జ‌గ‌న్ కు అదిరిపోయే స‌ల‌హా ఇచ్చిన ఉండ‌వ‌ల్లి

Update: 2017-01-28 05:47 GMT
ఏపీ ప్ర‌తిపక్ష నేత‌ - వైసీపీ అధినేత వైఎస్ జగన్‌ కు మాజీ ఎంపీ - కాంగ్రెస్ నాయకుడు ఉండవల్లి అరుణ్‌ కుమార్ అదిరిపోయే స‌ల‌హా ఇచ్చారు. చిన్నా చిత‌కా టార్గెట్‌ లు ఎందుకు ఏకంగా కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఇర‌కాటంలో పెట్టే త‌న ఆలోచ‌న‌ను అమ‌ల్లో పెట్టాల‌ని ఉండ‌వ‌ల్లి సూచించారు. ఏపీకి ప్ర‌త్యేక హోదా కోరుతూ కేంద్ర ప్ర‌భుత్వం పై అవిశ్వాసం పెట్టాల‌న్నారు. మూడేళ్లు నిండిన తర్వాత ఎలాగూ రాజీనామా చేస్తారన్నారు కాబట్టి ఆ రాజీనామా ఇచ్చే ముందు కేంద్ర ప్రభుత్వంపై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదించి ఆపై రాజీనామా చేస్తే బావుంటుందని, ఆ దిశగా కృషిచేయాలని ఉండ‌వ‌ల్లి సూచించారు. జగన్ పెట్టబోయే అవిశ్వాస తీర్మానానికి కచ్చితంగా కాంగ్రెస్ - సీపీఎం - తృణమూల్ కాంగ్రెస్ వంటి పార్టీలు కలసి వస్తాయన్నారు. ఏకవ్యక్తి అవిశ్వాస తీర్మానం పెట్టవచ్చని, దానికి 50 మంది ఎంపీలు మద్దతు తెలియజేయాలని, ఒక వేళ వీగిపోయినా కచ్చితంగా ప్రధాని సమాధానం చెప్పాల్సిందేనని ఉండ‌వ‌ల్లి లా పాయింట్ లాగారు.

అవిశ్వాసం పెట్ట‌డానికి గ‌ల అనుకూల‌త‌ల‌ను సైతం ఉండ‌వ‌ల్లి వివ‌రించారు. ఈ ప్రభుత్వానికి అధికారంలో కొనసాగే అవకాశం లేదనే సింగిల్ పాయింట్‌పై అవిశ్వాస తీర్మానం ప్రతిపాదిస్తే చాలని, అవిశ్వాసం వీగిపోతే వాకౌట్ చేసే ముందు రాజీనామా చేయొచ్చని జగన్‌ కు విజ్ఞప్తి చేస్తున్నామని ఉండ‌వ‌ల్లి తెలిపారు. త‌ద్వారా కేంద్ర ప్ర‌భుత్వం ఇర‌కాటంలో ప‌డుతుంద‌ని ఉండ‌వ‌ల్లి వివ‌రించారు. ఈ దిశ‌గా జ‌గ‌న్ ఆలోచ‌న చేయాల‌న్నారు. ఇ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రజలకు అబద్దాలు చెప్పే దశ నుంచి మోసం చేసే దశకు చేరుకున్నట్టు తెలుస్తోందని ఉండవల్లి ఎద్దేవాచేశారు.మాజీ స్పీకర్ నాదెండ్ల మనోహర్ సమాచార హక్కు చట్టం కింద పొందిన సమాచారం బట్టి కేవలం రూ.4300 కోట్ల విలువైన హోటల్ ప్రాజెక్టులు మాత్రమే వచ్చినట్టుందన్నారు. అనుభవం గురించి మాట్లాడే అర్హత చంద్రబాబునాయుడుకు లేదన్నారు. ప్రశ్నించడానికి అనుభవం అవసరం లేదన్నారు. ఆర్థిక మంత్రి యనమల ప్రకటించిన వివరాల ప్రకారం 450 సంస్థల నుంచి రూ.99 వేల కోట్ల పెట్టుబడులు వచ్చాయని, అందులో 250 సంస్థలు ఉత్పత్తిని ప్రారంభించినట్టు ప్రకటించారని, ఇవన్నీ కట్టుకథలు కాకపోతే బహిరంగంగా ప్రకటించాలని ఉండవల్లి డిమాండ్ చేశారు. కేంద్రం చేసే ఏ బ్లాక్‌ మెయిల్‌ కు చంద్రబాబునాయుడు లొంగిపోయారో బహిర్గతం చేయాలని ఆరోపించారు. చంద్రబాబునాయుడు ఎపుడూలేని విధంగా రాష్ట్రంలో యుద్ధ వాతావరణం సృష్టిస్తున్నారని ఉండవల్లి ఆరోపించారు. పట్టిసీమ ఇప్పటికీ పచ్చి బోగస్ అని వాదిస్తున్నానని, తన లెక్కలు తప్పని నిరూపిస్తే చెప్పాలని డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం పట్టిసీమకంటే పెద్ద స్కామ్ అని ఉండవల్లి ఆరోపించారు.ఈ మూడేళ్ల కాలంలో తెలుగుదేశం ప్రభుత్వం చేసిందీ.., రానున్న రెండేళ్ల కాలంలో చేయబోయేదీ కూడా శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. లేదంటే కనీసం వెబ్ సైట్‌ లో పెట్టినా సరిపోతుందన్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News