వరల్డ్ లో బెజవాడకు థర్డ్ ప్లేస్ వచ్చింది

Update: 2016-08-20 10:07 GMT
ప్రపంచ స్థాయి నగరంగా బెజవాడకు ఇప్పటివరకూ గుర్తింపు వచ్చింది లేదు. ఆ మాటకు వస్తే.. ఆ దిశగా ఎప్పుడూ చర్చజరిగిందీ లేదు. రాష్ట్ర విభజన పుణ్యమా అని.. ఏపీ రాజధాని బెజవాడ.. గుంటూరు కు మధ్యన ఏర్పాటు చేయటం.. భవిష్యత్తులో ఈ రెండు పట్టణాలు మహానగరాలుగా మారే అవకాశం ఉందన్న అంచనాను పలువురు వ్యక్తం చేస్తుంటారు. దీనికి తగ్గట్లే ఏపీ ముఖ్యమంత్రి చేపట్టిన ప్లాన్లు సైతం అదే రీతిలో ఉండటంతో రానున్న రోజుల్లో బెజవాడ భారీ నగరంగా మారే అవకాశాన్ని కొట్టి పారేయలేని పరిస్థితి.

ఇదిలా ఉంటే.. తాజాగా ఒక అంశం విషయంలో బెజవాడకు ప్రపంచ స్థాయి గుర్తింపు వచ్చింది. ప్రపంచంలో అత్యధిక జనసాంద్రత కలిగిన నగరాల జాబితాలో బెజవాడ చేరింది. ఈ జాబితాలో బంగ్లాదేశ్ రాజధాని ఢాకా తొలిస్థానంలో నిలిస్తే.. రెండోస్థానంలో పాకిస్థాన్ కు చెందిన హైదరాబాద్ నగరం రెండో స్థానం నిలిచింది. ఇక.. మూడోస్థానంలో ఏపీలోని బెజవాడ చేరింది. ప్రసుతం 17.5 లక్షల జనాభా ఉన్న బెజవాడ లో చదరపు కిలోమీటర్ కు 31,200 మంది ఉన్నట్లు లెక్క వేశారు. బెజవాడ కు పక్కనే ఉండే గుంటూరులో చదరపు కిలోమీటర్ కు21,100 మంది నివసిస్తుంటే.. ముంబయి మహానగరంలో చదరపు కిలో మీటర్ కు 26,600 మంది నివసిస్తున్నట్లుగా తేలింది.

ఇప్పుడే ఇంత రద్దీగా ఉన్న రెండు భారీ పట్టణాల మధ్యన.. పెద్ద రాజధానిని నిర్మించే ప్రయత్నాన్ని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్న నేపథ్యంలో.. జనసాంధ్రత మరింత పెరిగే అవకాశం ఉందంటున్నారు. అదే జరిగితే.. రెండు పట్టణాలు కిక్కిరిసిపోయినట్లుగా ఉంటాయని.. దీని వల్ల అనేక దుష్పరిణామాలు చోటు చేసుకునే వీలు ఉందన్న హెచ్చరికలు చేస్తున్నారు. ప్రపంచంలోనే జనసాంద్రత ఎక్కువగా ఉన్న బెజవాడ ను వీలైనంతగా మార్చటానికి వీలుగా ఏపీ సర్కారు ప్రణాళికలు రూపొందించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో అక్కడి ప్రజలకు మరిన్ని తిప్పలు తప్పనట్లే.
Tags:    

Similar News