విశాఖ ఉక్కు ప్రైవేటే....ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన కేంద్రం

Update: 2023-04-14 18:00 GMT
విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే  చెప్పిన మాటలు అన్నీ తూచ్ అనేసింది కేంద్రం. ప్రైవేటీకరణ ఇప్పట్లో లేదు అని కేంద్ర మంత్రి చెప్పారు. అంతే కాదు, స్టీల్ ప్లాంట్ ని బలోపేతం చేయడం మీద దృష్టి పెట్టామని కూడా సెలవిచ్చారు. ఆయన ఇలా చెప్పి ఒక్క రోజు కూడా కాలేదు, కేంద్రం మాత్రం తూచ్ అనేసింది. అలాంటిది ఏమీ లేదని తేల్చేసింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అన్నది జరుగుతుందని స్పష్టం చేసింది. పెట్టుబడులను దశలవారీగా ఉపసంహరించుకుంటామని   కూడా పేర్కొంది. ఈ మేరకు ఈ రోజు కేంద్ర ఉక్కు శాఖ కీలకమైన ప్రకటన విడుదల చేసింది. విశాఖలోని రాష్ట్రీయ ఇస్పాత్ నిగమ్ లిమిటెడ్ లో పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ ఎక్కడా అగిపోలేదని స్పష్టం చేసింది. అది పురోగతిలో ఉందని కొనసాగుతుందని వెల్లడించింది. అంతే కాదు ఈ పెట్టుబడుల ఉపసంహరణ  మరింతగా ముందుకు తీసుకుని పోవడానికి  ప్రయత్నాలు జరుగుతున్నాయని  ప్రకటనలో తెలిపింది.

విశాఖ స్టీల్ ప్లాంట్ లో  పెట్టుబడుల ఉపసంహరణ ప్రక్రియ నిలిచిపోయినట్లుగా పేర్కొంటూ  కొన్ని మీడియా వార్తలలో వచ్చిన విషయాల మీద ఖండన ఇచ్చింది. అంటే దీనిని బట్టి కేంద్రం ఎక్కడా తగ్గలేదు అన్న మాట. మరి సాక్షాత్తూ కేంద్ర మంత్రి గారు విశాఖకు వచ్చి ఈ విధంగా ప్రకటించారు. ఆయన ఏమీ కంగారు లేదు, ప్రైవేటీకరణ అన్నది ఉండదని అభయం ఇచ్చారు.

ఆయన అలా చెప్పి వెళ్లాక కేంద్రం తాపీగా ఈ విధంగా ప్రకటించడం ఏంటని అంతా విస్తుబోతున్నారు. ఏపీ అన్నా విశాఖ ఉక్కు అన్నా లెక్క లేదా అని కూడా విమర్శిస్తున్నారు. రెండేళ్ళుగా విశాఖ ఉక్కు విషయంలో అయోమయానికి లోను చేసిన కేంద్రం ఇపుడు కూడా ఇలాంటి గందరగోళం మాటలే చెబుతోంది అని విమర్శిస్తున్నారు. ఏది ఏమైనా కూడా విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఏ విధంగా రిలీఫ్ ఇచ్చేట్లుగా లేదని అర్ధం అవుతోంది.

అటు బీయారెస్ బోర విడుచుకున్నా మరో వైపు ఏపీలోని అన్ని పార్టీలు కట్టకట్టుకుని నిలబడినా మా దారి ప్రైవేట్ దారి అని కేంద్రం చెప్పేస్తోంది. విశాఖ ఉక్కుని ఒక కాల పరిమితి పెట్టుకుని ప్రైవేట్ పరం చేయడానికే కేంద్రం చూస్తోంది అని అంటున్నరు. అయిఎత విషయం తెలియకనో లేక తాను విశాఖ వచ్చినది ప్లాంట్ ని బలోపేతం చేయడానికి అని చెప్పబోయి కేంద్ర మంత్రి ఫగ్గన్ సింగ్ కులస్తే అలా మాట్లాడారా అన్న చర్చ వస్తోంది.

ఏది ఏమైనా కేంద్ర మంత్రి మాటలు మండు వేసవిలో పన్నీరు జల్లుగా ఒక రోజు విశాఖ వాసులకు హాయి అనిపించాయి. ఇంతలోనే కేంద్రం షాక్ ఇచ్చేసింది. సో విశాఖ ఉక్కు మీద ఏ మాత్రం ఆశలు ఉన్నా వదులుకోవాల్సిందే అంటున్నారు.

Similar News