పవన్ రేటు ఇంకా పెంచేశాడబ్బా..

Update: 2018-11-13 04:31 GMT
దక్షిణాదిన సినీ రంగంలో ఒక స్థాయికి చేరాక.. మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాక.. స్టార్ హీరోలు రాజకీయాల వైపు చూడటం మామూలే. చాలా మంది లాగే పవన్ కళ్యాణ్ సైతం ఇటు వైపు అడుగులేశాడు. ఐతే సినీ రంగం నుంచి రాజకీయాల్లోకి అడుగుపెట్టడాన్ని పెద్ద త్యాగం లాగా పవన్ భావిస్తుండటంతో వస్తోంది సమస్య. ఏదో ఒకసారి అంటే ఓకే.. కానీ పదే పదే తాను పెద్ద త్యాగం చేసినట్లుగా చెప్పుకుంటుండటమే విడ్డూరం. సినీ రంగంలో కోట్లు వదులుకుని ప్రజలకు సేవ చేయడానికి వచ్చినట్లుగా పవన్ తరచుగా చెప్పుకుంటున్నాడు. ఇంతకుముందు సినిమాల ద్వారా తాను ఆర్జించే మొత్తం గురించి చిన్న చిన్న ఫిగర్లు చెప్పేవాడు. 20 కోట్లని ఒకసారి.. 50 కోట్లని ఓసారి అన్నాడు. కానీ ఇప్పుడు ఏకంగా రూ.100 కోట్లకు వెళ్లిపోయింది పవన్ ఫిగర్.

ఏటా రూ.100 కోట్ల ఆదాయం వదులుకుని తాను ప్రజలకు సేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చినట్లుగా పవన్ తాజాగా ఒక కామెంట్ చేశాడు. పవన్ తన కెరీర్లో ఎప్పుడూ వేగంగా సినిమాలు చేసింది లేదు. ఒక్కో సినిమాకు కనీసం ఏడాదైనా సమయం తీసుకుంటాడు. మరి ఒక సినిమాకు వంద కోట్లు ఎక్కడి నుంచి వచ్చేస్తాయన్నది అర్థం కాని విషయం. ఒకవైపు సినిమాల నుంచి తానేమీ సంపాదించలేదని.. తన దగ్గర డబ్బులు లేవని.. రాజకీయాల్లో ఖర్చు పెట్టలేనని అంటూ బీద అరుపులు అరిచే పవన్ కళ్యాణే.. ఇప్పుడు ఏకంగా ఏడాదికి వంద కోట్ల ఆదాయం త్యాగం చేసినట్లు మాట్లాడటం విడ్డూరం. మరి ఏడాదికి వంద కోట్లంటే ఇన్నేళ్లలో పవన్ ఎన్ని వందల కోట్లు సంపాదించినట్లు అన్నది కూడా ఆలోచించాల్సిన విషయం. ఈ విషయాలన్నీ పక్కన పెట్టేస్తే.. పదే పదే తానేదో పెద్ద త్యాగం చేసి రాజకీయాల్లోకి వచ్చాననే మాట చెప్పడం ఇక ఆపేస్తే బెటర్.


Tags:    

Similar News