నాడు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌.. నేడు విజయవాడ విమానాశ్రయం!

Update: 2023-01-21 05:38 GMT
విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ను వంద శాతం ప్రయివేటీకరించడంపై భారీ ఎత్తున ఇప్పటికే ఆందోళనలు కొనసాగుతున్న తెలిసిందే. అయితే ఈ ఆందోళనలను కేంద్ర ప్రభుత్వం అసలు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వ రంగ సంస్థల్లో పెట్టుబడుల ఉపసంహరణ, ప్రయివేటీకరణ కొనసాగిస్తామని ప్రకటించిన కేంద్రం ఆ దిశగా మరింత ముందుకు వెళ్తోంది.

ఉక్కు కర్మాగారాలు, రైల్వేలతో పాటు విమానాశ్రయాలనూ ప్రయివేటీకరించేందుకు చర్యలు షురూ చేసింది. ఇందులో భాగంగా కేంద్రం దృష్టి ఇప్పుడు గన్నవరం విమానాశ్రయంపై పడింది. రాష్ట్ర విభజన తర్వాత శరవేగంగా అభివృద్ధి చెందిన గన్నవరం ఎయిర్‌పోర్టులో పెట్టుబడులు ఉపసంహరించి ప్రయివేట్‌ వ్యక్తులకు, సంస్థలకు అమ్మేందుకు రంగం సిద్ధం చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు ప్రైవేటీకరణ జాబితాలో ఉండటం గమనార్హం. మానిటైజేషన్‌ పైపులైన్‌ కింద కేంద్ర ప్రభుత్వం 2022–25 మధ్యకాలంలో దేశంలోని 25 విమానాశ్రయాలను లీజుకు ఇవ్వాలని నిర్ణయించగా అందులో ఈ మూడూ చోటు సంపాదించుకున్నాయి.

అంతర్జాతీయ విమానాశ్రయంగా గన్నవరం మంచి గుర్తింపు సొంతం చేసుకుంది. అతి తక్కువ టైమ్‌లోనే వేలాది విమాన సర్వీసులు రాకపోకలు సాగించడంతో ఎన్నో రికార్డులు నమోదు చేసింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత విజయవాడ ఎయిర్‌ పోర్ట్‌ కు విమాన ప్రయాణికుల సంఖ్య అనూహ్యంగా పెరిగింది. అనేక విమాన సంస్థలు గన్నవరం ఎయిర్‌ పోర్ట్‌ నుంచి నేరుగా విదేశాలకు తమ సర్వీసులు మొదలుపెట్టాయి.

గన్నవరం విమానాశ్రయం అభివృద్ధి కోసం కేంద్రం పదేళ్లలో దాదాపుగా రూ. 3వేల కోట్లు పెట్టుబడి పెట్టింది ప్రస్తుతం సుమారు 600 కోట్ల పైగా వ్యయంతో డొమెస్టిక్, ఇంటర్నేషనల్‌ బిల్డింగ్‌ పనులు జరుగుతున్నాయి. అత్యాధునిక టెక్నాలజీతో భారీ టెర్మినల్‌ ఈ ఏడాది అందుబాటులోకి వస్తుంది. ఇక ఎయిర్‌ పోర్ట్‌కు రూ.6 వేల కోట్ల స్థిర, చరాస్తులు ఉన్నాయి. ముందు ముందు ఎంతో అబివృద్ధి చెందే అవకాశం కనిపిస్తోంది. గత రెండు మూడేళ్లలోనే ఎయిర్‌పోర్ట్‌ గణనీయంగా 250 శాతం మేర వృద్ధవి సాధించింది.

ఇలా లాభాల్లో ఉన్న ఎయిర్‌పోర్టును 2024 నాటికి పూర్తిగా ప్రయివేటీకరించాలని కేంద్రం యోచిస్తోంది. కేంద్రం నిర్ణయంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నా తగ్గడం లేదు. విమానాశ్రయం ప్రయివేటీకరించాలన్న కేంద్రం ప్రజలతోపాటు ఉద్యోగులు కూడా వ్యతిరేకిస్తున్నారు. అన్నివిధాలా అభివృద్ధి చెందే అవకాశం ఉన్న ఎయిర్‌పోర్టును ప్రయివేట్‌ సంస్థలకు అప్పగించాల్సిన అవసరం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

వచ్చే బడ్జెట్‌లో అమ్మబోయే విమానాశ్రయాల జాబితాను కేంద్రం ప్రకటిస్తుందని చెబుతున్నారు. ఈ జాబితాలో గన్నవరం విమాశ్రయం పేరు కూడా ఉండటం గమనార్హం. విమానయాన రంగంలో ప్రయివేటు పెట్టుబడులను ప్రోత్సహించడం ద్వారా రూ.8,000 కోట్లు రాబట్టుకోవాలని కేంద్ర ప్రభుత్వం తలపోస్తోంది.ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టే బడ్జెట్‌లో విమానాశ్రయాల ప్రైవేటీకరణ ప్రకటన చేయగానే.. తదుపరి ఆమోదానికి పంపుతారని అంటున్నారు.



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News