బిపిన్ రావత్ మరణానికి ముందు ఏం జరిగిందంటే?

Update: 2021-12-16 12:30 GMT
హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రివిధ దళాధిపతి బిపిన్ రావత్ మరణించడం విషాదం నింపింది. తాజాగా ఈ ప్రమాదానికి సంబంధించిన  మరిన్ని విషయాలు బయటకు వచ్చాయి. హెలికాప్టర్ కుప్పకూలిపోగానే అక్కడికి వచ్చిన ప్రత్యక్ష సాక్షికి సీడీఎస్ జనరల్ బిపిన్ రావత్ కొంతసేపు ప్రాణాలతో కొట్టుమిట్టాడారని గుర్తించారు. ఈ మేరకు ప్రత్యక్ష సాక్షి ఒకరు తెలిపారు. తీవ్ర గాయాలతో ఉన్న ఓ వ్యక్తి తనను మంచినీళ్లు కావాలని అడిగారని.. అయితే ఆయనే బిపిన్ రావత్ అన్న విషయం తనకు తర్వాత తెలిసిందని చెప్పారు.

తమిళనాడులో ఆర్మీ హెలిక్యాప్టర్ ప్రమాదం తర్వాత జరిగిన ఓ ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. తీవ్రంగా గాయపడ్డ బిపిన్ రావత్ ను ఆయన ఎవరో తెలియక అంబులెన్స్ సిబ్బంది తరలిస్తున్నారు. ఈ సందర్భంగా అంబులెన్స్ లో హిందీలో మాట్లాడారని.. ఇది తమకు అర్థం కాలేదని సిబ్బంది తెలిపారు.

అంబులెన్స్ లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి బిపిన్ రావత్ అనే విషయం తమకు తెలియదని అంబులెన్స్ సిబ్బంది తెలిపారు. ఆయన హిందీలో ఏదో మాట్లాడారని.. తనను కాపాడమని కోరినట్లు భావించామని పేర్కొన్నారు.

తమిళనాడులోని కున్నూరు సమీపంలో హెలికాప్టర్ కూలిన ఘటన ఆ తర్వాత నెలకొన్న భీతావహ పరిస్థితులను కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ‘మధ్యాహ్నం సమయంలో మేం పనిచేస్తున్న ప్రాంతానికి సమీపంలో భారీ శబ్ధం వినిపించింది. అక్కడకు వెళ్లి చూస్తే ఓ హెలికాప్టర్ మంటల్లో కాలుతూ కనిపించింది.దట్టమైన పొగ రావడంతో ముందు మాకెవరూ కనిపించలేదు. ఆ తర్వాత ఇద్దరు వ్యక్తులు తీవ్ర గాయాలతో నేలపై పడి ఉన్నారు. మేం వారి దగ్గరకు వెళ్లాం.. ఆ సమయంలో ఓ వ్యక్తి మంచినీళ్లు కావాలని అడిగారు. మేం ఆయనను బెడ్ షీట్ తోనే బయటకు లాగాం. ఆ తర్వాత రెస్క్కూ సిబ్బంది వచ్చి ఆయనను తీసుకెళ్లారు. నేను మాట్లాడిన వ్యక్తి సీడీఎస్ జనరల్ రావత్ అని నాకు తర్వాత కొందరు చెప్పారు. ఆయన ఎంతో గొప్ప వ్యక్తి అని అప్పుడే తెలిసిందని ప్రత్యక్ష సాక్షి తెలిపారు.

రెస్క్యూ , అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి వచ్చి చూసేసరికి కేవలం ఇద్దరు మాత్రమే ప్రాణాలతో ఉన్నట్టు సీనియర్ ఫైర్ మ్యాన్ తెలిపారు. అందులో ఒకరు సీడీఎస్ రావత్ అని అన్నారు. ఆయనను ఆస్పత్రికి తీసుకెళుతుండగా రక్షణశాఖ సిబ్బందికి తన పేరును హిందీలో చెప్పారని తెలిపారు. మార్గమధ్యంలోనే ఆయన మరణించారని అన్నారు. గాయపడిన మరో వ్యక్తి గ్రూప్ కెప్టెన్ వరుణ్ సింగ్ అని గుర్తించేందుకు చాలా సమయం పట్టిందన్నారు.
Tags:    

Similar News