అబ్బే...మా పార్టీలో చేరేవారికి డ‌బ్బులు ఇవ్వ‌ట్లేదు

Update: 2017-10-23 12:50 GMT
ప్ర‌ధాన‌మంత్రి న‌రేంద్ర మోడీ స్వ‌రాష్ట్రమైన గుజ‌రాత్‌ లో రాజ‌కీయాలు రంజుగా మారుతున్నాయి. పటేదార్ నాయకులకు బీజేపీ లంచం ఇస్తోంద‌ని పటేదార్ ఉద్యమనేత హార్దిక్‌ పటేల్ నుంచి నెల రోజుల క్రితం  విడిపోయి బీజేపీలో చేరేందుకు సిద్ధ‌మైన న‌రేంద్ర ప‌టేల్ వెల్ల‌డించిన సంగ‌తి తెలిసిందే. ఈ ప‌రిణామంపై కాంగ్రెస్ పార్టీ మండిపడుతూ కోట్లాది రూపాయ‌లు వెద‌జ‌ల్లుతూ ప‌టేల్ సామాజిక‌వ‌ర్గాల నేత‌ల‌ను బీజేపీ తమ పార్టీలోకి ఆహ్వానిస్తోందని ధ్వ‌జ‌మెత్తింది. కాంగ్రెస్‌ చేసిన ఆరోపణలను గుజరాత్‌ ముఖ్యమంత్రి విజయ్‌ రూపానీ కొట్టివేశారు.

పటేదార్ బీజేపీకి మ‌ద్ద‌తు ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నారని - గుజరాత్‌ ఎన్నికల్లో వారు తమకు మద్దతు ఇస్తారని రూపానీ చెప్పారు. గుజరాత్‌ లో పటేదార్ నాయకుల్లో ఒకరికి కోటి రూపాయిలు ఇచ్చినట్లు బీజేపీపై కాంగ్రెస్ చేస్తున్న‌ ఆరోపణల్లో నిజం లేద‌ని ఆయ‌న తెలిపారు. ఆస‌క్తి ఉన్న నేత‌లే త‌మ పార్టీలోకి వస్తున్నార‌ని..,ఈ విష‌యంలో ఎవ‌రిపై తాము ఒత్తిడి చేయ‌డం లేద‌ని...మ‌రెవ‌రికీ తాము డ‌బ్బులు ఇవ్వ‌డం లేద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీతో పటేదార్ నాయకుడు నిఖిల్‌ సవానీ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో పటేదార్ ఉద్యమ నేత హార్దిక్‌ పటేల్‌ నుంచి విడిపోయి కొద్ది రోజుల క్రితం బిజెపిలో చేరిన నిఖిల్‌ సవానీ నేడు ఆ పార్టీకి రాజీనామా చేశారు. పాటిదార్ల సమస్యలు - వారి ఆందోళన తదితర అంశాలను వివరించానని - పటేదార్ కు న్యాయం చేయాలని కోరానని నిఖిల్‌ సవానీ చెప్పారు.

కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో అహ్మదాబాద్‌ లో నిర్వ‌హించిన‌ భారీ ర్యాలీ - బహిరంగ సభలో కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌ గాంధీ మాట్లాడుతూ బీజేపీపై విమ‌ర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టామని చెప్పుకుంటున్న మేకిన్‌ ఇండియా - స్టార్టప్‌ ఇండియా పథకాలు పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. ఈ సంద‌ర్భంగా రాహుల్‌ గాంధీ ప్రధాని మోడీపై విమర్శలు కురిపించారు. గుజరాత్‌ లో 30 లక్షల మంది నిరుద్యోగులు ఉన్నారని, బీజేపీ పాలనలో ఉపాధి అవకాశాలు తగ్గిపోయాయని రాహుల్ అన్నారు. ఎనిమిది పది మంది వ్యాపారులే గుజారాత్‌ ను నడిపిస్తున్నారన్నారు. సరైన అధ్యయనం లేకుండానే జీఎస్టీని బీజేపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిందని రాహుల్‌ గాంధీ విమర్శించారు.
Tags:    

Similar News