పాక్ మ‌హిళా క్రికెట‌ర్ల‌కు మ‌నోడే ఇష్ట‌మట‌!

Update: 2016-03-14 07:50 GMT
ఏమైందో ఏమో కానీ.. పాక్ క్రికెట‌ర్లు భార‌త్ మీద వ‌ల్ల‌మాలిన ప్రేమ‌ను ప్ర‌ద‌ర్శిస్తున్నారు. నిన్న‌టికి నిన్న అఫ్రిదీ చెప్పిన మాట‌లు భార‌తీయుల హార్ట్‌ల‌ను ట‌చ్ చేయ‌టం తెలిసిందే. పాక్ క్రికెట‌ర్ల‌ను త‌మ దేశంలో కంటే భార‌త్ లోనే అమితంగా ఆద‌రిస్తార‌ని.. త‌మ‌ను విప‌రీతంగా ప్రేమిస్తార‌ని.. భార‌త్ లో క్రికెట్ ఆడేందుకు వ‌చ్చిన ప్ర‌తిసారీ తాను చాలా సంతోషంగా ఉంటాన‌ని అఫ్రిదీ చెప్ప‌టం తెలిసిందే.

త‌మ‌కు స్వ‌దేశంలో కంటే కూడా.. భార‌త్ లోనే ఎక్కువ ప్రేమ దొరుకుతుంద‌న్న ఆస‌క్తిక‌ర మాట‌ల‌తో చాలామంది నోటి వెంట మాట రాని ప‌రిస్థితి. ఆడేందుకు వ‌చ్చే ఆట‌గాళ్లు స‌వాళ్లు విసిరే ప్ర‌య‌త్నం చేస్తే.. అందుకు భిన్నంగా అఫ్రిది మాట‌లు భార‌తీయుల మ‌న‌సుల్ని దోచుకునేలా ఉన్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా పాక్ మ‌హిళా క్రికెట్ జ‌ట్టు కెప్టెన్ స‌నా మీర్ చెప్పిన విష‌యాలు మ‌రింత ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి.

పాక్ మ‌హిళా క్రికెట్ జ‌ట్టులోని క్రికెట‌ర్ల‌కు టీమిండియా స‌భ్యుడు విరాట్‌కోహ్లీ అంటే చాలా ఇష్ట‌మంట‌. కోహ్లీని త‌మ జ‌ట్టులోని స‌భ్యులు చాలా ఇష్ట‌ప‌డ‌తార‌ని ఆమె చెప్పుకొచ్చారు. త‌న‌కు మాత్రం టీమిండియా కెప్టెన్ ధోనీ అంటే ఇష్ట‌మ‌ని వెల్ల‌డించారు. మైదానంలోనూ.. బ‌య‌టా ధోనీ ప్ర‌వ‌ర్త‌న చాలా హుందాగా ఉంటుంద‌ని.. జూనియ‌ర్ల‌తో కూడిన జ‌ట్టును బ‌ల‌మైన టీమ్ గా మార్చిన ఘ‌న‌త ధోనీకే చెల్లుతుంద‌ని ఆమె చెప్పుకొచ్చారు. ఏమైనా.. పాక్ మ‌హిళా క్రికెట‌ర్ల ఫేవ‌రేట్ మ‌న కోహ్లీ కావ‌టం ఆస‌క్తిక‌రం కదూ. దేశంలోనే కాదు.. దాయాది దేశంలోనూ కోహ్లీకి  ఫ్యాన్స్ భారీగానే ఉన్న విష‌యం తాజాగా మ‌రోసారి రుజువైన‌ట్లే.
Tags:    

Similar News