క్రమశిక్షణకు, కట్టుబాటుకు తమ పార్టీ మారు పేరని పదే పదే చెప్పుకొనే టీడీపీలో ముసలం మొదలైంది. నేతలు ఒకరిపై ఒకరు కామెంట్లు చేసుకుంటూ బజారుకెక్కుతున్నారు. వీధి పోరాటాలకు దిగుతున్నారు. ప్రతి జిల్లాలోనూ ఈ గొడవలు కామన్ అయిపోయినా.. పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కడా పట్టించుకున్న దాఖలా కనిపించడం లేదు. తాజాగా మాజీ మంత్రి రావెల కిశోర్ బాబుపై టీడీపీ నేత వర్ల రామయ్య తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రావెల తన పరిధి దాటి మాట్లాడుతున్నారని ఫైరయ్యారు.
‘రావెలకు ఇష్టముంటే పార్టీలో ఉండొచ్చు...లేదంటే వెళ్లిపోవచ్చు’ అని వర్ల రామయ్య సంచలన కామెంట్లు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశం కేంద్రం పరిధిలోని అంశమని, చంద్రబాబును కించపరిస్తే సహించేది లేదని హెచ్చరించారు. క్రమశిక్షణ తప్పితే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదని, వర్గీకరణపై టీడీపీకి ఓ సిద్ధాంతం ఉందన్నారు. ఎవరో చెప్పే మాటలు వినే పరిస్థితి చంద్రబాబుకు లేదని మంత్రి కేఎస్ జవహర్ వ్యాఖ్యానించారు. మాజీ మంత్రి రావెల కిషోర్ వ్యాఖ్యల్ని ఆయన తప్పుపట్టారు. మాదిగ వర్గానికి రాజకీయ ప్రాధాన్యం కల్పించింది టీడీపీనే అని అన్నారు.
మాజీ మంత్రి రావెల ఏదో మానసిక ఓత్తిడిలో ఉన్నట్లున్నారని జవహర్ అన్నారు. మాదిగలకు టీడీపీకి ఉన్న బంధాన్ని విడదీయాలని మందకృష్ణ ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. మొత్తానికి నేతల వ్యాఖ్యలు చూస్తుంటే రావెలకు పొగబెడుతున్నారన్న అనుమానం కలుగుతోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఏదేమైనా.. అధినేత చంద్రబాబు కావాలనే ఇలా చేయిస్తున్నారని కూడా చెబుతున్నారు. మరి భవిష్యత్తులో ఏం జరుగుతుందో చూడాలి.