కరోనా ఎఫెక్ట్ : జీడీపీలో 13 శాతం ఫట్ .. భారీగా పెరుగుతోన్న నిరుద్యోగం, కేంద్రానికి పెను సవాల్ !

Update: 2020-09-15 00:30 GMT
కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా పలు రంగాలు భారీ నష్టాల్లో కూరుకుపోయాయి. కరోనా కారణంగా ప్రజలతో పాటు ప్రభుత్వాలు కూడా తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయి. పలు సంస్ధలు కూడా ఇదే దారి. ఈ నేపథ్యంలో ప్రజలకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వాలు కూడా కరోనా దెబ్బకి వణికిపోతున్నాయి. కరోనా కారణంగా ఆవిరైపోతున్న ఉద్యోగాలు ప్రభుత్వాలకు నిద్రలేకుండా చేస్తున్నాయి. ముఖ్యంగా దేశానికి దిశానిర్దేశం చేయాల్సిన కేంద్ర ప్రభుత్వం కూడా ఆత్మరక్షణలో పడుతుండటంతో ప్రజల్లో నమ్మకం కూడా సడలిపోతున్న పరిస్ధితులు పలుచోట్ల కనిపిస్తున్నాయి. రోజురోజుకి పెరిగిపోతున్న నిరుద్యోగం పై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకుంటుందో. జీడీపీ వృద్ధి గతంలో ఎన్నడూ లేనంతగా మైనస్‌ 23 శాతానికి చేరుకోవడం కేంద్రాన్ని తీవ్రంగా కలవరపెడుతోంది. ఆర్ధికవేత్తల అంచనాలకు కూడా అందకుండా జీడీపీ వృద్ధిరేటు పడిపోతోంది. ఇప్పటికీ దేశవ్యాప్తంగా దాదాపు లక్ష కొత్త కేసులు నమోదవుతున్నాయి.

తాజా అంచనాల ప్రకారం కరోనా కారణంగా కేంద్రం ఎన్నడూ లేనంతగా జీడీపీలో 13 శాతం మొత్తాన్ని శాశ్వతంగా కోల్పోతున్నట్లు తేలింది. దీని విలువ రూ.30 లక్షల కోట్లుగా అంచనా వేస్తున్నారు. ఇది ఓ ఆర్ధిక సంవత్సరం కేంద్ర బడ్జెడ్ ‌తో సమానం. కరోనా సంక్షోభం కారణంగా ఉపాధి రంగం తీవ్రంగా దెబ్బతింది. కోట్ల సంఖ్యలో ఉద్యోగాలు ఆవిరైపోయాయి. తాజా అంచనాల ప్రకారం దేశవ్యాప్తంగా 3.5 కోట్ల మంది నిరుద్యోగులు ఉన్నట్లు తేలింది. ఇందులో 2.1 కోట్ల మంది కరోనా తర్వాత ఉద్యోగాలు కోల్పోయిన వారే. కరోనా కారణంగా ఉద్యోగాలు కోల్పోయినవారు వ్యవసాయ రంగం వైపు మొగ్గుచూపుతున్నారు.

పాశ్చాత్య దేశాలతో పోలిస్తే భారత్‌ లో ఉద్యోగాలు, ఉపాధి కావాలని కోరుకునే వారి శాతం 40 శాతంగా ఉంటుందని తేలింది. అదే విదేశాల్లో అయితే 60 శాతంగా ఉంది. ఈ 40 శాతం మందికి ఉద్యోగాలు కల్పించడం కూడా ప్రభుత్వాలకు సవాలుగా మారుతోంది. కానీ ఈ ఆర్ధిక సంవత్సరం ముగింపు నాటికి భారత్ ‌లో యువత ఇప్పుడున్న ఉద్యోగాలు కోల్పోకుండా ఉంటే 4.5 కోట్ల కొత్త ఉద్యోగాలు అవసరమవుతాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. 2016-17తో పోలిస్తే 2019-20 నాటికి భారత్‌ లో నిరుద్యోగుల సంఖ్య 40.7 కోట్ల నుంచి 40.3 కోట్లకు తగ్గింది. కానీ , కరోనా కారణంగా అది మళ్లీ మొదటికి వచ్చింది.
Tags:    

Similar News