దమ్ముందా? అంటూ ఉమ్మేయటమేంటి కెప్టెన్?

Update: 2015-12-29 04:18 GMT
అసహనం అన్నది ఒక అలవాటుగా మారినట్లుంది. సామాన్యుల కంటే కూడా ప్రముఖులకు.. రాజకీయ నాయకులకు ఈ జబ్బు ఈ మద్య ఎక్కువైనట్లుంది. నలుగురి కంటే భిన్నమైన వాళ్లమని చెప్పుకునే వారంతా వీలైనంతవరకూ జాగ్రత్తగా ఉండటమే కాదు.. ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే.. తమ బాధ్యతను మరిచి.. ఎదుటోళ్ల మీద విరుచుకుపడే చిత్రమైన ధోరణి ఈ మధ్యన ఎక్కువైంది. ఇక.. రాజకీయ నాయకులు అయితే.. అవసరం ఉన్నా లేకున్నా మీడియా మీద చిరాకు పడటం.. చిందులు వేయటం మరీ ఎక్కువైంది.

ఈ మధ్యన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు విషయాన్నే తీసుకుందాం. కాల్ మనీ వ్యవహారంలో మీడియాకు నోటీసులు ఇస్తామంటూ వ్యాఖ్యానించారు. అదేమంటే.. ముసుగులేయించి మరీ ఏవో మాటలు చెప్పిస్తున్నారంటూ మీడియా మీద చిందులు వేశారు. తన మనసులోకి వచ్చిన సందేహాల్ని ఇలా మాట్లాడే కన్నా.. ఆధారాలతో మాట్లాడితే బాగుండేది. రాజకీయాల్లో తలపండిన చంద్రబాబు లాంటి వారే ఇంత చిరాగ్గా ఉంటే.. మిగిలిన వారి సంగతి చెప్పాల్సిన అవసరమే లేదు.

తాజాగా తమిళనాడు కెప్టెన్ గా సుపరిచితుడు.. డీఎండీకే పార్టీ అధినేత విజయకాంత్ పూనకం వచ్చేసినట్లుగా వ్యవహరించారు. తానొక బాధ్యతాయుతమైన ప్రజాప్రతినిధిని అన్న విషయాన్ని తాత్కలికంగా మర్చిపోయారు. చెన్నైలో మీడియాతో మాట్లాడిన ఆయన. విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సావధానంగా సమాధానాలు చెబుతున్నట్లే చెప్పిన ఆయన.. ఉన్నట్లుండి పూనకం వచ్చినట్లుగా ఊగిపోయారు. మీడియా ప్రతినిధుల మీద ఒంటి కాలి మీద ఎగిరారు. మీడియా మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ.. ‘‘థూ’’ అంటూ తెగబడ్డారు.

మీకు ముఖ్యమంత్రి జయలలితను ప్రశ్నించే దమ్ముందా? జయలలిత అంటే మీకు భయం.. మీరు జర్నలిస్టులేనా? అంటూ ఉమ్మేశారు. ప్రశ్నించే ధైర్యం లేదంటూ విరుచుకుపడిన విజయకాంత్.. తనను కూడా ప్రశ్నించొద్దన్నట్లుగా వ్యవహరించటం అభ్యంతరకరం. తమిళనాడు ముఖ్యమంత్రి వైఖరిని ప్రశ్నించినందుకే.. తమిళనాడులోని ఒక ఇంగ్లిషు దినపత్రిక దాదాపు 400పైగా కేసులు ఎదుర్కొంటున్న దుస్థితి. మంచి సంప్రదాయాల్ని నెలకొల్పాల్సిన ప్రముఖులు.. తాము సమాధానాలు చెప్పలేని ప్రశ్నలకు వంకర టింకరగా బదులివ్వటం.. అదేమంటే నోరు జారటం.. నీదేం మీడియా? అంటూ ఎదురుదాడి చేసే తీరు ఏ మాత్రం మంచిది కాదు. మరి.. ఈ విషయం విజయ్ కాంత్ లాంటి వారికి ఎప్పటికి అర్థమయ్యేను?
Tags:    

Similar News