అనవసరంగా వైసీపీ అల్లరైందా ?

Update: 2021-04-19 09:31 GMT
దారినపోయే చెత్తను నెత్తిన వేసుకోవటమంటే ఇదే. ఉత్తపుణ్యానికి తిరుపతి లోక్ సభ ఉపఎన్నికలో వైసీపీ దొంగఓట్లేయించుకున్నదనే అల్లరైపోయింది. నిజానికి దొంగఓట్లు వేయించుకునేందుకు వైసీపీ చేసిన ప్రయత్నాల్లో పెద్దగా లాభపడింది కూడా ఏమీలేదు. టీడీపీ నేతల ఆరోపణ నిజమే అనుకున్నా ఎంతగా ప్రయత్నాలు చేసిన మహా అయితే 5 వైసీపీ 5 వేల దొంగఓట్లు వేయించుకుని ఉండచ్చు. నిజానికి ఈ దొంగఓట్లు వేయించుకున్నా ఒకటే వేయించుకోకపోయినా ఒకటే.

ఎందుకంటే పోలింగ్ శాతమే చాలా తక్కువగా నమోదైంది. గతంలో ఎప్పుడు లేనంతగా పోలింగ్ శాతం 50కి పడిపోయింది. పోలైన 1.48 లక్షల ఓట్లలో దొంగఓట్ల శాతం చాలా తక్కువనే చెప్పాలి. పోలైన ఓట్లలో 70 శాతం తమకే అనుకూలంగా పోలైనట్లు వైసీపీ నేతలు చెబుతున్నారు. మరి 70 శాతం ఓట్లు వైసీపీకే పోలైతే మళ్ళీ దొంగఓట్ల వేయించుకునేందుకు ప్రయత్నించాల్సిన అవసరం ఏమిటి ?

దొంగఓట్లు లేకుండానే తమకు బాగా సానుకూలమైన ఓటింగ్ జరిగిందని అనుకుంటున్నపుడు దొంగఓట్ల కోసం ప్రయత్నించకుండా ఉంటే సరిపోయేది. టీడీపీ, బీజేపీ నేతలు ఆరోపించినట్లుగా మహా అయితే ఓ 50 బస్సుల్లో బయటప్రాంతాల నుండి జనాలను తిరుపతికి తరలించి ఉండవచ్చని అనుకుందాం. అంటే బస్సుకు ఓ 50 మందిని వేసుకన్నా మహా అయితే 2500 మందికన్నా వచ్చే అవకాశంలేదు.

ఈ 2500-5 వేల ఓట్లకోసం ప్రయత్నించి బాగా అల్లరైపోయిన విషయం అర్ధమవుతోంది. రేపు వైసీపీ గెలిచిన తర్వాత కూడా దొంగ ఓట్లేయించుకునే గెలిచారనే ప్రచారం విపరీతంగా చేస్తారనటంలో సందేహం లేదు. టీడీపీ అధికారంలో ఉన్నపుడు జరిగిన ఎన్నికల్లో ఇంతకన్నా ఘోరంగానే చేసుకున్నది. కాకపోతే మేజర్ మీడియా చంద్రబాబునాయుడు చేతిలో ఉందికాబట్టి అప్పట్లో పెద్దగా అల్లరవ్వలేదు. అంతేకానీ టీడీపీ శుద్దపూసని ఎవరు అనుకోవటంలేదు. మొత్తానికి చేసిన చిన్న ప్రయత్నంతో బాగా అల్లరైపోయిందన్నది మాత్రం వాస్తవం.. 
Tags:    

Similar News