‘అమ్మ’ విషయంలో వెంకయ్యకు ఎంత జాగ్రత్త?

Update: 2016-04-20 04:56 GMT
రాజకీయాల్లో జాగ్రత్తగా ఉండే రోజులు పోయి చాలానే రోజులైంది. ప్రత్యర్తుల విషయంలో నోటికి వచ్చినట్లు మాట్లాడటం మామూలే. అందుకు భిన్నంగా కేంద్రమంత్రి వెంకయ్య అనుసరిస్తున్న తీరు ఆశ్చర్యాన్ని కలిగించటం ఖాయం. ఎన్నికల వేళ.. రాజకీయ ప్రత్యర్థిపై ఏ చిన్న అవకాశం వచ్చినా మొహమాటం లేకుండా విరుచుకుపడటం మామూలే. దీనికి భిన్నంగా కేంద్రమంత్రి వెంకయ్య అనుసరిస్తున్న వైనం విస్మయాన్ని రేకెత్తించటం ఖాయం.

దేశంలోని ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల మధ్య మాటలు తూటాల్లా పేలుతున్నాయి. రాజకీయ ప్రత్యర్థుల విషయంలో ఎలాంటి మొహమాటాలు లేకుండా విమర్శలు చేసేస్తున్నారు. దీనికి ప్రధాని మోడీ సైతం మినహాయింపు కాదు. కాకుంటే మిగిలిన నేతలు కాస్త మాస్ గా మాట్లాడితే మోడీ మాత్రం క్లాస్ గా మాట్లాడతారు. కానీ.. ఆయన ప్రసంగాల్లో ప్రత్యర్థులపై ‘దాడి’ స్పష్టంగా కనిపిస్తోంది.

ఇలాంటి సమయంలో వెంకయ్య తీరు భిన్నంగా కనిపిస్తుంది. తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితను కలిసే విషయంలో తమకు ఇబ్బందులు ఎదురవుతాయని.. ఆమెను కలవటం అంత తేలికైన విషయం కాదంటూ కేంద్రమంత్రులు మండిపడుతున్న వేళ... వెంకయ్య మాత్రం అందుకు భిన్నంగా ‘అమ్మ’ను కలిసే విషయంలో తనకెప్పుడూ ఎలాంటి ఇబ్బంది ఎదురుకాలేదని చెప్పటం గమనార్హం.

ఇలాంటి మాటలు ఎప్పుడో ఒకసారి అయితే ఫర్లేదు. తాజాగా వెంకయ్య జరిపిన తమిళనాడు పర్యటనలోనూ ఇదే మాటను చెప్పి ఆశ్చర్యపరిచారు. తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరగటం.. బీజేపీకి అమ్మ పార్టీ ప్రత్యర్థిగా ఉన్న వేళ.. వీలైనన్ని విమర్శలు వెంకయ్య నోటి నుంచి ఆశించిన కమలనాథులకు.. అమ్మ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తూ చేసిన వ్యాఖ్యలు ఆసక్తికరంగా ఉన్నాయి. జయలలితను కలవటంలో తనకు ఎప్పుడూ ఎలాంటి ఇబ్బంది కలగలేదని వెంకయ్య చెప్పుకొచ్చారు.

ముఖ్యమంత్రి జయలలితను కలవలేకపోయినట్లుగా పలువురు కేంద్రమంత్రులు వ్యాఖ్యానించటంపై స్పందించిన వెంకయ్య.. శాఖా పరంగా వారు కలవలేకపోయి ఉండొచ్చు.. అయినా కేంద్రమంత్రులు ప్రజాసేవ కోసమే ఉన్నారు.. అందువల్ల పరస్పర ఆరోపణలు ఆరోగ్యకరమైనవి కాదనటం గమనార్హం. ప్రత్యర్తులపై ఒంటికాలిపై మండిపడే వెంకయ్య జయలలిత విషయంలో మాత్రం ఇంతలా ఆచితూచి ఎందుకు మాట్లాడుతున్నట్లు చెప్మా..? అన్న సందేహం ఇప్పుడు అందరి మదిలో మెదులుతోంది.
Tags:    

Similar News