ఓటర్లు పిచ్చ క్లారిటీతో ఉంటున్నారా?

Update: 2020-02-11 11:00 GMT
రాజకీయం అన్నంతనే తమకు మించి మరెవరికీ తెలీదన్నట్లుగా రాజకీయ నేతలు గొప్పలు చెప్పేసుకుంటారు. వారి తర్వాతి స్థానం మీడియాదే. ప్రజలకు అవగాహన తక్కువని.. తమకు మాత్రమే చాలా తెలుసన్నట్లుగా పలువురు జర్నలిస్టులు చెబుతుంటారు. ఇక.. పొలిటికల్ జర్నలిస్టుల సంగతి చెప్పనక్కర్లేదు. రాజకీయాన్ని కాచి వడబోసినట్లుగా వారి మాటలు ఉంటాయి. అయితే.. ఇటీవల కాలంలో పలు ఎన్నికల్లో ప్రజలు ఇస్తున్నతీర్పు అటు రాజకీయ పార్టీలకే కాదు.. మీడియాకు కూడా షాకిచ్చేలా ఉంటున్నాయి.

ఎక్కడి దాకానో ఎందుకు మనకు బాగా తెలిసిన తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల విషయాన్ని తీసుకోండి. అధికార టీఆర్ ఎస్ కు ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని.. దానికి తోడు కాంగ్రెస్ కు టీడీపీ జత కలవటంతో తిరుగులేదన్న తీర్పులు ఇచ్చేశారు. ఒకవేళ తేడా కొట్టినా.. అటు ఇటు కాని ఫలితం వచ్చే వీలుందన్న లెక్కలు కట్టారు. చివరకు ముందస్తు ఎన్నికలకు వెళ్లిన కేసీఆర్ కు తెలంగాణ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో చెప్పాల్సిన అవసరం లేదు.

భారీ సీట్ల అధిక్యతతో అధికారాన్ని చేపట్టి.. నేల మీద తిరగటం మానేసి.. ఆకాశంలో విహరిస్తున్న కేసీఆర్ కు దిమ్మ తిరిగేలా షాకిచ్చారు తెలంగాణ ప్రజలు. సారు.. కారు.. పదహారు అంటూ రిథమిక్ నినాదానికి అసెంబ్లీ ఎన్నికల్లో కనిపించిన మేజిక్ కనిపించకపోగా.. ముఖం చూపించలేని రీతిలో తీర్పునిచ్చారు. తెలంగాణకు పక్కనున్న ఏపీలోనూ ఇలాంటి పరిస్థితి.

ప్రజల్లో బాబు ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత.. మహిళలకు ఇచ్చే పసుపు కుంకుమ డబ్బులతో కొట్టుకు పోతుందని.. భారీ పోలింగ్ కూడా దీనికి నిదర్శనమంటూ అటు రాజకీయ వర్గాలు.. ఇటు మీడియాలోనూ ప్రచారం సాగినా.. చివరకు ఏపీ ప్రజలు ఎలాంటి తీర్పు ఇచ్చారో తెలిసిందే. ఇలా ఎన్నికలు ఏవైనా.. ఆ సందర్భంగా ఓటర్లు ఇస్తున్న తీర్పును చూస్తే.. ఒక్క విషయం క్లారిటీ రాక మానదు.

ఏ ఎన్నికకు ఎలాంటి తీర్పు ఇవ్వాలన్న విషయం మీద ప్రజలకు ఉన్న అవగాహన తర్వాతే రాజకీయ పార్టీలకు.. మీడియాకు ఉంటుందన్న విషయం అదే పనిగా రిపీట్ అవుతూ ఉంటోంది. తొమ్మిది నెలల క్రితం జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో ఢిల్లీ రాష్ట్రంలోని ఎంపీ సీట్లు మొత్తం బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తే.. తాజాగా వెల్లడవుతున్న అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో చీపురుకట్ట పార్టీ బీజేపీని ఊడ్చేయటమే కాదు.. ముఖం చూపించుకోలేని రీతిలో తీర్పు ఇవ్వటం కనిపిస్తుంది.

లోక్ సభ ఎన్నికల్లో ప్రధాని అయ్యే అవకాశం మోడీకి తప్ప మరొకరికి లేదన్న విషయంపై ప్రజల్లో ఎంత క్లారిటీ ఉందో.. అదే రీతిలో అసెంబ్లీ ఎన్నికల్లో తమ సొంత పాలనకు లేదంటే.. ప్రాంతీయ పార్టీలు బాగా పని చేస్తున్న వారికి ప్రజలు జై కొట్టటం కొట్టొచ్చినట్లుగా కనిపించకమానదు. కొద్దిచోట్ల ఈ లాజిక్ కు భిన్నంగా ఫలితాలు వస్తున్నా.. ఎక్కువచోట్ల మాత్రం ఓటర్లు చాలా తెలివిగా తీర్పును ఇస్తున్నారని చెప్పకతప్పదు.
Tags:    

Similar News