వైర‌ల్ గా కేసీఆర్ లేని కాళేశ్వ‌రం వీడియో!

Update: 2019-06-21 07:24 GMT
తెలంగాణ రాష్ట్ర చ‌రిత్ర‌లో ఒక మార్క్ గా నిలిచిపోయే రోజుగా జూన్ 21 నిలుస్తుంద‌ని చెప్పాలి. ఇలాంటి రోజు కోసం తెలంగాణ రాష్ట్ర ముఖ్య‌మంత్రి కేసీఆర్ ఎంతోకాలంగా ఎదురుచూస్తున్నారు. తాను చెప్పే మాట‌లు చేత‌ల్లో చేసి చూపించేందుకు ఆయ‌న ప‌డిన త‌ప‌న‌కు నిలువెత్తు నిద‌ర్శ‌నంగా కాళేశ్వ‌రం ప్రాజెక్టును చెప్పాలి.

భారీ బ‌డ్జెట్ తో కేంద్ర‌ప్ర‌భుత్వ సాయం తీసుకోకుండా కేవ‌లం రాష్ట్రం సొంతంగా స‌మ‌కూర్చుకున్న నిధుల‌తో ఇంత భారీ నిర్మాణం స్వ‌ల్ప వ్య‌వ‌ధిలో పూర్తి చేయ‌టం మామూలు విష‌యం కాదు. ప్రాజెక్టు ప‌రంగా కొన్ని అభ్యంత‌రాలు ఉన్నా.. భ‌విష్య‌త్ అవ‌స‌రాల్ని దృష్టిలో పెట్టుకొని చూసిన‌ప్పుడు కేసీఆర్ నిర్ణ‌యం క‌రెక్టేన‌దేనన్న భావ‌న కలుగుతుంది.

కాళేశ్వ‌రం ప్రాజెక్టు ప‌రంగా ఇప్పుడంతా సానుకూల‌మే న‌డుస్తోంది. అయితే.. దీని నిర్మాణ స‌మ‌యంలో రియ‌ల్ టైంలో ప‌ని చేసిన హ‌రీశ్  ప్ర‌స్తావ‌న ఎక్క‌డా తేకుండా చేస్తున్న కేసీఆర్ వైఖ‌రిని ప‌లువురు త‌ప్పు ప‌డుతున్నారు. కాళేశ్వ‌రం ప్రాజెక్టు డిజైన్ కు సంబంధించి మేదోమ‌ధ‌నం మొత్తం కేసీఆర్ దే అయినా.. దాన్ని ఇప్పుడున్న రూపంలోకి తీసుకొచ్చిన విష‌యంలో మాత్రం క్రెడిట్ మొత్తం హ‌రీశ్ దేన‌ని చెప్పాలి. నిత్యం గంట‌ల కొద్దీ ఆ ప్రాజెక్టు మీద గ‌డిపిన ఆయ‌న‌.. తెర పైన‌.. తెర వెనుక చేసిన క‌స‌ర‌త్తు అంతా ఇంతా కాదు.

ప్రాజెక్టుకు ఇబ్బంది క‌లిగించే ప్ర‌తి విష‌యంలోనూ ఆయ‌న పాత్ర ఉంది. వేల‌సార్లు ప్రాజెక్టును సంద‌ర్శించిన ఆయ‌న‌కు కాళేశ్వ‌రానికి సంబంధించిన ప్ర‌తి అంశంలోనూ అవ‌గాహ‌న ఉంది. మ‌రి.. అంత శ్ర‌మ చేసిన హ‌రీశ్ ను ఇప్పుడు కూర‌లో క‌రివేపాకులా తీసి పారేయ‌టాన్ని టీఆర్ ఎస్ కు చెందిన ప‌లువురు నేత‌లు జీర్ణించుకోలేక‌పోతున్నట్లు చెబుతున్నారు. అలా అని అధినేత‌కు భిన్నంగా నోరు విప్పే సాహ‌సం ఎవ‌రూ చేయ‌లేని ప‌రిస్థితి.

ఇలాంటివేళ ఎవ‌రు చేశారో కానీ.. ఒక వీడియో ఇప్పుడు వైర‌ల్ గా మారింది. కేసీఆర్ కు టిట్ ఫ‌ర్ టాట్ మాదిరి.. కాళేశ్వ‌రం ప్రాజెక్టు వ్య‌వ‌హారంలో హ‌రీశ్ ప్ర‌స్తావ‌న తీసుకురాకుండా చేసిన దానికి బ‌దులుగా ఒక వీడియోను రూపొందించారు. ఇంద్ర సినిమాలో పాట బ్యాక్ డ్రాప్ లో ఉండే ఈ రెండు నిమిషాల‌కు పైనే వీడియోలో ప్ర‌తి ఫ్రేములోనూ కాళేశ్వ‌రం ప్రాజెక్టులో హ‌రీశ్ పాత్ర‌ను తెలిపే దృశ్యాల్ని ఉంచారు. ఆస‌క్తిక‌ర‌మైన విష‌యం ఏమంటే.. ఈ మొత్తం వీడియోలో ఒక్క‌చోట అంటే ఒక్క చోట కూడా కేసీఆర్ క‌నిపించ‌కపోవ‌టం. ఎవ‌రికి అల‌వాటైన రీతిలో వారికి బ‌దులిస్తే బాగా అర్థ‌మ‌వుతుంద‌న్న‌ట్లుగా తాజా వీడియో ఉంద‌న్న మాట ప‌లువురి నోట వినిపించ‌టం గ‌మ‌నార్హం


Full View
Tags:    

Similar News