కాంగ్రెస్‌-టీడీపీ పొత్తు ఖ‌రారు..ఆమెకు న‌చ్చ‌లేదు

Update: 2018-09-11 17:35 GMT
తెలంగాణ‌లో ముంద‌స్తు ఎన్నిక‌ల ఎత్తుగ‌డ‌లు తారాస్థాయికి చేరుకున్నాయి. అధికార ప్ర‌తిప‌క్షాలు త‌మ‌దైన శైలిలో ఎన్నిక‌ల‌ను హీటెక్కిస్తున్నాయి. అధికార టీఆర్ ఎస్ పార్టీ ఒంట‌రిగా బ‌రిలో దిగేందుకు సిద్ద‌మైన నేప‌థ్యంలో...విప‌క్షాలు మ‌హాకూట‌మిగా జ‌ట్టుక‌డుతున్నాయి. తాజాగా తెలంగాణలో కాంగ్రెస్‌ - టీడీపీ మధ్య పొత్తు ఖరారైంది. ఈ రెండు పార్టీలూ సీపీఐతో కలిసి ఎన్నికల బరిలోకి దిగాలని నిర్ణయించాయి. కాంగ్రెస్‌ - తెలుగుదేశం - సీ పీఐ నేతలు ఇవాళ పార్క్‌ హయత్‌ హోటల్‌ లో సమావేశమై ఈమేరకు అంగీకారానికి వచ్చారు. అయితే ఈ పొత్తుపై కాంగ్రెస్ సీనియ‌ర్ నేత ఒక‌రు అస‌హ‌నం వ్య‌క్తం చేశారు. ప్ర‌జ‌ల గ‌ళం అంటూ త‌న పొత్తును తీవ్రంగా త‌ప్పుప‌ట్టారు. ఆమె ఎవ‌రో కాదు..ఫైర్‌ బ్రాండ్ నేత విజ‌య‌శాంతి.

టీఆర్ ఎస్ పార్టీని ఎదుర్కోవ‌డంలో భాగంగా మ‌హాకూట‌మి తెర‌మీద‌కు రావ‌డం - అందులో భాగంగా చ‌ర్చ‌లు మొద‌ల‌వ‌డం...ఈ రోజు తుది ద‌శ‌కు చేర‌డం తెలిసిన సంగ‌తే. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి - టీటీడీపీ అధ్యక్షుడు ఎల్‌.రమణ - సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి హైద‌రాబాద్‌ లో స‌మావేశమై ఈ పొత్తు ఖ‌రారు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయా పార్టీల నేత‌లు మాట్లాడుతూ మూడు పార్టీలు కలిసి మహాకూటమిని ఏర్పాటు చేస్తామని ఈ సందర్భంగా   ప్రకటించారు. అన్ని ప్రజా సంఘాలు - ఉద్యోగ - నిరుద్యోగ - మహిళా సంఘాలతో కలిసి వెళ్తామని నేతలు వివరించారు. ఉమ్మడి మేనిఫెస్టోను విడుదల చేయాలని వీరు నిర్ణయించారు. త్వరలోనే మహాకూటమి బహిరంగ సభ నిర్వహిస్తారమని చెప్పారు. కేసీఆర్ మరోసారి అధికారంలోకి రాకుండా చేసేందుకు అన్ని ప్రతిపక్షాలను కలుపుకొని ఎన్నికలకు వెళ్తామని పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌ తెలిపారు.

అయితే ఈ ప్ర‌క‌ట‌న వెలువ‌డిన కొన్ని గంట‌ల వ్య‌వ‌ధిలో....కాంగ్రెస్ పార్టీ నాయ‌కురాలు విజయశాంతి స్పందించారు. పొత్తును తీవ్రంగా త‌ప్పుప‌డుతూ త‌మ అభిప్రాయం తెలియ‌జెప్పారు. తెలుగుదేశం తో పొత్తు తెలంగాణ ప్రజలకు ఆమోదయోగ్యమా కాదా అన్న అంశాన్ని కాంగ్రెస్ మరో సారి క్షేత్ర స్థాయిలో విశ్లేషించుకోవాలి అంటూ న‌ర్మ‌గ‌ర్భంగా వ్యాఖ్యానించారు. పొత్తుపై తెలంగాణ ప్రజల్లో అభ్యంతారాలు వస్తున్నట్టుగా సమాచారం వస్తోంది అంటూ త‌న భావాన్ని వెల్ల‌డించారు. పార్టీ నేత‌ల మ‌నోభావాల‌ను గౌర‌వించాల‌న్నారు. విజ‌య‌శాంతి వ్యాఖ్య‌లు పార్టీలో క‌ల‌క‌లానికి దారితీస్తున్నాయి. కాగా, పొత్తుల చ‌ర్చ‌లు మొదలైన నాటి నుంచి స్పందించ‌ని విజ‌యశాంతి నేడు రియాక్ట‌వ‌డం...టీడీపీ-బీజేపీ దోస్తీని నిర‌సించ‌డం...హాట్ టాపిక్‌గా మారింది.

Tags:    

Similar News