ఏపీలో బీఆర్‌ఎస్‌ విస్తరణపై విజయశాంతి సంచలన వ్యాఖ్యలు!

Update: 2023-01-03 10:48 GMT
తెలంగాణ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్‌ పార్టీ అధినేత కేసీఆర్‌పై బీజేపీ నాయకురాలు విజయశాంతి ట్విటర్‌ లో తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్‌ఎస్‌ రూపంలో ఏపీలో బీజేపీకి దెబ్బతీసేందుకు కేసీఆర్‌ ప్రయత్నాలు చేస్తున్నారని ఆ ట్వీట్‌ లో విమర్శించారు. తెలంగాణ ప్రజల్ని మోసం చేసినట్టే.. ఏపీ ప్రజల్ని నమ్మించగలుగుతానని కేసీఆర్‌ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారంటూ మండిపడ్డారు. తెలంగాణని అప్పులపాలు చేసిన కేసీఆర్‌ తీరు ఏపీ ప్రజలకు తెలుసని.. రెండు రాష్ట్రాలు బీఆర్‌ఎస్‌ కి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయమని పేర్కొన్నారు.

''ఏపీలో జనసేనను, జనసేనతో సానుకూలమై ఉన్న బీజేపీని నష్టపరిచేందుకు కేసీఆర్‌ 'బీఆర్‌ఎస్‌' రూపంలో ప్రయత్నం చేస్తున్నారు. ఏపీలో బీఆర్‌ఎస్‌ చేరికల పరిణామమే అందుకు సంకేతాలిస్తున్నాయి. తెలంగాణ ప్రజలను మోసగించినట్లే, ఏపీలోనూ ప్రజలను నమ్మించగలుగుతానని కేసీఆర్‌ పిచ్చి ప్రయోగాలు చేస్తున్నారు' అని విజయశాంతి తన ట్వీట్‌ లో మండిపడ్డారు.

అలాగే 'ఏది ఏమైనా.. ఏపీలో రాజ్యాధికార అర్హత కలిగిన బలమైన సామాజిక వర్గాన్ని బీజేపీకి దూరం చేసేందుకు కేసీఆర్‌ బీఆర్‌ఎస్‌ పేరుతో చేస్తున్న దుష్ప్రయత్నాన్ని ఏపీతోపాటు తెలంగాణలో రాజకీయంగా వెనక్కు నెట్టివేయబడ్డ అన్ని వర్గాల సముదాయాలు అర్థం చేసుకుని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి' అని విజయశాంతి తన ట్వీట్‌ లో పేర్కొన్నారు.

అదేవిధంగా 'ధనిక తెలంగాణను అప్పులపాలు చేసి, ఆత్మహత్యల రాష్ట్రంగా మార్చిన కేసీఆర్‌ తీరు ఏపీ ప్రజలకి తెలియంది కాదు. రెండు రాష్ట్రాల ప్రజలు బీఆర్‌ఎస్‌కి కర్రుకాల్చి వాత పెట్టడం ఖాయం' అంటూ విజయశాంతి వరుస ట్వీట్లు చేశారు.

సర్పంచ్‌లను కేసీఆర్‌ భిక్షగాళ్లను చేశారంటూ విజయశాంతి మండిపడ్డారు. తెలంగాణ సర్కారు తీరు చూస్తుంటే.. తన ఇంటిని తానే దోచుకుంటున్న వైనంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌ల డిజిటల్‌ కీస్‌ ని అధికారుల సాయంతో ఉపయోగించి నిధులు మళ్లిస్తున్నారని విజయశాంతి సంచలన వ్యాఖ్యలు చేశారు.

కేసీఆర్‌ ప్రభుత్వ చర్యలతో కరెంట్‌ బిల్లులు కట్టలేక, కార్మికులకు జీతాలివ్వలేక సర్పంచ్‌లు ఇబ్బందులు పడుతున్నారన్నారని విజయశాంతి తెలిపారు. అప్పులు చేసి మరీ గ్రామాభివృద్ధికి పనులు చేయిస్తే.. ఆ బిల్లులు ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఇప్పుడు కేంద్రం నుంచి వచ్చిన నిధుల్ని సైతం లాక్కుంటున్నారని విమర్శించారు. ధనిక రాష్ట్రాన్ని అప్పులపాలు చేసి.. చివరికి భిక్షాటన చేసే పరిస్థితికి సర్పంచ్‌లను దిగజార్చారని విజయశాంతి ఆగ్రహం వ్యక్తం చేశారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News