నాకు కేసీఆర్ తోనే పోటీ:విజ‌య‌శాంతి

Update: 2018-10-08 14:34 GMT
తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క‌మైన పార్టీ పోషించిన వారిలో లేడీ అమితాబ్ విజ‌య శాంతి ఒక‌రు. గ‌తంలో టీఆర్ ఎస్ లో కీల‌క‌నేత‌గా ఓ వెలుగు వెలిగిన విజ‌య శాంతి....ఆ త‌ర్వాత అనూహ్య ప‌రిణామాల మ‌ధ్య టీఆర్ ఎస్ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేశారు. ఆ త‌ర్వాత కేసీఆర్ పై విమ‌ర్శ‌లు గుప్పించారు. ముంద‌స్తు ఎన్నిక‌ల నేప‌థ్యంలో కాంగ్రెస్ లో చేరిన విజ‌య‌శాంతి....కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయిన‌ర్ గా దూసుకుపోతున్నారు. ఇప్ప‌టికే కేసీఆర్ పై క‌త్తి దూసిన రాముల‌మ్మ‌....రాబోయే ఎన్నిక‌ల్లో కేసీఆర్ ఓట‌మి త‌ప్ప‌ద‌ని జోస్యం చెప్పారు. తాజాగా, మ‌రోసారి కేసీఆర్ పై విజ‌య‌శాంతి సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. కేసీఆర్ త‌న‌ సమ ఉజ్జీ అని - కేటీఆర్ - కవితలు పిల్లలని విజ‌య‌శాంతి షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ , తాను స‌ముజ్జీల‌మ‌ని....త‌న‌కు కేటీఆర్ - క‌విత‌ల‌తో పోటీ లేద‌ని చెప్పారు. కేసీఆర్ తనకు దేవుడు ఇచ్చిన అన్న అని గ‌తంలో ఎప్పుడూ అన‌లేద‌ని విజ‌య‌శాంతి స్పష్టం చేశారు.

తెలంగాణ సాధనలో తాను కీల‌క‌మైన పాత్ర పోషించాన‌ని,  ఆ ఉద్య‌మంలో తనకు 100కు 100 మార్కులు పడ్డాయని అన్నారు. కానీ, టీఆర్ఎస్ లో వేరేవారి ఎదుగుద‌ల‌ను కేసీఆర్ ఓర్వ లేర‌ని, అందుకే పార్టీ నుంచి త‌న‌ను త‌ప్పించార‌ని చెప్పారు. తాను టీఆర్ ఎస్ లో బ‌ల‌మైన నాయ‌కురాలిగా ఎద‌గ‌డం కేసీఆర్ కు న‌చ్చ‌లేద‌ని చెప్పారు. కేసీఆర్ కు దీటుగా ...స‌మ ఉజ్జీలా తాను క‌నిపించినందుకే త‌న‌పై వేటు వేశార‌ని అన్నారు. కానీ, తనను ఎందుకు బయటకు పంపారో ఇప్ప‌టిదాకా చెప్పలేదని అన్నారు. కేసీఆర్ నాలుగేళ్ల పాల‌నతో తెలంగాణ ప్ర‌జ‌లు విసిగిపోయార‌ని ఎద్దేవా చేశారు. ఇకపై కేసీఆర్ అబ‌ద్ధాల‌ను తెలంగాణ ప్రజలు నమ్మర‌న్నారు. కేసీఆర్ స‌మ‌ర్థ‌వంత‌మైన సీఎం కాద‌ని, అందుకే ఆయ‌న ఓట‌మిని కోరుకుంటున్నాన‌ని చెప్పారు. తాను కోరుకున్న బంగారు తెలంగాణ ఇది కాదని అన్నారు. కాంగ్రెస్ పార్టీ క్యాంపెయినర్ గా రాష్ట్రమంతా పర్యటిస్తాన‌ని, అందుకే ఎన్నికల్లో పోటీ చేయ‌డం లేద‌ని అన్నారు. మహాకూటమికి 110 సీట్లు వస్తాయని ధీమా వ్య‌క్తం చేశారు. మహాకూటమిలో టీడీపీ చేరిక‌ను తాను వ్యతిరేకించలేదని, సమీకరణాల విషయంలో జాగ్రత్తగా ఉండాలని మాత్ర‌మే సూచించాన‌న్నారు. కాంగ్రెస్ గెలుపు తర్వాతే త‌న‌ రాజకీయ భవిష్యత్తు పై క్లారిటీ వ‌స్తుంద‌న్నారు.
Tags:    

Similar News