పండుగ వేళ.. ఏపీ గురించి పంచాంగకర్తల మాటేమిటి?

Update: 2020-03-25 18:30 GMT
హిందూ సంప్రదాయంలో పంచాంగానికి ఉన్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. ఫలానా రోజున సూర్యుడు ఏ సమయానికి ఉదయిస్తాడు.. ఎప్పుడు ఆస్తమిస్తాడన్న విషయాన్ని నిమిషాలతో సహా చెప్పేయటమే కాదు... పలు అంశాలకు సంబంధించిన లెక్కలు ఆశ్చర్యానికి గురి చేస్తాయి. పంచాంగానికి సైంటిఫిక్ అప్రోచ్ లేదనే మాటను కొందరు చెప్పినా... అదేమీ నిజం కాదన్న సత్యం చాలా అంశాలు స్పష్టం చేస్తుంటాయి. గ్రహం ఎప్పుడు మొదలై... ఎప్పుడు విడుస్తుందన్న విషయాన్ని ఏడాదికి ముందే.. అంత పక్కాగా చెప్పినప్పుడు... పంచాంగంలో విషయంలో అంతో ఇంతో ఉందన్నది మర్చిపోకూడదు. అందుకే... ఉగాది వస్తుందంటే చాలు... తెలుగు సంవత్సరాది షురూ కావటమే కాదు.. కొత్త సంవత్సరం ఎలా ఉంటుంది? దేశం... రాష్ట్రంలో ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న విషయాల్ని ప్రస్తావిస్తుంటారు.

కరోనాతో ప్రపంచం అతలాకుతలం అవుతున్న వేళ.. రానున్నరోజుల్లో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయి? అన్న ఆసక్తితో పాటు.. మరి.. కరోనా గురించి గతంలో పంచాంగకర్తలు ఏమీ ప్రస్తావించలేదన్న విమర్శ వినిపిస్తోంది. ఇలాంటివేళ.. రానున్న ఏడాది కాలంలో ఎలాంటి పరిస్థితులు ఉండనున్నాయి? వాటి విషయంలో ఏపీ పంచాంగ కర్తలు ఏం చెప్పారు? అన్నది చూస్తే..

ఇప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో పంచాంగ కర్తలు.. పంచాంగ శ్రవణానికి వచ్చే సమయంలో తమతో పాటు.. మాస్కులు.. శానిటైజర్లు వెంట పెట్టుకొని రావటం గమనార్హం. కప్పగుంట్ల సబ్బరామ సోమయాజీ సిద్ధాంతి చెప్పిన దాని ప్రకారం ఈ ఏడాది ఏపీలో గురు సంచారం అనుకూలంగా ఉండటంతో పాడి పరిశ్రమ పురోగతిని సాధిస్తుందన్నారు. అక్టోబరులో తుపాను వచ్చే అవకాశం ఉందన్నారు. ముందస్తు జాగ్రత్తలతో దాన్ని ఎదుర్కొంటారన్నారు. ఈ ఏడాది శని మకరం.. కుంభంలో సంచారం చేయటం కారణంగా కష్టజీవులకు అనుకూలంగా ఉంటుందని చెప్పారు. ప్రపంచాన్ని ఇంతలా వణికిస్తున్న కరోనా గురించి పంచాంగంలో పేర్కొనలేదన్న విమర్శలు సరికావని.. పరోక్షంగా చెప్పిన వైనాన్ని గుర్తు చేశారు.

రాష్ట్రాలకు రాష్ట్రాలే కొట్టుకుపోయే వినాశనం వస్తుందని పరోక్షంగా ప్రస్తావించిన వైనాన్ని గుర్తు చేశారు. జీవనశైలిలో వస్తున్న మార్పులు ఒకేలా ఉండటం లేదని.. కాబట్టి ప్రళయాలు ఏ రూపంలోనైనా వచ్చే వీలుందన్నారు. వణికిస్తున్న కరోనా ఏపీలో మే 30న మరింత పెరుగుతుందన్నారు. అప్పటివరకూ సాధారణంగా ఉంటుందన్న ఆయన.. ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు బాగున్నాయన్నారు.

అమ్మవారిని.. సుబ్రమణ్యేశ్వరస్వామిని పూజించాలన్న ఆయన.. వీలైనంతవరకు ప్రభుత్వాలు ఆలయాల్లో ధన్వంతరి హోమాలు చేయించాలన్నారు. సెప్టెంబరు 23 తర్వాత రాష్ట్రానికి చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పారు. అందరికి జీవనోపాధి ఉంటుందని.. దిగువ మధ్యతరగతి ప్రజలకు అనుకూలంగా ఉంటుందన్నారు. ప్రభుత్వం విజయవంతం అవుతుందని.. రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు రానున్నట్లు చెప్పారు. మొత్తంగా సెప్టెంబరు 23 తర్వాత బాగుంటుందని చెప్పిన ఆయన.. ఆ లోపు పరిస్థితి గడ్డుకాలమేనన్న విషయన్ని మర్చిపోకూడదు.
Tags:    

Similar News