అతడి కళ్లల్లో భయం చూశాడట..కుమ్మేస్తానంటున్నాడు

Update: 2016-06-27 05:26 GMT
పాత సీన్ ఒకటి మళ్లీ పునరావృతమైంది. ప్రొఫెషనల్ బాక్సింగ్ లో అడుగు పెట్టిన నాటి నుంచి భారత బాక్సర్ విజేందర్ ను అతడి ప్రత్యర్థులు తక్కువ చేసి మాట్లాడటం.. చులకనగా వ్యవహరించటం తెలిసిందే. తనను తక్కువ చేసి మాట్లాడే ప్రత్యర్థుల విషయంలో నోరు జారని విజేందర్.. తన సత్తాను రింగ్ లో చూపించటం అలవాటే. ఒకరు ఎముకలు విరిచేస్తానని.. మరొకరు పాము రక్తం తాగినోడ్ని విజేందర్ ఎంత? ఇలాంటి మాటలెన్నో చెప్పిన వారంతా విజేందర్ పంచ్ కు దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అయినోళ్లే.

తాజాగా మరో ప్రత్యర్థి తెర మీదకు వచ్చాడు. వచ్చీ రావటంతోనేవిజేందర్ మీద మాటల యుద్ధం మొదలెట్టాడు. జులై 16న న్యూఢిల్లీలో జరిగే డబ్ల్యూఓ ఆసియా పసిఫిక్ సూపర్ మిడిల్ వెయిట్ ఛాంపియన్ షిప్ లో విజేందర్ తో తలపడనున్న ఆస్ట్రేలియా బాక్సర్ కెర్రీ నోటికి వచ్చినట్లుగా మాట్లాడుతున్నాడు. తాజాగా ఈ ఇద్దరితో సమావేశం నిర్వహించిన సందర్భంగా.. తనను చూసే సమయంలో విజేందర్ కళ్లల్లో భయం చూసినట్లుగా చెప్పటమే కాదు.. జులై 16న విజేందర్ ను అభిమానించే వారంతా బాధ పడటం ఖాయంగా వ్యాఖ్యానించాడు.

తన చేతిలో విజేందర్ కు కష్టాలు తప్పని.. అతడికి ప్రొఫెషనల్ బాక్సర్ ఎలా ఉంటాడో తాను రుచి చూపిస్తానని.. రింగ్ లో ఎక్కువసేపు ఉండకుండా అతడిపై ఒత్తిడిని తీసుకురానున్నట్లుగా వెల్లడించారు. ఓపక్క కెర్రీ తనదైన శైలిలో వ్యాఖ్యలు చేస్తుంటే.. విజేందర్ మాత్రం ఎప్పటిలానే హుందాగా ఉండిపోయాడు. మాటల్లో కంటే.. రింగ్ లోనే చూపించాల్సింది ఎక్కువ కదా. తుది ఫలితం కోసం మరో మూడు వారాలు (సుమారు) ఎదురుచూడాల్సిందే.
Tags:    

Similar News