వల్ల కావడంలేదా వల్లభనేనీ : సైకిలెక్కేయాలని ఉబలాటమేనా...?

Update: 2022-05-30 08:30 GMT
ఆయన 2009 ఎన్నికల్లో రాజకీయాల్లోకి వచ్చారు. విజయవాడ బేస్డ్ పాలిటిక్స్ చేసే దూకుడు కలిగిన నేత. ఆయనే వల్లభనేని వంశీ. 2009లో ఆయన నేరుగా కాంగ్రెస్ ఎంపీ లగడపాటి రాజగోపాల్ ని విజయవాడ నుంచి టీడీపీ అభ్యర్ధిగా ఢీ కొట్టారు. ఓడారు. ఆ తరువాత ఆయనకు పొలిటికల్ గా  బాగానే పేరు వచ్చేసింది.  ఆ పేరు హుషార్ తో 2014, 2019 ఎన్నికల్లో టీడీపీ తరఫున టికెట్ అందుకుని గన్నవరం నుంచి రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు.

టీడీపీకి చంద్రబాబుకు వెన్నుదన్నుగా ఉండే వంశీ వైసీపీ వశీకరణకు అసలు లొంగుతారు అని ఎవరూ అనుకోలేదు. అయితే అప్పట్లో అంటే 2015 ప్రాంతాలలో  ఒకసారి విజయవాడకు ప్రతిపక్ష నేత హోదాలో జగన్ వచ్చినపుడు ఆయన్ని రోడ్డు మీదనే వాటేసుకుని వంశీ వార్తలలో నిలిచారు. అపుడే ఫస్ట్ టైమ్ టీడీపీ వారి అనుమాన చూపుల్లో కూడా పడ్డారు.

అయితే జస్ట్ జగన్ తో ఉన్న పూర్వ పరిచయం వల్లనే అలా చేశాను అని వివరణ ఇచ్చారు. ఆ మీదట వంశీ టీడీపీ నుంచి వాయిస్ పెంచి జగన్ని నేరుగానే అటాక్ చేసేవారు. వంశీలో విశేషం ఏంటి అంటే ఆయనకు ఏ పక్షంలో ఉన్న ఎదుటి పక్షాన్ని చీల్చిచెండడమే  తెలుసు. అలా వంశీ నాడు వైసీపీ మీద చాలా హాట్ హాట్ కామెంట్స్ ఎన్నో చేశారు. వైసీపీ వారి ఓళ్ళు మండేలా చేశారు.

అయితే ఆ తరువాత టీడీపీ పెద్దలతో ఏర్పడిన కొంత గ్యాప్ తో వంశీ తగ్గారు. అది వేరే సంగతి.  ఇక గన్నవరంలో కూడా వంశీ ప్రాభవం బాగా తగ్గిన టైమ్ అది. 2019 ఎన్నికల్లో వంశీ గెలిచింది కూడా తక్కువ మెజారిటీతోనే. ఇక ఆ ఎన్నికల్లో టీడీపీ ఏపీలో పవర్ పోగొట్టుకుంది.

అలా కొన్నాళ్ళు జరిగాక వంశీ కండువా మార్చేసేందుకు రెడీ అయిపోయారు. తన మిత్రుడు కొడాలి నాని వైసీపీలో మంత్రిగా ఉండడం ఆయనకు కలసి వచ్చింది. అంతే ఒక ఫైన్ ఈవెనింగ్ ఆయన పేర్ని నాని, కొడాలి నానిలలతో కలసి తాడేపల్లి ప్యాలెస్ వైపుగా అడుగులు వేశారు. ఆ సమయంలో ఆయన అయ్యప్ప దీక్షలో ఉన్నారు.

ఆ తరువాత మీడియా ముందుకు వచ్చి ఆయన అన్నీ నిజాలే చెప్పారు అని అంతా అనుకున్నారు. కానీ సీన్ కట్ చేస్తే వంశీ వైసీపీ నీడన చేరిపోయారు. అలా రెండేళ్ళ పాటు సాగిన ఈ కాపురంలో ఇపుడు బీటలు వారుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. ఒక వైపు తన దోస్త్ కొడాలి నాని మాజీ అయిపోయారు మరో వైపు చూస్తే గన్నవ‌రంలో ఎంత ట్రై చేసినా పట్టు దక్కడంలేదు. రెండు వర్గాలుగా విడిపోయిన గన్నవరం వైసీపీ వంశీ రాకతో మూడుగా మారింది.

