పేదల కోసం మాట్లాడితే చంపేస్తారు: ఉండవల్లి అరుణ్ కుమార్ సంచలనం

Update: 2021-03-22 12:56 GMT
అందరూ వదిలేస్తే పేదల కోసం మాట్లాడేవారిని కాల్చి చంపేసే పరిస్థితి దేశంలో వస్తుందని రాజమండ్రి మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ తీవ్ర హెచ్చరికలు జారీ చేశారు. ఇప్పటికైనా రాజకీయ పార్టీలన్నీ ఏకమై దేశంలో జరుగుతున్న ఈ ప్రైవేటీకరణలను వ్యతిరేకించాలని ఆయన పిలుపునిచ్చారు.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమంలో భాగంగా ఈనెల 26న కమ్యూనిస్టు పార్టీలు భారత్ బంద్ కు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఈ బంద్ కు సహకరించాలని కమ్యూనిస్టు నేతలు సోమవారం రాజమండ్రిలో ఉండవల్లి అరుణ్ కుమార్ ను కలిసి విన్నవించారు. ఈ సందర్భంగా ఉండవల్లి మీడియాతో మాట్లాడుతూ సంచలన వ్యాఖ్యలు చేశారు. స్టీల్ ప్లాంట్ కు మద్దతుగా జరుగుతున్న బంద్ కు తాను సంపూర్ణ మద్దతు ఇస్తున్నానని ప్రకటించారు. కేంద్రప్రభుత్వ తీరుపై ఉండవల్లి ఘాటు వ్యాఖ్యలు చేశారు.

దేశంలో కమ్యూనిస్టులు లేకపోతే పేదల సమస్యల గురించి మాట్లాడే రాజకీయ పార్టీలు కనుమరుగై పోతాయన్నారు. ప్రధాని మోడీ పాలనలో దేశంలో ప్రభుత్వ ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని మండిపడ్డారు.కొన్ని క్యాపిలిస్టు దేశాల్లో పేద ప్రజల గురించి మాట్లాడితే కాల్చి చంపేసిన చరిత్ర ఉందని.. మన దేశంలో అలాంటి పరిస్థితులు ఉత్పన్నం కాకుండా చూసుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని ఉండవల్లి అరుణ్ కుమార్ అన్నారు. 2004 మార్చి 31 నాటికి భారత దేశ అప్పు రూ.46 లక్షల కోట్లు ఉంటే.. 2020 డిసెంబర్ నాటికి మోడీ సర్కార్ దాన్ని 1.07 కోట్ల రూపాయలకు పెంచారని విమర్శించారు.
Tags:    

Similar News