చిన‌బాబు ఎంత బ‌ద్ద‌కిస్టో చెప్పిన విజ‌య‌సాయి

Update: 2018-08-16 04:56 GMT
ఏపీ మంత్రి నారా లోకేశ్ మ‌రోసారి వార్త‌ల్లోకి వ‌చ్చారు. త‌న మాట‌ల‌తో.. చేత‌ల‌తో త‌ర‌చూ ఇమేజ్ డ్యామేజ్ చేసుకునే ఆయ‌న‌.. తాజాగా మ‌రోసారి అలాంటి ప‌నే చేశారు. ఆయ‌న చేసిన ప‌ని గురించి తెలిసిన వారంతా ముక్కున వేలేసుకుంటున్నారు. పంద్రాగ‌స్టు సంద‌ర్భంగా జెండా ఎగుర‌వేసే కార్య‌క్ర‌మాన్ని లోకేశ్ అనుస‌రించిన వైనం ఆశ్చ‌ర్యానికి గురి చేయ‌ట‌మే కాదు.. విమ‌ర్శ‌లు చేసే అవ‌కాశాన్ని ఇచ్చింది.

జెండా ఎగుర‌వేసే కార్య‌క్ర‌మాన్ని త‌న ఇంటి పై క‌ప్పు మీద‌.. పోలీసుల గౌర‌వ‌వంద‌నంతో చేసిన వైనాన్ని ప‌లువురు తీవ్రంగా త‌ప్పు ప‌డుతున్నారు. లోకేశ్ బ‌ద్ధ‌కానికి.. తీవ్ర అధికార దుర్వినియోగానికి ఈ ఉదంతం నిద‌ర్శంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజ్య‌స‌భ స‌భ్యుడు విజ‌య‌సాయి రెడ్డి త‌ప్పు ప‌ట్టారు.

స్వాతంత్య్ర దినోత్స‌వం సంద‌ర్భంగా పోలీసుల‌తో గౌర‌వ వంద‌నం అందుకొని ఇంటి పైక‌ప్పు మీదే జాతీయ జెండాను ఆవిష్క‌రించిన మంత్రి లోకేశ్ ఒక్క‌రేన‌ని.. ఆయ‌న శుద్ధ బ‌ద్ధ‌కానికి.. తీవ్ర అధికార దుర్వినియోగానికి తాజా నిద‌ర్శ‌నం ఇదేనంటూ విజ‌య‌సాయి ట్విట్ట‌ర్ లో ట్వీట్ చేశారు. నోటి మాట‌గా కాకుండా.. ఇందుకు సంబంధించిన ఒక ఫోటోను ఆయ‌న పోస్ట్ చేశారు. ఫోటోను నిశితంగా చూస్తే.. లోకేశ్ తో పాటు.. ఆయ‌న కుటుంబ స‌భ్యులు స‌తీమ‌ణి బ్రాహ్మ‌ణి.. కుమారుడు దేవాన్ష్ లతో పాటు పెద్ద ఎత్తున పోలీసులు క‌నిపిస్తున్నారు.

ఇంటి పైక‌ప్పుడు మీద జెండా ఎగుర‌వేయ‌టం త‌ప్పు కాకున్నా.. పోలీసుల గౌర‌వ వంద‌నం తీసుకోకుండా.. త‌న కుటుంబ స‌భ్యుల న‌డుమ నిరాడంబ‌రంగా జెండా వంద‌నం చేయ‌టం త‌ప్పు కాదు. కానీ.. మంత్రిగా ఉన్న హోదాను ప్ర‌ద‌ర్శిస్తూ.. త‌మ కుటుంబ స‌భ్యుల న‌డుమ ఎగుర‌వేసే జాతీయ జెండా కోసం పోలీసుల గౌర‌వ‌వంద‌నం తీసుకోవ‌టాన్ని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. లోకేశ్ చ‌ర్య పూర్తిగా అధికార దుర్వినియోగంగా ప‌లువురు అభివ‌ర్ణిస్తున్నారు.

లోకేశ్ చ‌ర్య‌ను త‌ప్పు ప‌ట్టిన విజ‌య‌సాయి రెడ్డి.. కాంగ్రెస్ జాతీయ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీని బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి క‌ల‌వ‌టాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఈ స‌మావేశం నీచ రాజ‌కీయంగా విజ‌య‌సాయి రెడ్డి అభివ‌ర్ణించారు. నాడు రాహుల్ గాంధీ అధికార దుర‌హంకారంతో కేసులు ప‌ట్టించి.. గ‌తంలో అన్యాయంగా జ‌గ‌న్ ను జైలు పాలు చేశార‌ని.. అలాంటి నేత‌తో ఈ రోజు చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి క‌ల‌వ‌టాన్ని త‌ప్పు ప‌ట్టారు. ఈ స‌మావేశం దేనికి నిద‌ర్శ‌న‌మ‌ని  ప్ర‌శ్నించారు.
Tags:    

Similar News