ముక్క కాదు.. మొక్క ముక్క వ‌చ్చేసింది!

Update: 2018-08-29 01:30 GMT
ముక్కను ముచ్చ‌ట ప‌డ‌ని వారెవ‌రు? అని అడుగుతారు కానీ.. శుద్ధ‌శాఖాహారులు ముక్క కాదు క‌దా.. ఆ వాసను సైతం వ‌ద్ద‌నే వ‌ద్దంటారు. కానీ.. రానున్న రోజుల్లో అలాంటి వారు సైతం ముక్క‌ను ఒక చూపు చూసే అవ‌కాశం వ‌చ్చేయ‌నుంది. అదెలానంటారా?  ముక్క కాస్తా మొక్క ముక్క‌గా మారితే ముచ్చ‌ట ప‌డ‌ని వారెవ‌రూ. అర్థం కాలేదా?  మొక్క‌గా పెరిగే మాంసాన్ని తాజాగా త‌యారు చేశారు.

శాఖాహారులు సైతం ఈ మొక్క ముక్క‌ను తినేయొచ్చు. దీన్ని అభివృద్ధి చేసిన సీసీఎంబీ తాజాగా తాము త‌యారు చేసిన కృత్రిమ మాంసాన్ని క‌ర్ణాట‌కలోని జ‌య‌న‌గ‌ర్ కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఎమ్మెల్యే సౌమ్య రెడ్డిని పిలిపించారు. జంతుహ‌క్కుల కార్య‌క‌ర్త‌గా గుర్తింపు పొందిన ఆమె.. తాజాగా కృత్రిమ మాంసాన్ని రుచి చూశారు.

పూర్తి శాఖాహారి అయిన ఆమె.. వెజ్ మీట్ ను శుభ్రంగా తినేయొచ్చ‌ని చెబుతున్నారు. మాంసం కోసం జంతువుల‌పై ఆధార‌ప‌డ‌టం మానేస్తే ప‌ర్యావ‌ర‌ణ కాలుష్యం త‌గ్గుతుంద‌ని చెబుతున్నారు. హింస‌కు తావు లేకుండా పోష‌కాలు ఉండేలా మాంసం త‌యారీ ఇప్పుడు అంద‌రి దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మొక్క‌ల ఉత్ప‌త్తుల‌తో మాంసాన్ని ప్ర‌యోగ‌శాల‌లో తయారు చేసే ఈ విధానం ఇప్ప‌టికే ప్ర‌పంచంలోని ప‌లు ప్రాంతాల్లో చేప‌ట్టారు.

మ‌రి.. ఈ మొక్క ముక్క రుచి ఎలా ఉంటుంద‌న్న విష‌యాన్ని సౌమ్య‌రెడ్డి మాటల్లో చూస్తే..  త‌న‌కు బెంగ‌ళూరులో రెస్టారెంట్లు ఉన్నాయ‌ని.. అక్క‌డ పూర్తిగా వెజ్ వంట‌కాలే ఉంటాయ‌ని.. నాన్ వెజ్ ఉండ‌ద‌ని.. కానీ మొక్క‌ల నుంచి త‌యారు చేసే మాంస ఉత్ప‌త్తుల్ని రుచిక‌రంగా వడ్డించనున్న‌ట్లు చెప్పారు.

మొక్క‌ల ముక్క ఫేక్ మాంసంగా అనొచ్చ‌ని.. మాంసంలా క‌నిపిస్తుంది కానీ మాంసం కాద‌ని.. అందులో ఉండే ప్రోటీన్లు ఇందులోనూ ల‌భిస్తాయ‌ని చెబుతున్నారు. అధిక పోష‌క ప‌దార్థాలు ఉండే మొక్క‌లు.. వృక్షాల ఉత్ప‌త్తుల‌ను తీసుకొని ప్ర‌యోగ‌శాల‌లో మాంసంగా త‌యారు చేస్తార‌ని చెబుతున్నారు. పెరుగుతున్న దేశ జ‌నాభాకు పౌష్టికాహారం అందాలంటే త‌క్ష‌ణ‌మే కృత్రిమ మాంసం అందుబాటులోకి రావాల్సి ఉంద‌ని చెబుతున్నారు. కోళ్లు.. గొర్రెలు లాంటి ప‌శువుల మాంసాన్ని మ‌రింత వృద్ది చేయ‌టానికి ఇంజెక్ష‌న్లు ఇచ్చి కృత్రిమంగా త‌యారు చేస్తున్నార‌ని.. వీటి కార‌ణంగా ఆరోగ్యంపై ప్ర‌భావం ప‌డుతుంద‌ని.. ఈ స‌మ‌స్య తాజా వెజ్ మీట్ తో త‌ప్పుతుంద‌ని చెబుతున్నారు.
Tags:    

Similar News