20 కోట్ల మందికి బియ్యం పంచితే.. వరి పండ‌గే!

Update: 2021-11-14 03:35 GMT
దేశంలో ఆహారం అంద‌క దుర్భ‌ర దారిద్య్రంలో ఉన్న‌వారు.. కోట్ల‌లో ఉన్నారు. ప‌ట్టెడు మెతుకుల‌కు కూడా వీరు నోచుకోవ‌డం లేదు. మ‌రోవైపు.. ధాన్యం, ఇత‌ర ఆహార ఉత్ప‌త్తుల‌తో దేశ‌వ్యాప్తంగా గిడ్డంగులు కిక్కిరిసి పోయాయి.  క‌నీసం.. వేలు పెట్ట‌డానికి కూడా చోటు లేని ప‌రిస్థితిలో గిడ్డంగులు ఉన్నాయ‌ని.. అధికారులే చెబుతున్నారు. అంటే..ఒక‌వైపు.. నాలుగు మెతుకుల‌కు నోచుకోని.. కోట్ల కుటుంబాలు.. మ‌రోవైపు.. కిక్కిరి సిపోయిన‌.. ఆహార ధాన్యాల బ‌స్తాల‌తో ఉన్న గిడ్డంగులు. మ‌రి ఏ ప్ర‌భుత్వ‌మైనా.. ఏం చేయాలి?.. దాచు కున్న ధాన్యాన్ని ప్ర‌జ‌ల‌కు పంచాలి. కానీ, కేంద్రంలోని న‌రేంద్ర మోడీ స‌ర్కారు ఆ ప‌నిచేయ‌డం లేదు.

పైగా.. మాద‌గ్గర గిడ్డంగులు ఫుల్లుగా ఉన్నాయి.. మీరు ధాన్యం పండించొద్దు! అంటూ.. రైతుల‌కు.. హుకుం జారీ చేస్తున్న ప‌రిస్థితి నెల‌కొంది. అంటే.. దేశ‌వ్యాప్తంగా ధాన్యం సేక‌రించేందుకు ఇక‌పై ఎఫ్‌సీఐ కానీ.. ఇత‌ర సంస్థ‌లు కానీ.. ముందుకురావు. సో.. ఈ ప‌రిస్థితే.,. ఇటీవ‌ల తెలంగాణ ప్ర‌భుత్వానికి.. కేంద్రానికి మ‌ధ్య వివాదానికి కార‌ణ‌మైంది. వ‌రిసాగును వ‌ద్ద‌ని చెప్ప‌డంపై.. కేసీఆర్ ధ్వ‌జ‌మెత్తారు. పూర్తిగా త‌మ వ‌ద్ద ఉన్న ధాన్యాన్ని సేక‌రించి తీరాల్సిందేన‌ని ఆయ‌న ప‌ట్టుబ‌ట్టారు. ఈ క్ర‌మంలోనే రాష్ట్ర ప్ర‌భుత్వం త‌ర‌ఫున ఒక రోజు దీక్ష కూడా చేశారు.

ఈ క్ర‌మంలో ఇప్పుడు ఏం చేయాల్సి ఉంది?  వ‌రి సేక‌ర‌ణ చేయ‌న‌ని చెప్ప‌డానికి కేంద్రానికి హ‌క్కు ఉందా?  అస‌లు ఏ ఉద్దేశంతో కేంద్రం ఇలా చెప్పింది? అనే విష‌యాలు ఆస‌క్తిగా మారాయి. ప్ర‌స్తుతం ప్ర‌పంచ దేశాల్లో  అంతర్జాతీయ ఆకలి సూచిలో 116 దేశాల జాబితాలో భారత్ 101 స్థానంలో ఉంది. దాదాపు 20 కోట్ల మంది ప్ర‌జ‌ల‌కు ఒక్క పూట కూడా క‌డుపు నిండ‌డం లేద‌న్న‌ది.. ప్ర‌ధాన విమ‌ర్శ‌. వాస్త‌వం కూడా! ఈ క్ర‌మంలో ఇప్ప‌టికే మూలుగుతున్న గిడ్డంగుల్లోని ధాన్యాన్ని.. లేదా గోధుమ‌ల‌ను.. వెంట‌నే పేద‌ల‌కు పంచ‌డం ద్వారా.. గిడ్డంగులు ఖాళీ అవుతాయి.