అక్కడ గ్రూపులు ఎక్కువ కావడం వల్లనే వంశీ 2019 లో తృటిలో అయినా గెలుపు పిలుపు విన్నారు. ఇపుడు చూస్తే ఈ మూడు గ్రూపుల మధ్య రాజీ కుదర్చలేక అధినాయకత్వం సైలెంట్ అయింది. ఇక వంశీకి వైసీపీ టికెట్ ఇచ్చినా కూడా ఆయన గెలుపు అనుమానమే అంటున్నారు. దానికి కారణం సొంత పార్టీ వారే సహకరించరు, ఓడించి తీరుతారు.

దాంతో మొత్తానికి వంశీకి జ్ఞానోదయం కలిగిందా లేక ఆయన మనసులో చాన్నాళ్ళుగా ఉన్న మాట బయటపడిందా అంటే ఏమైనా అనుకోవచ్చు. లేటెస్ట్ గా ఆయన టీడీపీ గొప్ప పార్టీ అంటూ చేసిన కామెంట్స్ మాత్రం తెగ వైరల్ అవుతున్నాయి. టీడీపీలోనే బడుగులకు పూర్తి న్యాయం జరిగింది అని కూడా ఆయన మరో మాట అనేశారు. అది సరిగ్గా వైసీపీ సామాజిక న్యాయ భేరీ పేరిట మంత్రులతో ఏపీ అంతటా బస్సులతో తిరుగుతున్న సమయాన వంశీ బడుగుల పార్టీ అసలైనది టీడీపీయే అంటూ చేసిన కామెంట్స్ వైసెపీ పెద్దలకు వార్నింగ్ బెల్స్ లాగానే చూడాలని అంటున్నారు.

ఇక లోకేష్ చేతిలోకి పార్టీ రావడం వల్లనే తాను విభేదించాను తప్ప టీడీపీని ఎన్నడూ విమర్శించలేదని వంశీ చెప్పుకుంటున్న విషయం ఇస్తున్న సంజాయిషీ ఎవరి కోసం అన్నదే ఇక్కడ చర్చ. పోనీ ఎన్టీయార్ టీడీపీ గొప్పది అంటున్న వంశీకి ఇపుడు టీడీపీ ఎవరి చేతులలో ఉందో తెలియదా అన్న ప్రశ్నలు కూడా ఉదయిస్తున్నాయి. ఈ రోజుకు చూసుకుంటే టీడీపీలో లోకేష్ దే పెత్తనం. అది మహనాడు సాక్షిగా రుజువు అయింది.

గతం కంటే కూడా ఎక్కువ పట్టు కూడా పార్టీ మీద లోకేష్ సాధించారు. ఆ విధంగా అనుకుంటే లోకేష్ చేతిలో పార్టీ బాగానే నడుస్తుంది అని ఏదో రోజు వంశీ నోట మాట రావాలి కూడా. ఇప్పటికైతే ఇది వంశీ నుంచి ఊహించని మార్పు కానే కాదు అని గన్నవరం వైసీపీ నేతలు అంటున్నారు. ఆయన తిరిగి సైకిలెక్కాలని ఉబలాటపడుతున్నారు అని కూడా అంటున్నారు.

ఇక గన్నవరం లో పొలిటికల్ సీన్ చూసినా తన విజయావకాశాలు చూసుకున్నా వంశీ వైసీపీలో ఉండే సీన్ లేదనే అంటున్నారు. మొత్తానికి తాత ఎన్టీయార్ ని పొగిడిన వంశీ మనవడు లోకేష్ ని కూడా పొగిడే రోజు దగ్గరలోనే ఉందని అంటున్నారు. ఇప్పటికి వైసీపీ వారికి అర్ధం కావాల్సిన విషయం ఏంటి అంటే ఒక్క వంశీయే కాదు, వలస పక్షులుగా ఎవరు చేరినా తిరిగి వెళ్ళిపోవడం సహజమైన పరిణామమని.

ఆ మాత్రం భాగ్యానికి పార్టీ కోసం ఆరుగాలాలు పనిచేసిన వారిని దూరం చేసుకోవడం అంటే అది వైసీపీఅధినాయకత్వం చేస్తున్న తప్పులుగానే అంతా చూస్తున్నారు. ఇక నా వల్లకాదు వైసీపీలో అని వల్లభనేని వంశీ అంటున్నారా ఆయనను పొమ్మనలేక పొగబెట్టి పంపే సీన్ క్రియేట్ చేస్తున్నారా అన్నది పక్కన పెడితే వంశీ మాత్రం సైకిలెక్కే ఉబాలాటంలో ఉన్నారనే అంటున్నారు. మహానాడుకు పోటెత్తిన జనాలను చూసిన తరువాత కూడా వైసీపీలో ఉంటే ఆయన వంశీ ఎందుకు అవుతారు అని కూడా అనేవారు ఉన్నారట.
Tags:    

Similar News