రైతుకుటుంబం నుంచి.. భారత ఉపరాష్ట్రపతి దాకా...

Update: 2017-08-05 14:23 GMT
ముప్పవరపు వెంకయ్యనాయుడు ఖచ్చితంగా తెలుగువాళ్లందరూ గర్వించాల్సిన వ్యక్తి. చాలా చిన్నస్థాయి రైతు కుటుంబం నుంచి వచ్చి.. విద్యార్థి రాజకీయాలు, ఉద్యమాలు వంటి వాటితో తన ప్రజాజీవితాన్న ప్రారంభించి.. ఎంతో సుదీర్ఘ ప్రస్థానం తరువాత.. ఇవాళ భారత ఉపరాష్ట్రపతి అయ్యారు. పార్టీలతో నిమిత్తం తెలుగువాళ్లందరూ కూడా అందుకు ఎంతో సంతోషిస్తున్నారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు జీవన, రాజకీయ ప్రస్థానం గురించి కొన్ని వివరాలు..

కృషి శిఖరాలను అధిరోహించిన ఎందరో మహనీయులు.. మట్టిలోంచి బయటకు వచ్చిన మాణిక్యాలే. మన ముప్పవరపు వెంకయ్యనాయుడు గారిది కూడా ఆ తరహాలోనే అంచెలుగా ఎదిగిన అనుపమాన ప్రస్థానమే. ఎక్కడి చవటపాలెం? దేశానికి దిగువ తూరుపు తీరంలోని నెల్లూరు జిల్లాలో.. వెంకటాచలం ఓ చిన్న మండలం. అందులో ఓ కుగ్రామం చవటపాలెం!నేలతల్లిని నమ్ముకున్న సామాన్య వ్యవసాయ కుటుంబం రంగయ్యనాయుడు- రమణమ్మ గార్లది. ఆ కుటుంబంలో అత్యంత సామాన్యమైన వ్యక్తిగానే 1949 జులై 1న జన్మించారు వెంకయ్యనాయుడు గారు. బాల్యం నుంచి సత్‌సంస్కారాలతో వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దుకుంటూ... తనకోసం తను బతకడం కంటె.. నలుగురికోసం తను బతకడంలో ఉన్న తృప్తిలోని వ్యత్యాసాన్ని స్వానుభవంలో చవిచూస్తూ... అడుగులు వేశారు.

నెల్లూరు వి.ఆర్. కాలేజీలో డిగ్రీ చేస్తున్న రోజుల్లోనే ఆయనలోని నాయకత్వ లక్షణాలు మొగ్గతొడగడం ప్రారంభించాయి. ఆంధ్రా యూనివర్సిటీలో లా చేస్తుండగా అవి ఇంకాస్త పరిణత రూపాన్ని సంతరించుకున్నాయి. తన మదిలో మెదలుతున్న ప్రజాజీవిత లక్ష్యాలు నిర్దిష్టంగా రూపుదిద్దుకున్నాయి. 1971లోనే విఆర్ కాలేజీ విద్యార్థి సంఘ అధ్యక్షుడు అయ్యారు. 1973-74లో ఆంధ్రా యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ ప్రెసిడెంట్

 అయ్యారు. 1974లో లోక్ నాయక్ జయప్రకాష్ నారాయణ్ క్షేత్ర సంఘర్షణ సమితికి ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ గా పనిచేసి అవినీతికి వ్యతిరేకంగా ఉద్యమంలో పాల్గొని ఎమర్జెన్సీ సందర్భంగా జైలుకి వెళ్ళారు. తరువాత బి.జె.పీలో అనేక పదవులు అలంకరించి 2002-2004 వరకూ భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులుగా తనదైన ముద్ర వేసారు. 1978-83 మధ్య కాలంలో ఉదయగిరి నియోజకవర్గానికి 2 సార్లు ఎమ్మెల్యే గా ఎన్నికయ్యారు. 1998నుంచి 2016 వరనకు కర్ణాటక నుంచీ రాజ్యసభసభ్యులుగా సేవలందిస్తూ వచ్చారు. 2016 నుంచీ రాజస్థాన్ నుంచి రాజ్యసభ సభ్యులుగా కొనసాగుతున్నారు.  ప్రస్తుతం భారతీయజనతాపార్టీ పార్లమెంటరీ బోర్డు మెంబరుగా  కేంద్ర పట్టణాభివృద్ధి, పట్టణ గృహ నిర్మాణం, సమాచార ప్రసార శాఖామంత్రిగా పనిచేస్తూ ఆ పదవులకే వన్నె తెచ్చారు. తాజాగా ఐక్యరాజ్యసమితి ఆవాస విభాగానికి ఏకగ్రీవంగా అద్యక్షులుగా ఎన్నికయ్యారు.

భారత రాష్ట్రపతి పదవికే భాజపా తరఫున తొలుత ఆయన పేరు వినిపించింది. అయితే పార్టీ రకరకాల కాంబినేషన్లను పరిశీలించడంతో.. రాంనాధ్ కోవింద్ తెరమీదికి వచ్చారు. కానీ వెంకయ్య మీద ఉన్న గౌరవంతో మోడీ ఆయనను  ఉపరాష్ట్రపతి పదవికి ఎంపిక చేశారు. మహాత్మాగాంధీ మనవడు గోపాలకృష్ణ గాంధీ మీద వెంకయ్యనాయుడు 272 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. వెంకయ్యకు 512 ట్లు రాగా, గోపాలకృష్ణ గాంధీకి 244 ఓట్లు మాత్రమే దక్కాయి.
Tags:    

Similar News