క‌రుణ‌లో చాలామందికి తెలియ‌ని కోణాలెన్నో!

Update: 2018-08-08 06:11 GMT
త‌మిళ రాజ‌కీయాల్లో ఒక శ‌కం ముగిసింది. ద్ర‌విడ దిగ్గ‌జాల్లో ఆఖ‌రి మేరుప‌ర్వ‌తం తిరిగి రాని లోకాల‌కు త‌ర‌లి వెళ్లిపోయింది. నేను విశ్రాంతికే విశ్రాంతినిస్తా.. నా విశ్రాంత జీవితం ఎప్పుడు మొద‌ల‌వుతుందో నాకే తెలీదు.. క్రియాశీల రాజ‌కీయాల నుంచి నేను విర‌మించుకునేది లేద‌న్న మాట‌ను క‌రుణానిధి అక్ష‌రాల నిరూపించారు.

94 ఏళ్ల ముదిమి వ‌య‌సులో ఆయ‌న క్రియాశీల రాజ‌కీయాల నుంచి.. త‌న జీవితం నుంచి త‌న‌కు తానుగా నిష్క్ర‌మించారు. విధి అవ‌కాశం ఇస్తే.. ఆయ‌న మ‌రింత కాలం త‌న స‌త్తా చాటే వార‌న‌టంలో ఎలాంటి సందేహం లేదు. క‌విగా.. సినీ న‌టుడిగా.. విప్ల‌వ‌కారుడిగా.. అభ్యుద‌య వాదిగా.. నిండైన నాస్తిక‌త్వాన్ని నిన‌దించి.. ఆస్తిత్వ వాదుల క‌డుపు మండించి కూడా తిరుగులేని ప్ర‌జానేత‌గా నిల‌వ‌టం క‌రుణానిధికి మాత్ర‌మే చెల్లుతుందేమో!

హిందీని వ్య‌తిరేకించి.. హిందుత్వాన్ని నిర‌సించి.. ఢిల్లీ ప్ర‌భువులను ప్ర‌శ్నించ‌ట‌మే కాదు.. త‌న చుట్టూ తిప్పుకునేలా చేయ‌టంలోనూ ఆయ‌న స‌క్సెస్ అయ్యారు. ఒక‌ప్ప‌టి త‌న మిత్రుడు.. త‌ర్వాతి కాలంలో రాజ‌కీయ వైరంతో దూర‌మైన‌ప్ప‌ట‌కీ.. త‌న రాజ‌కీయ విరోధి ఎంజీఆర్ మ‌ర‌ణం వేళ ఆయ‌న క‌దిలిపోయిన తీరు చాలామందిని క‌దిలించింది.

రాజ‌కీయం ఒక్క‌టే ప్రామాణికం కాద‌ని.. తాను న‌మ్మిన దాని కోసం ఎంత‌కైనా సిద్ధ‌మేన‌న్న‌ట్లు వ్య‌వ‌హ‌రించిన క‌రుణ తీరు చూస్తే.. స‌మ‌కాలీన రాజ‌కీయాల్లో ఇలాంటి నేత మ‌రొక‌రు క‌నిపించ‌రేమో. అప్ప‌ట్లో ఇందిర‌మ్మ విధించిన అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని వ్య‌తిరేకించిన మొట్ట‌మొద‌టి ముఖ్య‌మంత్రిగా నిలిచారు. దేశం మొత్త‌మ్మీదా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి విధించినా క‌రుణ పుణ్య‌మా అని త‌మిళ‌నాడులో ఎలాంటి అరెస్ట్ లు చోటు చేసుకోలేదు. క‌రుణ ధిక్కారాన్ని భ‌రించ‌లేని  ఇందిర‌మ్మ క‌రుణ ప్ర‌భుత్వాన్ని బ‌ర్తర‌ఫ్ చేసి.. అత్య‌వ‌స‌ర ప‌రిస్థితిని విధించారు. ఇవ‌న్నీ ఒక ఎత్తు అయితే.. క‌రుణ వ్య‌క్తిగ‌త జీవితంలో చాలా భిన్న‌మైన అంశాలు క‌నిపిస్తాయి. చాలామందికి పెద్ద‌గా అవ‌గాహ‌న లేని ఈ విష‌యాల్ని చూస్తే...

