పవన్‌ మౌనం వీడడు..ఈయన మాటలు ఆపడు

Update: 2015-06-23 09:50 GMT
కొందరు రాజకీయ నాయకుల వ్యవహారశైలి భలే ఆసక్తకిరంగా ఉంటుంది. ఒక అంశంపై మాట్లాడాలనుకొని వాళ్లు డిసైడ్‌ అయ్యారంటే...అది డైలీ సీరియల్‌ ఎపిసోడ్‌ లాగా సాగుతూనే ఉంటుంది. సదరు వ్యక్తులు స్పందించినా లేకున్నా వారు తమ ప్రశ్నల వర్షాన్ని...వాగ్భాణాలను వదిలిపెట్టరు. సీనియర్‌ ఎంపీ, కార్యకర్తల కోటాలో ఏళ్ల తరబడి ఎంపీ పదవి పొందుతున్నకాంగ్రెస్‌ రాజ్యసభ సభ్యుడు వి.హనుమంతరావు గురించే ఈ ప్రస్తావన అంతా. జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ పై ఈ మధ్య విమర్శలు మొదలుపెట్టిన వీహెచ్‌ దాని జోరు మరింత పెంచారు.

గత ఎన్నికల ముందు పార్టీ పెట్టి ఎవరైనా తప్పు చేస్తే ప్రశ్నిస్తానన్న హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఓటుకు నోటు వ్యవహారంపై ఎందుకు మాట్లాడటంలేదని హనుమంతన్న ప్రశ్నించారు. ''ఓటుకునోటు కథ అసలు తప్పు కాదని పవన్‌ అనుకుంటున్నర ఏంది?''అని నిలదీశారు. పవన్‌ మౌనం వీడి వెంటనే దీనిపై మాట్లాడాలని, లేకపోతే....ఆయన మద్దతిచ్చినట్లే అవుతుందని వీహెచ్‌ వ్యాఖ్యానించారు. పనిలో పనిగా రాష్ట్ర గవర్నర్‌ పైనా సెటైర్లు వేశారు.

రెండు రాష్ట్రాల మధ్య గొడవ జరుగుతుంటే గవర్నర్‌ నరసింహన్‌ తిరుపతికి ఎందుకు వెళ్ళారని వీహెచ్‌ నిలదీశారు. గతంలో ఏ గవర్నర్‌ కూడా ఇన్ని గుళ్లు తిరగడం తాను చూడలేదని, ఆధ్యాత్మిక పర్యటనల కోసమే కోట్లాది రూపాయలు ఖర్చుచేస్తున్నారని విమర్శించారు. ఇంత పెద్ద గొడవ జరుగుతుంటే ఆయన దేవుళ్ల దగ్గరికి వెళ్తే ప్రజలు ఏమనుకుంటారని ప్రశ్నించారు. ఇద్దరు సీఎంలను కూర్చోబెట్టి అన్ని విషయాలు చర్చించి ప్రజలకు వాస్తవాలను తెలియజేసే బాద్యత గవర్నర్‌ పై ఉందన్నారు. గవర్నర్‌ ఉన్నది గుళ్లు తిరగడానికి కాదు ప్రజల కోసం పనిచేసేందుకు అని అన్నారు.

మొత్తంగా తన మనసులోని మాటను ఉన్నదున్నట్లు బయటపెట్టే వీహెచ్‌ మరోమారు...అదే రీతిలో స్పందించడం వింతేమీ కాదు కద.



Tags:    

Similar News