విలన్ రామిరెడ్డి పాత్రలో కేసీఆర్ : విజయశాంతి

Update: 2018-10-05 11:46 GMT
కేసీఆర్ కు దేవుడిచ్చిన చెల్లెలు ఎట్టకేలకు రెచ్చిపోయింది. తన అన్న అని ఇనాళ్లు భావించిన కేసీఆర్ కు షాక్ ఇచ్చింది. అదీ అలా ఇలా కాదు.. డిఫెరెంట్ గా.. కేసీఆర్ తో కలిసి చాలా రోజులు టీఆర్ ఎస్ పార్టీలో కలిసి పనిచేసిన విజయశాంతి అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ లో చేరారు. 2014 ఎన్నికల్లో ఓడిపోయాక రాజకీయంగా సైలెంట్ అయ్యారు. ఈ మధ్య యాక్టివ్ పాలిటిక్స్ లోకి వచ్చారు.  తాజాగా కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెయినర్ అవతారం ఎత్తారు. దీంతో అందరి దృష్టిని ఆకర్షించాలని చాలా సరికొత్తగా విమర్శలకు దిగుతున్నారు. ఏకంగా కేసీఆర్ ను టార్గెట్ చేసిన ఆమె చేసిన విమర్శలు ఇప్పుడు వైరల్ గా మారాయి.

విజయశాంతి తాజాగా మాట్లాడుతూ.. ప్రజల్ని కాస్త పట్టించుకోండి దొరగారూ అంటూ మండిపడ్డారు. నాలుగున్నరేళ్లు ప్రగతి భవన్ లోనూ..  ఇప్పుడు ఫామ్ హౌస్ లోనూ కూర్చున్నావంటూ ఎద్దేవా చేశారు.  అంతేకాదు.. ఓసేయ్ రాములమ్మా సినిమాను తలపించేలా రాష్ట్రంలో కేసీఆర్ పాలన సాగుతోందని విమర్శించారు. తాను ఆ సినిమాలో దొరలతో ఎన్ని కష్టాలు పడ్డానో తెలుసుకదా అని.. ప్రస్తుతం తెలంగాణలో దొరల పాలనలో అవే కష్టాలు ఎదురవుతున్నట్లు మండిపడ్డారు. రాములమ్మ సినిమాలో రామిరెడ్డి ఉంటే.. ఇక్కడ కేసీఆర్ ఉన్నారన్న ఆమె.. ఉద్యమంలో చూసిన కేసీఆర్ వేరు.. ఇప్పుడు వేరు అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.

అంతేకాదు.. తనకు టీఆర్ ఎస్ పార్టీలో జరిగిన అవమానాలను విజయశాంతి గుర్తు చేసుకున్నారు. ‘నా చెల్లివి.. నిన్ను కడుపులో పెట్టుకొని చూసుకుంటానన్న కేసీఆర్.. తనను దారుణంగా మోసగించారన్నారు. తననే మోసం చేసినప్పుడు ప్రజలను చేయరా’ అని ప్రశ్నించారు. కేసీఆర్ కుటుంబంలోని నలుగురు రాష్ట్రంలోని డబ్బును దోచుకుంటున్నారని.. తెలంగాణకు వీరు చార్ మినార్ లు కారని.. చోర్ మినార్ లు అని మండిపడ్డారు. తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ లో టీఆర్ ఎస్ ను కలుపుతానని కేసీఆర్ మాట ఇచ్చాడని.. సోనియా ఒప్పుకున్నాక మోసం చేశాడని విజయశాంతి సంచలన ఆరోపణలు గుప్పించారు.

ఇలా ఇన్నాళ్లు కేసీఆర్ పట్ల కాస్తో కూస్తో సునిశితంగా వెళ్లిన విజయశాంతి తాజా ఆరోపణలతో కలకలం రేపారు. మరి తనను విలన్ రామిరెడ్డితో పోల్చిన విజయశాంతికి కేసీఆర్ ఎలాంటి సమాధానం  ఇస్తాడనేది వేచిచూడాల్సిందే..
Tags:    

Similar News