రాముల‌మ్మ రంగంలోకి దిగుతార‌ట‌!

Update: 2018-10-31 05:15 GMT
నిన్న‌టి వ‌ర‌కూ స్టార్ క్యాంపైన‌ర్ కాస్తా ఇప్పుడు రంగంలోకి దిగేందుకు రెఢీ అవుతున్నారు. ఆవేశ‌పూరిత ప్ర‌సంగాల‌తో.. ఒక‌ప్ప‌టి టీఆర్ఎస్ ముద్దుల చెల్లెమ్మ క‌మ్ ఫైర్ బ్రాండ్ రాముల‌మ్మ ఎన్నిక‌ల బ‌రిలోకి రానున్నారా? అన్న‌ది ఇప్పుడు ఆస‌క్తిక‌రంగా మారింది. సినీన‌టిగా త‌న‌కున్న క్రేజ్ ను రాజ‌కీయాల్లోకి వ‌చ్చిన త‌ర్వాత త‌న‌దైన శైలిలో అడుగులు వేస్తూ.. త‌న ఇమేజ్ ను ఎప్ప‌టికిప్పుడు పెంచుకునేలా ఆమె వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రిస్తున్న‌ట్లు చెబుతున్నారు.

మొన్న‌టివ‌ర‌కూ ప్ర‌త్య‌క్ష పోటీకి పెద్ద‌గా ఆస‌క్తి చూపించ‌ని ఆమె.. ఇప్పుడు అందుకు భిన్నంగా మ‌న‌సు మార్చుకున్న‌ట్లు తెలుస్తోంది. ఈసారి ఉన్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో పోటీ చేయ‌టం త‌న‌కు చాలా మంచిద‌న్న భావ‌న‌కు వ‌చ్చిన ఆమెకు త‌గ్గ‌ట్లే.. కాంగ్రెస్ అధిష్ఠానం సైతం అదే ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లుగా తెలుస్తోంది.

తొలుత రాముల‌మ్మ‌తో పాటు.. పార్టీ అధినాయ‌క‌త్వం కూడా పోటీకి దూరంగా ఉండాల‌ని భావించారు. అయితే.. మారిన ప‌రిస్థితుల‌తో పాటు.. బ‌రిలోకి దిగితే గెలిచేందుకు అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉండ‌టం.. ఇప్ప‌టికే ఉన్న సానుకూల‌త‌ను మ‌రింత పెంచుకునేందుకు అవ‌స‌ర‌మైన అన్నింటిని ఉప‌యోగించుకోవాల‌న్న ఆలోచ‌న‌లో ఉన్న‌ట్లు చెబుతున్నారు. దీనికి త‌గ్గ‌ట్లే విజ‌య‌శాంతి సైతం ఎన్నిక‌ల్లో పోటీ చేసేందుకు ఆస‌క్తి చూపుతున్న‌ట్లుగా స‌మాచారం.

అన్ని అనుకున్న‌ట్లు జ‌రిగితే.. కాంగ్రెస్ విడుద‌ల చేసే తొలిజాబితాలోనే ఆమె పేరు ఉన్న‌ట్లుగా చెబుతున్నారు. ఇప్పుడున్న రాజ‌కీయ స‌మీక‌ర‌ణ‌ల‌తో చూసిన‌ప్పుడు ఆమె దుబ్బాక నుంచి పోటీకి దిగితే బాగుంటుంద‌న్న ఆలోచ‌న‌లో అధిష్ఠానం ఉన్న‌ట్లుగా తెలుస్తోంది. గెలుపు ప‌క్కా ఉన్న నేత‌ల్ని మాత్ర‌మే బ‌రిలోకి దించాల‌ని.. అన‌వ‌స‌ర‌మైన ఇగోల‌కు వెళ్లి .. టికెట్లు కోరితే బాగోద‌న్న హెచ్చ‌రిక‌ను పార్టీ నుంచి స్ప‌ష్టంగా వ‌స్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇప్పుడున్న ప్ర‌త్యేక ప‌రిస్థితుల్లో తెలంగాణ‌లో విజ‌యాన్ని సాధిస్తే.. అదొక్క తెలంగాణ రాష్ట్రానికే ప‌రిమితం కాబోద‌ని.. దాని ప్ర‌భావం దేశం మీద ప‌డుతుంద‌న్న విష‌యాన్ని గుర్తించిన కాంగ్రెస్‌.. అందుకు త‌గ్గ‌ట్లే అడుగులు వేయ‌టం షురూ చేసిన‌ట్లుగా చెబుతున్నారు. ఏ చిన్న త‌ప్పు దొర్ల‌కూడ‌ద‌ని.. మొత్తంగా మైలేజీ కాంగ్రెస్ ఖాతాలో ప‌డాల‌న్న గ‌ట్టి ప‌ట్టుద‌ల‌తో ఉన్న కాంగ్రెస్‌.. తాను చేయించిన స‌ర్వేల‌తోనే విజ‌య‌శాంతిని బ‌రిలోకి దించాల‌ని భావిస్తున్న‌ట్లుగా చెబుతున్నారు.


Tags:    

Similar News