వ‌రి సేక‌రించ‌బోమ‌న‌డానికి కార‌ణం.. గిడ్డంగుల స‌మ‌స్యే అయితే.. దీనిని ప‌రిష్క‌రించుకునేందుకు ఇది చ‌క్క‌టి అవ‌కాశమ‌ని నిపుణులు చెబుతున్నారు.త ద్వారా.. వ‌రి ధాన్యాన్ని సేక‌రించేందుకు మార్గం సుగ‌మం అవుతుంద‌ని కూడా అంటున్నారు.  ప్రముఖ వరి వ్యవసాయ, ఆర్థిక నిపుణుడు ప్రొఫెసర్ అల్దాస్ జానయ్య అభిప్రాయం మేర‌కు కేంద్ర ప్రభుత్వం వరి సేకరణను `లాభ నష్టాల వాణిజ్య వ్యవహారం`గా చూడటమేనన్నారు. ధాన్యం సేకరణ అనేది ఆహార భద్రతకు సంబంధించిన వ్యవహారంగా ఆయ‌న పేర్కొన్నారు.

దేశ‌వ్యాప్తంగా గోడౌన్లను సాకుగా చూపి.. ధాన్యం సేక‌ర‌ణ చేయ‌క‌పోవ‌డాన్ని ఆయ‌న త‌ప్పుబ‌ట్టారు. ఐక్యరాజ్యసమితి నివేదిక ప్రకారం భారతదేశంలో ఆహార సమస్య తీవ్రంగా ఉంది. వీళ్లందరికి ఉచితంగానో మరొక రూపంలోనో ఆహార ధాన్యాలను పంచితే గోడౌన్లు ఖాళీ అవుతాయి. కరోనా కాలంలోచైనా దాదాపు 100 మిలియన్ టన్నుల బియ్యంను పంపిణీ చేసి, తాజాగా మళ్లీ సెకరించడం మొదలుపెట్టింది. అలా భారత్ చేయాల్సిందే అని ప్రొఫెసర్ జానయ్య  అభిప్రాయ‌ప‌డ్డారు.

ఇక‌, అఖిల భారత కిసాన్ కాంగ్రెస్ అధ్యక్షుడు ఎం కోదండ రెడ్డి కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.  ఎఫ్ సీఐ, గిడ్డంగుల కార్పొరేషన్ రెండు కూడా కరవు నివారణ, ఆకలి నివారణ చట్టం నుంచి పుట్టుకొచ్చాయని,  రైతుల నుంచి ధాన్యం కొనలేమని అనడం చట్ట వ్యతిరేకమ‌ని పేర్కొన్నారు.  ఉన్న ధాన్యాన్ని ప్రజలకు పంచాల‌ని, రేషన్ కోటాను పెంచాలని సూచించారు. త‌ద్వారా గిడ్డంగులు ఖాళీ అయి.. రైతుల నుంచి కొత్త‌గా ధాన్యం సేక‌రించేందుకు అవ‌కాశం ఏర్ప‌డుతుంద‌ని అన్నారు.

``అటల్ బిహారీ వాజ్‌పేయీ ప్రధానిగా ఉన్నపుడు పనికి ఆహార పథకం కింద పెద్దఎత్తున బియ్యం పంచారు. మీరు సముద్రంలో పడేసుకుంటారా లేక ఇథనాల్ ఉత్ప‌త్తికి వాడతారా లేక పేదల పంచుతారా మీ ఇష్టం. కేంద్రం మాత్రం రైతుల నుంచి ధాన్యం సేకరంచితీరాల్సిందే'’అని కోదండ రెడ్డి కరాఖండిగా చెప్పారు. ఇక‌, ప్ర‌ముఖ జ‌ర్న‌లిస్టు.. పాల‌గుమ్మి సాయినాథ్ కూడా ఇదే అభిప్రాయం వ్య‌క్తం చేశారు.

బియ్యాన్ని దేశంలో 20 కోట్ల  అత్యంత నిరుపేద‌ల‌కు పంచ‌డం ద్వారా గిడ్డంగుల‌ను ఖాళీ చేయొచ్చ‌ని ఆయ‌న సూచించారు.  త‌ద్వారా ... రైతుల నుంచి కొత్త ధాన్యం సేక‌రించే అవ‌కాశం ఉంద‌ని.. పేర్కొన్నారు. 20 కోట్ల మందికి ధాన్యంపంచితే.. దేశంలో వ‌రి పండుగ ఖాయ‌మ‌నే నిపుణులు సైతం అభిప్రాయ‌ప‌డుతున్నారు.
Tags:    

Similar News