రాములమ్మకు టీకాంగ్రెస్ పగ్గాలు

Update: 2016-07-15 07:49 GMT
దారీతెన్ను లేకుండా సాగుతూ.. టీఆరెస్ అధినేత కేసీఆర్ రాజకీయ వ్యూహాల్లో చిక్కుకుని విలవిలలాడుతున్న తెలంగాణ కాంగ్రెస్ పార్టీని దూకుడు - ఛరిష్మా రెండూ ఉన్న నేత చేతిలో పెట్టాలని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోంది. ఈ క్రమంలో టీపీసీసీ అధ్యక్ష పదవి రేసులో మాజీ ఎంపీ - సినీ నటి విజయశాంతి పేరు ముందువరుసలో ఉన్నట్లు తెలుస్తోంది. బీజేపీలో - టీఆరెస్ లో పనిచేయడమే కాకుండా కొంతకాలం సొంత పార్టీని కూడా నడిపించిన అనుభవం.. తన వాణిని బలంగా వినిపించడం.. ఆకట్టుకునేలా మాట్లాడడంతో పాటు సినిమా రంగం నుంచి బయటకొచ్చి చాలాకాలమైనా కూడా ఇంకా తరగని అభిమానం అన్నీ ఉన్న విజయశాంతికి పార్టీ పగ్గాలు అప్పగిస్తే కేసీఆర్ ను ధీటుగా ఎదుర్కోగలుగుతుందని భావిస్తున్నారు.  

మరోవైపు టీఆరెస్ లో ఉన్న సమయంలో కొద్దికాలం పాటు విజయశాంతికి మంచి ప్రాధాన్యం దక్కింది. కేసీఆర్ కూడా తన చెల్లెల్లు అంటూ రాజకీయంగా కాన్ఫిడెన్సులోకి తీసుకునేవారు. ఆ తరువాత విభేదాల కారణంగా ఆమె బయటకొచ్చేసినా కూడా కేసీఆర్ ను, ఆయన రాజకీయ వ్యూహాలను దగ్గరగా చూసిన ఆమె.. ఆయన్ను ఎదుర్కోగలుగుతారని కాంగ్రెస్ అధిష్ఠానం భావిస్తోందట.  నాయకత్వ లక్షణాలున్న విజయశాంతి మొదట్లో బీజేపీలో ఉన్నా అప్పట్లో బీజేపీ బలంగా లేకపోవడం.. ఆ తరువాత సొంతంగా ఆమె పార్టీ పెట్టిన సరైన దిశానిర్దేశం - అండదండలు లేకపోవడంతో పెద్దగా సక్సెస్ కాలేదు. అయినా.. కూడా ఆమెకు రాజకీయంగా ఇప్పటికీ క్రేజ్ తగ్గలేదు. ఇప్పుడు ఎంతో మంది సీనియర్ నేతలు - క్యాడర్... అధిష్ఠానం నుంచి అండదండలు ఉంటే విజయశాంతి దూసుకుపోగలరని అనుకుంటున్నారు. ఆమె సారథ్యంలో పార్టీ రథం పరుగులు తీయడం ఖాయమని సోనియా - రాహుల్ కూడా అనుకుంటున్నారని తెలుస్తోంది.

దాంతోపాటు ప్రస్తుతం టీ కాంగ్రెస్ నేతల్లో ఒకరంటే ఒకరికి పడదు. అందువల్ల ఎవరికి టీపీసీసీ అధ్యక్ష పదవి ఇచ్చినా ఇంకొకరు సహకరించరు. ఈ క్రమంలో కాంగ్రెస్  పార్టీలో రెండేళ్ల కిందట చేరినా యాక్టివ్ గా లేకపోవడంతో ఎవరితోనూ విభేదాలు లేని విజయశాంతి అయితేనే బెటరన్న అభిప్రాయంలో ఉన్నారట.  కాగా కాంగ్రెస్ అధిష్ఠానం మదిలో రాములమ్మ పేరు మెరవడానికి మాత్రం కారణం ప్రశాంత్ కిశోర్.. ప్రస్తుతం కాంగ్రెస్ తో కలిసి పనిచేస్తున్న ఈ ఎన్నికల వ్యూహకర్త టీపీసీసీకి కొత్త సారథి అవసరమని.. అది కూడా కొత్త నేతలు అయి ఉండాలని చెబుతూ రాహుల్ గాంధీకి కొన్ని లక్షణాలు చెప్పారట. లక్షణాలు చెప్పడంతోపాటు విజయశాంతి, అజారుద్దీన్ పేర్లు సూచించి అందులో విజయశాంతి అయితే మరీ మంచిదని చెప్పినట్లు సమాచారం. ఎన్నికల వ్యూహకర్తగా పేరుగాంచిన ప్రశాంత్ ఏం చెబితే అది జరుగుతున్న తరుణంలో కాంగ్రెస్ పార్టీ ఆయన మాట వింటే రాములమ్మకు రూట్ క్లియర్ అయినట్లే.  అదే నిజమైతే కేసీఆర్ కు ఒకప్పటి చెల్లెలితో పోరు మళ్లీ మొదలైనట్లే.
Tags:    

Similar News