ఉత్త‌మ్ ఒంటరి అయిపోయిన‌ట్లేనా?

Update: 2019-10-02 06:26 GMT
తెలుగు రాష్ట్రాల్లో ఆస‌క్తిక‌రంగా మారిన హుజూర్‌ న‌గ‌ర్ ఉప ఎన్నిక విష‌యంలో...టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఒంటరి అయిపోయిన‌ట్లుగా అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. త‌ను ఎమ్మెల్యేగా గెలుపొందిన నియోజ‌క‌వ‌ర్గంలో...ప్ర‌స్తుత ఉప ఎన్నిక‌లో స‌తీమ‌ణిని అభ్య‌ర్థిగా ఉత్త‌మ్ నిల‌బెట్టిన సంగ‌తి తెలిసిందే. అభ్య‌ర్థి ఖ‌రారు నుంచి ఉత్త‌మ్‌ పై అస‌హ‌నంతో కొంద‌రు కాంగ్రెస్ నేత‌లు ఉన్న‌ట్లుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్‌ రెడ్డి తో పాటు పలువురు నేతలకు ఢిల్లీ నుంచి ఫోన్లు కూడా చేయించారని స‌మ‌చారం. అయినప్పటికీ.. కాంగ్రెస్‌ లో ఉత్తమ్ వ్యతిరేకులు కలిసి రావడంలేదని అంటున్నారు. దీంతో...నియోజకవర్గంలో ప్రచారం కోసం కాంగ్రెస్ నేతలంతా వచ్చేలా చూడాలని ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఢిల్లీ నుంచి లాబీయింగ్ చేస్తున్నారు.

మ‌రోవైపు - హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలో గెలుపు కోసం ఇత‌ర పార్టీల‌ మ‌ద్ద‌తు అవ‌స‌రం కావ‌డంతో ఇటు టీఆర్ ఎస్‌...అటు కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తు కోసం ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌ధానంగా ప్ర‌తిప‌క్షంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ  వివిధ పార్టీల మద్దతుకోసం  వెంపర్లాడుతున్నారు. ముందస్తుగానే సీపీఐ నేతలను కలిసి మద్దతు ఇవ్వాలని కోరినప్పటికీ.. తాము టీఆర్‌ ఎస్ వెంట నడుస్తామని తేల్చిచెప్పడంతో...ప్రత్యామ్నాయాలపై దృష్టిపెట్టారు. కాంగ్రెస్ నేతలు కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి - ప్రసాద్‌ కుమార్ తెలంగాణ జనసమితి అధ్యక్షుడు కోదండరాం ఇంటికి వెళ్లి మద్దతుపై చర్చించారు. దీనిపై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకొంటామని కోదండరాం దాటవేశారు. ఇదే విషయమై టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి ఇంతకుముందే కలిసినప్పుడు కూడా ఆయన నేరుగా ఎలాంటి హామీ ఇవ్వలేదు. మరోవైపు హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలో సీపీఎం అభ్యర్థి శేఖర్‌ రావు నామినేషన్ తిరస్కారానికి గురికావడంతో.. ఆ పార్టీ మద్దతు కోసం కాంగ్రెస్ నేతలు సంప్రదింపులు మొదలుపెట్టారు.

కాగా, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి  చాడ వెంకట్‌ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ...హుజూర్‌ నగర్ ఉప ఎన్నికలో టీఆర్‌ ఎస్‌ ను గెలిపించాలని సీపీఐ నిర్ణయించిందని ప్ర‌క‌టించారు. ఆ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలుపుతున్నామ‌ని తెలిపారు. దీంతో టీఆర్ ఎస్‌ కు కీల‌క మ‌ద్ద‌తు ల‌భించిన‌ట్ల‌యింది. కాగా, టీఆర్‌ ఎస్‌ కు మద్దతు ఇచ్చినప్పటికీ ప్రజాసమస్యలపై పోరాటం కొనసాగుతుందని వివ‌ర‌ణ ఇచ్చారు.

   

Tags:    

Similar News