ‌వ‌ల్లి ఆరోపించారు.


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News