+ క‌రుణ‌కు మొత్తం ముగ్గురు భార్య‌ల‌న్న సంగ‌తి తెలిసిందే. ఇక‌.. ఆయ‌న రాజ‌కీయ వార‌సుడిగా నిలిచిన వ్యక్తి స్టాలిన్. రెండో భార్య రెండో కొడుకైన స్టాలిన్ కు ఆ పేరు ఎందుకు పెట్టార‌న్న‌ది ఆస‌క్తిక‌రం. సోవియెట్ యూనియ‌న్ అధినేత స్టాలిన్ అంటే క‌రుణ‌కు మ‌రీ అంత అభిమాన‌మా?  అంటే కొంత‌నే చెప్పాలి. కానీ.. అనుకోకుండా ఆయ‌న నోటి నుంచి వ‌చ్చిన మాటే.. స్టాలిన్ పేరును పెట్టేలా చేసింది.

1953 మార్చి 1న క‌రుణ‌కు స్టాలిన్ రెండో సంతానంగా జ‌న్మించారు. త‌న‌ను రాజ‌కీయంగా.. వ్య‌క్తిగా తీర్చి దిద్దిన ఇద్ద‌రు నేత‌లు పెరియార్ రామ‌స్వామి.. అన్నాదురైల పేర్లు క‌లిపి త‌న‌కు పుట్టే కొడుక్కి పెట్టాల‌ని క‌రుణ భావించారు. ఇందులో భాగంగా పెరియార్.. అన్నాదురై ఇద్ద‌రి పేర్ల‌తో క‌లిపి అయ్యాదురై అని పెట్టాల‌నుకున్నారు. అయితే.. త‌న కొడుకు పుట్టిన నాలుగు రోజుల‌కే స్టాలిన్ మ‌రణించారు.

ఈ సంద‌ర్భంగా ఏర్పాటు చేసిన సంస్మ‌ర‌ణ స‌భ‌లో మాట్లాడుతూ త‌న కొడుక్కి స్టాలిన్ పేరు పెడ‌తాన‌ని అక్క‌డిక‌క్క‌డే ప్ర‌క‌టించారు. త‌మిళ జాతీయ‌వాది.. త‌మిళనేల మీద పుట్టిన వారికి త‌మిళ పేర్లే పెట్టాల‌ని చెప్పే ఆయ‌న‌.. త‌న కొడుక్కి మాత్రం స్టాలిన్ అని పేరు పెట్ట‌టం అనుకోకుండా జ‌రిగింద‌నే చెప్పాలి. త‌న పిల్ల‌లంద‌రికి త‌మిళ‌పేర్లు పెట్టిన క‌రుణ‌.. స్టాలిన్ ఒక్క‌డి పేరునే వేరుగా పెట్టార‌ని చెప్పాలి.

+  క‌రుణ అన్నంత‌నే బ‌ట్ట‌త‌ల‌తో.. న‌ల్ల క‌ళ్లాద్దాల మ‌నిషి గుర్తుకు వ‌స్తారు. ఇంత‌కీ ఆయ‌న న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాలు ఎందుకు పెట్టుకుంటారు. తాజాగా ఆయ‌న అంతిమ‌యాత్ర సంద‌ర్భంలోనూ ఆయ‌న న‌ల్ల క‌ళ్లాద్దాలతోనే శాశ్విత విశ్రాంతిలో సేద తీరుతున్నది చూస్తున్నాం. ఈ న‌ల్ల‌క‌ళ్ల‌జోడు వెనుక అస‌లు ర‌హ‌స్యం చాలా కొంది మందికే తెలుసు.

60 ఏళ్ల క్రితం ఆయ‌న‌కు రెండు రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగాయి. ఈ సంద‌ర్భంగా ఆయ‌న ఎడ‌మ క‌న్ను దెబ్బ తింది. ఉన్న‌ట్లుండి ఎడ‌మ క‌న్ను వాయ‌టం.. నొప్పికి గురి చేయ‌టం.. ఎర్రబ‌డ‌టం లాంటి ఇబ్బందులు ప‌డేవారు. దీంతో.. ఉప‌శ‌మ‌నంగా ఉంటుంద‌ని న‌ల్ల‌క‌ళ్ల‌జోడు పెట్టుకోవాల‌ని స‌న్నిహిత వైద్యుల స‌ల‌హాతో ఆయ‌న న‌ల్ల‌క‌ళ్ల‌ద్దాలు పెట్టుకోవ‌టం షురూ చేశారు.

