మంటలు మొదటి వారం వరకు తప్పదు.. కేర్ ఫుల్ గా ఉండండి

Update: 2023-05-25 10:10 GMT
'మే' నెలాఖరు వచ్చిందంటే మండే ఎండలు తగ్గి.. వచ్చే వానల కోసం అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తుంటారు. మార్చిలో మొదలయ్యే ఎండ మంటల నుంచి రిలీఫ్ పొందేలా చేసే వర్షాల కోసం వెయిట్ చేస్తుంటారు. అయితే.. ఈసారి వర్షాల కోసం మరింతగా వెయిట్ చేయక తప్పదంటున్నారు వాతావరణ శాఖ అధికారులు. నైరుతి రుతు పవనాలు నెమ్మదిగా కదులుతుండటమే కారణమని వారు చెబుతున్నారు.

నిజానికి ఇప్పటికే కేరళ వరకు రావాల్సిన రుతుపవనాలు ఇప్పటికి అండమాన్ నికోబార్ దీవుల వరకు కూడా వచ్చింది లేదు. గడిచిన మూడురోజులుగా బంగాళాఖాతంలో రుతుపవనాలు నెమ్మదిగా కదులుతున్నాయన్న విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు పేర్కొంటున్నారు.

దీంతో.. ఈ నెలాఖరుకు రుతుపవనాలు కేరళను తాకే అవకాశం తక్కువన్న అంచనాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో.. వేసవి తీవ్రత మరికొన్ని రోజులు కంటిన్యూ  కానున్నట్లు చెబుతున్నారు.

మండే ఎండలకు మే నెలువైనా.. చివరి వారానికి వచ్చేసరికి మార్పులు మొదలుకావటం.. జూన్ మొదటి వారంలో వర్షాలు పడటం జరుగుతుంటుంది. అయితే.. ఈసారి మాత్రం అందుకు భిన్నంగా జూన్ మూడు.. నాలుగు తేదీల్లో కేరళలోకి ఎంట్రీ ఇస్తుందంటున్నారు.

జూన్ రెండో వారానికి తెలుగు రాష్ట్రాల్లోకి ఎంట్రీ ఇస్తుందని చెబుతున్నారు. ఎల్ నినో పరిస్థితుల వల్లే తాజా పరిస్థితి ఉందంటున్నారు. ఈ నేపథ్యంలో జూన్ 8 వరకు రాష్ట్రంలో ఎండల తీవ్రత ఉంటుందని చెబుతున్నారు.

గడిచిన కొద్ది రోజులుగా 40డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు కావటం.. తాజాగా  అలాంటి పరిస్థితులు ఉండటమే కాదు.. రానున్న పది రోజులు ఇలాంటి పరిస్థితులే ఉంటాయన్న అంచనా వ్యక్తమవుతున్నాయి. సో.. కేర్ ఫుల్ గా ఉండాల్సిన అవసరం ఉంది.

Similar News