జ‌న‌సేన‌కు క్రిస్మ‌స్ కానుక ఇచ్చిన తండ్రీకొడుకులు

Update: 2018-12-25 05:13 GMT
ఎక్క‌డైనా బావ కానీ వంగ‌తోట ద‌గ్గ‌ర కాద‌న్న చందంగా.. రాజ‌కీయాల‌కు కుటుంబ అనుబంధాల‌కు దూరం ఉన్న తీరును చాలా కుటుంబాల్లో చూస్తుంటాం. తండ్రిని కొడుకు నాన్న అని పిల‌వ‌లేని రంగం ఏమైనా ఉందంటే.. అది రాజ‌కీయ‌మే అవుతుంది. ఈ రంగంలోని తండ్రీకొడుకుల రిలేష‌న్ ఇంటి వ‌ర‌కే అన్న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తుంటారు. బ‌య‌ట‌కు వ‌స్తే పార్టీ అధ్య‌క్షుల వారిగానో.. మ‌రోలానో ప్ర‌స్తావిస్తారే కానీ.. నాన్న‌.. డాడీ లాంటి మాట‌లు పిల్ల‌ల నోటి నుంచి రావ‌టం అస్స‌లు వినిపించ‌దు.

అది కేటీఆర్ కానీ.. క‌విత కానీ.. నారా లోకేశ్ కానీ. వారంద‌రి నోట కామ‌న్ గా వ‌చ్చే మాట పార్టీ అధ్య‌క్షుల వార‌నో.. లేదంటే పేరు పెట్టి పిల‌వ‌టం క‌నిపిస్తుంది. ఇలా పిలుపుల విష‌యంలోనే కాదు.. పార్టీకి ఏమైనా ఇచ్చిన ఉదంతాలు కూడా పెద్ద‌గా క‌నిపించ‌వు. ఎవ‌రినైనా ఇవ్వొచ్చు క‌దా? అంటే.. పార్టీకి ఇచ్చేంత‌? అంటూ మాట‌ను సాగ‌దీస్తారే కానీ.. త‌మ‌కున్న దాన్లో అంతో ఇంతో పార్టీకి ప్రేమ‌గా విరాళం రూపంలో ఇవ్వ‌టం క‌నిపించ‌దు.

దీనికి భిన్నంగా తాజాగా జ‌న‌సేన పార్టీకి భారీ విరాళాన్ని ఇచ్చారు మెగా ఫ్యామిలీకి చెందిన నాగ‌బాబు.. యువ క‌థానాయ‌కుడు వ‌రుణ్ తేజ్‌. వారిద్ద‌రూ క‌లిసి జ‌న‌సేన పార్టీకి రూ.1.25 కోట్ల విరాళాన్నిఇచ్చిన‌ట్లుగా ప్ర‌క‌టించారు. నాగబాబు.. వ‌రుణ్ లు ఇచ్చిన భారీ విరాళంపై జ‌న‌సేన పార్టీ అధినేత ప‌వ‌న్ క‌ల్యాణ్ రియాక్ట్ అయ్యారు.

వారిద్ద‌రూ ఇచ్చిన విరాళాన్ని జ‌న‌సేన పార్టీకి క్రిస్మ‌స్ కానుక‌గా తాను భావిస్తున్న‌ట్లుగా ప‌వ‌న్ వెల్ల‌డించారు. పార్టీ మీద ఉన్న అభిమానంతోనూ.. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌ల్ని నెర‌వేర్చాల‌న్న కాంక్ష‌తో వారు పార్టీకి విరాళం ఇచ్చిన‌ట్లుగా ప‌వ‌న్ ప్ర‌క‌టించారు.ఏమైనా ఇటీవ‌ల కాలంలో ఒక రాజ‌కీయ పార్టీకి వారి కుటుంబానికి చెందిన కుటుంబ స‌భ్యులు ఇంత భారీగా విరాళం ఇవ్వ‌టం.. అది కూడా బ‌హిరంగంగా ఇవ్వ‌టం ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు.
Tags:    

Similar News