ఇప్పుడీ దీక్షలేంది పవనా? బాబు బాట వీడవా?

Update: 2019-12-12 04:55 GMT
దేనికైనా సమయం సందర్భం ఉండాలి. అసందర్భంగా చేసే పనులతో తలనొప్పులు తర్వాత.. ఉన్న ఇమేజ్ కాస్తా కరిగిపోతుందన్న సత్యాన్ని జనసేన అధినేత పవన్ కల్యాణ్ మరిచిపోతున్నారు. ఏపీ విపక్ష నేత చంద్రబాబు అడుగజాడల్లో నడుస్తున్న ఆయన తీరును సొంత పార్టీ నేతలు.. అభిమానులు సైతం జీర్ణించుకోలేకపోతున్నారు. ఇటీవల కాలంలో ఆయన మాట్లాడుతున్న మాటలు.. చేస్తున్న చేష్టలు చూస్తే.. సొంత ఆలోచనల కంటే కూడా ఎవరో స్క్రిప్ట్ రాసిస్తే.. వాటిని గుడ్డిగా ఫాలో అవుతున్నట్లు ఉన్నాయన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.

సమస్యల్లేని వేళ.. సమస్యలున్నట్లుగా కలర్ ఇచ్చే చంద్రబాబు తీరుకు ఏ మాత్రం తీసిపోని రీతిలో పవన్ తీరు కూడా మారిందంటున్నారు. బుధవారం ఉదయం రైతుల సమస్యలంటూ చంద్రబాబు చేపట్టిన నిరసనలో ఆయన వినిపించిన డిమాండ్లకు పొట్ట చెక్కలయ్యేలా నవ్వే పరిస్థితి.

ఆర్నెల్ల క్రితం వరకూ సీఎంగా ఉన్న చంద్రబాబు తన ఐదేళ్ల పాలనా కాలంలో ఈ సమస్యల పరిష్కారానికి ఏం పీకారన్న సూటిప్రశ్నను సంధిస్తున్నారు. గతంలో తొమ్మిదిన్నరేళ్లు.. మొన్న ఐదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో రైతులు ఎదుర్కొంటున్న ఈ సమస్యల్ని ఎందుకు పరిష్కరించలేదు? అన్న ప్రశ్నతో పాటు.. ఇన్నేళ్లు ముఖ్యమంత్రిగా ఉండి చేయని చంద్రబాబు.. కేవలం ఆర్నెల్ల క్రితం అధికారం చేపట్టిన వారు మాత్రం సమస్యను పరిష్కరించాలంటూ రోడ్ల మీదకు ఎక్కటానికి మించిన దుర్మార్గం ఇంకేమైనా ఉంటుందా? అని ప్రశ్నిస్తున్నారు.

ఈ కారణంతోనే చంద్రబాబు చేస్తున్న దీక్షకు ఎలాంటి మైలేజీ రాకపోగా.. ఆయన ఇమేజ్ అంతకంతకూ డ్యామేజ్ అవుతున్న దుస్థితి. బాబుకు ఏ మాత్రం తీసిపోని పవన్ ఈ రోజు తూర్పుగోదావరిజిల్లా కాకినాడలో (జేఎన్ టీయూ ఎదురుగా ఉన్న మైదానంలో) రైతు సౌభాగ్య దీక్షను చేపట్టనున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించి బకాయిలు చెల్లించాలని.. మిల్లర్లకు ఇచ్చే ధాన్యానికి రశీదులు ఇవ్వాలనే డిమాండ్ల మీద దీక్ష చేయటం విశేషం.

దీక్ష చేస్తున్న పవన్ కు పలువురు సంధిస్తున్న సూటిప్రశ్న ఒక్కటే. ఈ సమస్యల మీద బాబు పాలించిన ఐదేళ్లలో ఒక్కసారి కూడా డిమాండ్ చేయని పవన్.. ఇప్పుడు ఏకంగా దీక్ష చేసుడేంది? అని అడుగుతున్నారు. బాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఐదేళ్లలో నిద్రపోయిన పవన్.. ఇప్పుడు మాత్రం అందుకు భిన్నంగా రోజుకో సమస్యను తెర మీదకు తీసుకొస్తూ చేస్తున్న హడావుడి ఏ మాత్రం వర్క్ వుట్ అయ్యేలా లేదంటున్నారు. దీనికి కారణం.. ప్రజలు కనెక్ట్ కాని సమస్యల్ని ఎంత ప్రస్తావిస్తే మాత్రం ఫలితం ఉంటుందా? అన్న చిన్న లాజిక్ మిస్ కావటమే.
Tags:    

Similar News