ఈసారైనా బోస్ మిస్ట‌రీ వీడిపోతుందా?

Update: 2015-09-11 15:38 GMT
స్వాతంత్ర్య పోరాటంలో ఎంతోమంది పోరాడినా.. మిగిలిన వారి కంటే భిన్నంగా వ్య‌వ‌హ‌రించి.. భార‌త స్వాతంత్ర్య స‌మ‌రం గురించి తెలుసుకున్న ప్ర‌తిఒక్క‌రి మ‌న‌సులో గుర్తుండిపోయే పేర్ల‌లో సుభాష్ చంద్ర‌బోస్ ఒక‌టి. మిగిలిన నాయ‌కులు ఎంత‌గా ప్ర‌భావం చూపించినా..బోస్ కు సంబంధించిన చాలా విష‌యాల్లో సందేహాలే త‌ప్పించి.. స‌మాధానాలు దొర‌క‌ని నేప‌థ్యంలో ఆయ‌నోమిస్ట‌రీగా మిగిలిపోతారు.

అందుకే.. చ‌రిత్ర చ‌దివిన వారికి బోస్ గురించిన ఆలోచ‌న‌లు వెంటాడుతుంటాయి. భార‌త స్వాతంత్ర్య స‌మ‌రం గురించి ప్ర‌స్తావ‌న వ‌చ్చిన ప్ర‌తిసారీ బోస్ గురించి కాసేపు మాట్లాడుకోవ‌టం క‌నిపిస్తుంది.

ఆయ‌న మ‌ర‌ణంపై నెల‌కొన్న మిస్ట‌రీ వీడిపోక‌పోవ‌టం.. ఆయ‌న మ‌ర‌ణానికి సంబంధించి ప్ర‌భుత్వం వ‌ద్ద‌నున్న విష‌యాలు అత్యంత ర‌హ‌స్య‌మైన‌విగా దాచేయ‌టంతో ఆయ‌న అదృశ్యంపై వినిపించే క‌థ‌లు ఒక‌కొలిక్కి రాని ప‌రిస్థితి.
అయితే.. అలాంటి ప‌రిస్థితి త్వ‌ర‌లో తీరిపోయే అవ‌కాశం ఉంద‌ని చెబుతున్నారు. ఎందుకంటే బోస్‌ కు సంబంధించిన 64 ప‌త్రాల్ని ఈ నెల 18న బ‌య‌ట‌పెట్ట‌నున్న‌ట్లు ప‌శ్చిమ‌బెంగాల్ ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది. మొత్తం 64 ఫైల్స్ ను బెంగాల్ స‌ర్కారు బ‌య‌పెడుతుంది. 1937 నుంచి 1947 మ‌ధ్య‌లో చోటు చేసుకున్న ప‌రిణామాల‌కు సంబంధించిన వివ‌రాలు ఇందులో ఉంటాయ‌ని చెబుతున్నారు. అదే నిజ‌మైతే.. బోస్‌ కు సంబంధించిన చాలా విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌న్న అభిప్రాయం వ్య‌క్త‌మ‌వుతోంది.

మ‌రోవైపు బోస్ కు సంబంధించిన వివ‌రాలు బెంగాల్ స‌ర్కారు బ‌య‌ట‌పెడితే.. ఇంత‌కాలం అత్యంత ర‌హ‌స్య‌మైన ప‌త్రాలన్న ట్యాగ్ లైన్ తో ఉన్న ఫైళ్ల దుమ్ము దులిపి మోడీ స‌ర్కారు కూడా బ‌య‌ట‌పెట్టేస్తుంద‌ని చెబుతున్నారు. ఒక‌వేళ అనుకున్న‌ది అనుకున్న‌ట్లు జ‌రిగితే.. బోస్ ఎపిసోడ్ మొత్తం త్వ‌ర‌లో బ‌య‌ట‌కు వచ్చేయ‌టం ఖాయ‌మ‌న్న మాట వినిపిస్తోంది.
Tags:    

Similar News