శశికళకు ఊహించని షాక్

Update: 2021-02-09 17:30 GMT
తమిళనాడులోకి అడుగుపెట్టిన వెంటనే చిన్నమ్మ శశికళకు ఏఐఏడీఎంకే ప్రభుత్వం పెద్ద  షాకే ఇచ్చింది. చిన్నమ్మ చెన్నైలోకి అడుగుపెట్టిన మరుసటి రోజే ఆమెకు సంబంధించిన వందల కోట్ల రూపాయల విలువైన ఆస్తులను స్వాధీనం చేసుకుంది. చెన్నైలోకి ప్రవేశించేముందే చిన్నమ్మ పార్టీ గుర్తుకోసం, ఆధిపత్యం విషయంలో వివాదం మొదలుపెట్టిన విషయం అందరికీ తెలిసిందే.  పార్టీపై ఆధిపత్యం తనదే అని, తాను పార్టీకి శాశ్వత ప్రధాన కార్యదర్శినంటు గోల మొదలుపెట్టేశారు. పార్టీ గుర్తయిన రెండాకుల కోసం సుప్రింకోర్టులో కేసు కూడా వేశారు.

ఇలాంటి చర్యలతో ఉద్దేశ్యపూర్వకంగానే చిన్నమ్మ వివాదాలను పెంచుకుంటోందనే అధికారపార్టీ ఆమెను కంట్రోల్ చేద్దామని ప్రయత్నం చేసింది. అయితే పార్టీలోని కొందరు నేతల అండదండల కారణంగా చిన్నమ్మపై చర్యలు తీసుకునే అవకాశం లేకపోయింది. దీంతో ఎలాగైనా శశికళను అదుపు చేయాలన్న ఉద్దేశ్యంతోనే హఠాత్తుగా ఆమె ఆస్తులను స్వాధీనం చేసుకుంటు ప్రభుత్వం ఆదేశాలను జారీ చేసింది.

ఆమె ఆస్తులను జప్తు చేయాలని గతంలోనే సుప్రింకోర్టు ఆదేశాలిచ్చింది. అప్పుడెప్పుడో సుప్రింకోర్టు ఆదేశాలను ఇపుడు ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. తూత్తుకుడి జిల్లాలోని శశికళకున్న 800 ఎకరాల భూమిని ప్రభుత్వం జప్తు చేసేసింది. దీంతో పాటు రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో ఉన్న వందల కోట్ల విలువైన అనేక ఆస్తులను కూడా ప్రభుత్వం జప్తు చేసింది.

అయితే ప్రభుత్వం జప్తు చేసిన ఆస్తులన్నీ శశికళ పేరుమీద కాకుండా వొదిన ఇళవరసి, సోదరుడు సుధాకరన్ పేరుతో ఉన్నాయి. ఎవరిపేరుతో ఉంటే అన్నీ చిన్నమ్మ సంపాదించినవే అనే ప్రచారం కూడా జరుగుతోంది. మొత్తంమీద తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతోంది.
Tags:    

Similar News