కేంద్రం - రాష్ట్రానికి ఉత్త‌మ్ సూచ‌న‌: ఆర్మీతో వ‌ల‌స కూలీల‌ను త‌ర‌లించండి

Update: 2020-05-23 14:00 GMT
లాక్‌ డౌన్‌ తో ఏర్ప‌డిన ఇబ్బందుల‌తో వ‌ల‌స కూలీలు త‌మ సొంత ప్రాంతాల‌కు కాలి న‌డ‌క‌న వంద‌లు - వేల కిలోమీట‌ర్లు వెళ్తున్న దానిపై తెలంగాణ కాంగ్రెస్ అధ్య‌క్షుడు ఉత్త‌మ్‌ కుమార్‌ రెడ్డి స్పందించారు. వ‌ల‌స కార్మికుల‌ను ఆదుకోవడంలో కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఆరోపించారు. కార్మికులు ఉన్న చోటనే వారు ఉండేందుకు ప్రభుత్వాలు ఎందుకు భరోసా కల్పించడం లేదని ప్రశ్నించారు. పని లేక - జేబులో డబ్బుల్లేక వారు ఇబ్బందులు పడుతున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. హైద‌రాబాద్‌ లోని గాంధీ భ‌వ‌న్‌ లో ఆయ‌న శ‌నివారం మీడియాతో మాట్లాడారు.

వలసకూలీలను ఆదుకునేందుకు ప్రభుత్వాలు ముందుకురావాల‌ని పిలుపునిచ్చారు. దేశంలో భారీగా ఆహార నిల్వలు ఉన్నాయని.. వాట‌న్నిటిని పేద‌ల‌కు - వ‌ల‌స కార్మికుల‌కు ఎందుకు పంచ‌డం లేద‌ని ప్రశ్నించారు. వలసకూలీ నెల గడించేందుకు సరుకులు - నగదు ఇస్తే.. వారు ఎందుకు వందల కిలోమీటర్లు నడుస్తారని సందేహం వ్య‌క్తం చేశారు. అలా ఇవ్వక‌పోతే సైన్యాన్ని రంగంలోకి దింపాల‌ని - వ‌ల‌స కూలీలను సైన్యం సుర‌క్షితంగా చేరుస్తుందని పేర్కొన్నారు.

తెలంగాణ ముఖ్య‌మంత్రి క‌ల్వకుంట్ల చంద్ర‌శేఖ‌ర్ రావు కూలీల వెతలు పట్టించుకోరు కానీ విపక్షాలనే తప్పుపడతారని కేసీఆర్‌పై ఉత్త‌మ్ మండిప‌డ్డారు. తమ పార్టీ అధినేత్రి సోనియాగాంధీ పిలుపుతో తామే వలస కార్మికులను సొంత ప్రాంతాల‌కు తరలిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చొరవ తీసుకుని కూలీల తరలింపు చేయాల‌ని సూచించారు. ఈ విష‌యంలో సైన్యం సహాయం తీసుకోవాల‌ని కేంద్ర‌ - రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు చెప్పారు.
Tags:    

Similar News