త‌ర్వాతి రోజుల్లో అదో అల‌వాటుగా మార‌ట‌మే కాదు.. క‌రుణానిధి అంటే న‌ల్ల‌క‌ళ్లద్దాల పెద్దాయ‌న అన్న‌ట్లుగా అంద‌రి మ‌దిలో ముద్ర ప‌డిపోయేలా చేసింది. 60 ఏళ్లుగా కంటి స‌మ‌స్య‌తో ఆయ‌న ఇబ్బంది ప‌డుతూనే ఉన్నారు. కంటికున్న స‌మ‌స్య కార‌ణంగానే స‌భ‌లో మాట్లాడేట‌ప్పుడు క‌ళ్ల అద్దాల‌ను కాస్త పైకి లేపి క‌ర్చీఫ్ తో తుడుచుకోవ‌టం క‌నిపిస్తుంది.

+  క‌రుణ కుర్చీ వెనుక పెద్ద క‌థే ఉంది. రాజ‌కీయంగా కీల‌క‌మైన నాయ‌కుడు చ‌క్రాల కుర్చీకి ప‌రిమితం కావ‌టం ఊహించ‌లేని విష‌యం. అయిన‌ప్పటికీ క‌రుణ మాత్రం ఆవిష‌యంలోనూ స‌క్సెస్ అయ్యారు. క‌రుణ చ‌క్రాల కుర్చీకి ప‌రిమితం కావ‌టం వెనుక విష‌యాల్ని చూస్తే.. 2008 డిసెంబ‌రులో వెన్నునొప్పితో ఇబ్బంది ప‌డ్డారు. ఆ విష‌యాన‌ని బ‌య‌ట‌కు చెబితే ఆసుప‌త్రిలో ఆడ్మిట్ చేస్తార‌న్న అభిప్రాయంతో ఎవ‌రికి చెప్ప‌కుండా ఆ నొప్పిని భ‌రిస్తూ వ‌చ్చారు. బాధ మ‌రింత ఎక్కువ కావ‌టంతో కుటుంబ వైద్యుడు గోపాల్ కు చెప్పారు.

దీంతో.. ఆర్థో స్పెష‌లిస్ట్ డాక్ట‌ర్ మ‌యిల్ వాగ‌న‌న్ ను ఇంటికి పిలిపించారు. తాత్కాలిక ఉప‌శ‌మ‌నం కోసం మందులు రాసి చికిత్స చేశారు. 2009 జ‌న‌వ‌రి 25న చెన్నైలో జ‌రిగిన ఒక కార్య‌క్ర‌మంలో పాల్గొన్న క‌రుణ ప‌ది గంట‌ల పాటు త‌న వెన్ను నొప్పిని మ‌ర్చిపోయి మ‌రీ కూర్చున్నారు. ప్రోగ్రాం అయ్యాక ఇంటికి వెళ్లి తీవ్ర‌మైన నొప్పికి గుర‌య్యారు. అర్థ‌రాత్రి వేళ హుటాహుటిన ఆసుప‌త్రిలో చేర్పించారు.

ఆ సంద‌ర్భంగా చేసిన వైద్య ప‌రీక్ష‌ల్లో క‌రుణ వెన్నుపూస‌ల్లో అరుగుద‌ల ఏర్ప‌డిన‌ట్లు గుర్తించారు. నొప్పి త‌గ్గేందుకు మందులు ఇచ్చారు. అయినా ఫ‌లితం లేక‌పోవ‌టంతో వెన్నుముక‌కు శ‌స్త్ర‌చికిత్స చేశారు. ఆప‌రేష‌న్ కు ముందు కొన్ని సంద‌ర్భాల్లో వాడిన చ‌క్రాల కుర్చీ.. త‌ర్వాతి రోజుల్లో శాశ్వితంగా వాడాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది.
Tags:    

Similar News