ర‌జ‌నీ-క‌మ‌ల్ నా జూనియ‌ర్లే..బీజేపీకి అంత సీన్ లేదు

Update: 2018-02-12 16:30 GMT
త‌మిళ రాజ‌కీయాలు మ‌రోమారు హీటెక్కుతున్నాయి. అమ్మ మ‌ర‌ణంతో మొద‌లైన ఈ రాజ‌కీయాలు సినీ స్టార్లు కమల్‌ హాసన్ - రజనీకాంత్ రాజకీయంపై దృష్టిపెడుతుండటంతో మ‌రింత ఆస‌క్తిక‌రంగా మారాయి. దీంతో తమిళనాట ఏం జరుగుతుందోనని అభిమానులు - రాజకీయవేత్తలు ఆతృతగా ఎదురుచూస్తున్న విషయం తెలిసిందే. అవసరమైతే రజనీతో కలిసి రాజకీయాల్లో పోటీ చేస్తామని కమల్ ఇటీవలే ప్రకటించాడు. రజనీది కాషాయరంగు కాదని నేను భావిస్తున్నా. ఒకవేళ కాషాయరంగైతే ఆయనతో కలిసి పనిచేయలేను అని స్పష్టంచేశారు. హార్వర్డ్ వర్సిటీలో జరిగిన సదస్సులో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని పరిస్థితులను సవాల్ చేసేందుకే రాజకీయాల్లోకి వస్తున్నానని చెప్పారు. సదస్సుకు హాజరైన వారి ప్రశ్నకు సమాధానం చెబుతూ మ్యానిఫెస్టోపై తమ ఆలోచనలు ఒకేలా ఉన్నా మతాలు - రంగు విషయంలో తేడాలు ఉన్నాయన్నారు.

ఇదిలాఉంటే తమిళనాడులో ఇప్పటికే రాజకీయపరంగా ఇప్ప‌టికే అనుభవం గడించిన సినీన‌టుడు విజయ్‌ కాంత్ ఆస‌క్తిక‌రంగా స్పందించారు. కమల్ - రజనీ అంశంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. రజనీకాంత్ - కమల్‌ హాసన్ రాజకీయాల్లో తనకు జూనియర్లని అన్నారు. అంబత్తూరులో జరిగిన ఓ కార్యక్రమంలో విజయ్‌ కాంత్ మాట్లాడుతూ సినిమా రంగంలో మాత్రం రజనీ - కమల్ తనకు సీనియర్లే.. కానీ రాజకీయాల్లో మాత్రం జూనియర్లేనన్నారు. వారిద్దరూ రాజకీయాల్లో సక్సెస్ సాధించలేరని స్పష్టం చేశారు.

ఇక త‌మిళనాడులో ఎంట్రీ కోసం త‌హ‌త‌హ‌లాడుతున్న బీజేపీకి పంచ్ వేశారు. తమిళనాడులో బీజేపీ కాలు మోపనుందని పలువురు అభిప్రాయపడుతున్నారని, అయితే కాలు కాదు కదా... చేయి కూడా మోపలేదని చమత్కరించారు. త‌న రాజ‌కీయ ప‌య‌నం గురించి ప్ర‌స్తావిస్తూ స్థానిక సంస్థల ఎన్నికల్లో డీఎండీకే ఒంటరిగానే పోటీ చేయనుందని క్లారిటీ ఇచ్చారు.
Tags:    

Similar News