విజయశాంతికి ఆ అవకాశం దక్కలేదాయే!

Update: 2018-11-14 10:33 GMT
పాపం.. విజయశాంతి అలా సర్దుకుపోతున్నారు. అధ్యక్షా అని అవకాశం వస్తుందని ఆమె లోలోపల ఆశపడినా - బయటకు మాత్రం కాదు కాదు అంటూ తప్పించుకున్నారు.  నియోజవకర్గంలో ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఆమె - అసెంబ్లీ ఎన్నికల్లో చాన్స్ వస్తుందేమోనని కూడా ఎదురు చూశారు. తాజాగా కాంగ్రెస్ విడుదల చేసిన రెండు జాబితాల్లోనూ ఆమె పేరు లేదు.

సాధారణంగా పార్లమెంటు కంటే..  అసెంబ్లీలో  'అధ్యక్షా..' అనేందుకే చాలా మంది ఇష్టపడుతుంటారు. ఈ విషయంలో  సినీ నటి విజయశాంతికి కూడా ఆశలు లేకపోలేదు.  కానీ, టైమ్‌ మాత్రం ఆమెకు కలిసిరావడం లేదు.  ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా ఎమ్మెల్యే టిక్కెట్‌ దక్కించుకుందామని విజయశాంతి విశ్వ ప్రయత్నాలు చేశారు. కానీ, అధిష్టానం ఆమెకు టిక్కెట్‌  ప్రకటించలేదు.  'స్టార్‌ క్యాంపెయినర్‌' అనే బాధ్యతను అప్పగించి ఊరుకుంది.

గతంలో టీఆర్‌ ఎస్‌ నుంచి ఎంపీగా గెలిచిన ఆమె  ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా జరిగారు.  తెలంగాణలో ముందస్తు ఎన్నికల ఊపు మొదలయ్యాక.. మరలా వెలుగులోకి వచ్చారు. రాష్ట్రమంతా తిరగడం ప్రారంభించారు   డైరెక్ట్‌గా సోనియా - రాహుల్‌ గాంధీలతో సంబంధాలు నెరుపుతున్నారు. ఢిల్లీ పెద్దల అండదండలు మెండుగా ఉన్నా,  ఆమెకు  పార్టీ టిక్కెట్‌ దొరక్కపోవడం దురదృష్ట కరమే.

'నేను స్టార్‌ క్యాంపెయినర్‌ ని.. అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేయాల్సి వస్తే నా నియోజకవర్గానికే పరిమితమవ్వాలి.. అందుకే నేను టిక్కెట్‌ అడగలేదు. టిక్కెట్‌ రాకపోవడం వెనుక పార్టీ తప్పిదమేమీ లేదు' అంటూ విజయశాంతి పేర్కొన్నారు. అంటే..  'అలా సర్దుకుపోవాలి' అన్నది ఆమె అభిప్రాయపడుతున్నట్లు ఉన్నారు.   పార్టీ కోసం అంతలా కష్టపడుతున్న  విజయశాంతి.. అభ్యర్థుల ఎంపికపై అధిష్ఠానానికి నివేదికలు పంపారట. మరి ఆమెకు టిక్కెట్‌ దండగని   నివేదిక పంపినదెవరా అని ఆరా తీస్తే.. టిక్కెట్ల ఎంపికలో కీలక పాత్ర పోషించిన ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి పేర్లే వినిపిస్తున్నాయట.. ఏదీ నిజమో.. అబద్దమో కానీ.. కాంగ్రెస్ లో ఏదైనా జరుగుతుందనేదిని ఇంతకంటే నిదర్శనాలు లేవని రాజకీయవిశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు..
    

Tags:    

Similar News